అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తే ఏం జరుగుతుంది?

0
3


అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తే ఏం జరుగుతుంది?

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం : భారత్‌లో పదేపదే ఉగ్రవాద దాడులు చేస్తూ రక్తపాతం పారిస్తున్న జైష్‌ ఎ మహమ్మద్‌ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్‌ అజార్‌ను ఐరాస భద్రతా మండలి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. దీంతో భారత్‌ సుదీర్ఘకాలంగా చేస్తున్న పోరాటం ఫలించింది. చైనా పలుమార్లు ఈ తీర్మానాన్ని అడ్డుకున్నప్పటికీ అమెరికా, ఫ్రాన్స్‌, ఇంగ్లాండ్‌లు గట్టిగా తీర్మానానికి మద్దతు పలకడంతో చైనా తన అభ్యంతరాలను వెనక్కుతీసుకొని మౌనంగా ఉండిపోయింది.

అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం వల్ల..
1999లో  భద్రతామండలి 1267 తీర్మానాన్ని తాలిబాన్లపై ఆంక్షలను విధించేందుకు తీసుకువచ్చింది. కాలక్రమంలో ఇదే తీర్మానాన్ని మానవాళికి తీవ్రనష్టం కలిగిస్తున్న ఉగ్రనేతలపై ప్రవేశపెట్టారు. ఉగ్రవాదసంస్థలపై కూడా అమలు చేస్తున్నారు.
ఆస్తుల స్తంభన..
ఈ తీర్మానంతో ఎవరైనా అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించబడితే అతని ఆస్తున్ని్ంటిని స్తంభింపచేస్తారు. ఐక్యారాజ్యసమితిలోని సభ్యదేశాల్లో ఉగ్రవాది లేదా ఉగ్రవాదసంస్థకు చెందిన ఆస్తులన్నింటినీ స్తంభింపచేస్తారు. దీంతో ఆర్థికవనరుల లభ్యత దొరకక ఉగ్రవాదులు విలవిలలాడుతారు. దీనితో పాటు ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయో  ఆ మార్గాలను పూర్తిగా మూసివేస్తారు. బ్యాంకుల్లోని నిధులను కూడా స్తంభింపచేస్తారు.
విదేశీ ప్రయాణంపై నిషేధం
అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన వెంటనే  ఆ వ్యక్తి ఇతర దేశాలకు ప్రయాణంచేసే అవకాశాన్ని కోల్పోతాడు. ఉగ్రవాద సంస్థలను గుర్తిస్తే వీటి సభ్యులు కూడా విదేశీ ప్రయాణాలు చేయలేరు.
ఆయుధ సరఫరాపై నిషేధం..
ఐరాసలోని సభ్యదేశాలన్నీ ఈ ఉగ్రవాదికి అందే ఆయుధ సరఫరాను పూర్తిగా నియంత్రించాల్సివుంటుంది. సలహాలు, శిక్షణ, ఆయుధాలను  సరఫరా చేయడంవంటివి సభ్యదేశాలు చేపట్టకూడదు. 
పాక్‌ ఏం చేయనుంది..
మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడంతో పాక్‌ ఏం చేయనుందన్న అంశంపై అందరూ ఆసక్తిగా ఉన్నారు. పాక్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు  ప్రత్యేకించి భారత్‌కు వ్యతిరేకంగా బహిరంగంగానే జరుగుతుంటాయి. ఐరాస తీర్మానం మేరకు సభ్యదేశంగా పాక్‌ మసూద్‌పై కఠిన చర్యలు తీసుకోవాల్సివుంటుంది. అయితే ఏ మేరకు ఐరాస తీర్మానాన్ని పాక్‌ అమలు చేయనుందన్న అంశంపై పలు సందేహాలు నెలకొన్నాయి. ఇప్పటికే పాక్‌లోని లష్కర్‌ తొయిబాను కూడా అంతర్జాతీయ ఉగ్రవాదిగా సంస్థగా ఐరాస ప్రకటించివుంది. అయితే లష్కర్‌ కట్టడికి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
భారత్‌కు దౌత్యవిజయం
మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా నిలబెట్టడంతో భారత్‌ పూర్తి విజయం సాధించిందని చెప్పవచ్చు. భద్రతామండలిలో శాశ్వత సభ్యదేశమైన చైనా అనేకసార్లు ఈ తీర్మానాన్ని అడ్డుకున్నా చివరకు అంగీకరించింది. బ్రిటన్‌, ఫ్రాన్స్‌, అమెరికా … తదితరదేశాలను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు భారత దౌత్యవర్గాలు కృషి చేశాయి. రానున్న రోజుల్లో అంతర్జాతీయ ఉగ్రవాదానికి పాక్‌ పురిటిగడ్డ అని నిరూపించేందుకు కూడా చర్యలు చేపట్టే అవకాశముంది.

Tags :

  • masood azhar
  • UNO
  • India



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here