అనుభవానికి పెద్దపీట వేస్తా.. చిరంజీవిని ఎన్టీఆర్‌తో పోల్చిన పవన్

0
1


అనుభవానికి తాను చాలా పెద్దపీట వేస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ అన్నయ్య చిరంజీవిపై ప్రశంసల వర్షం కురిపించారు. కొత్తహీరోలు ఎంత మంది వచ్చినా చిరంజీవి లాంటి హీరో అనుభవం ముందు వాళ్లంతా నిలవలేరని సోదాహరణంగా పవన్ కళ్యాణ్ వివరించారు. ఈ సందర్భంగా విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారకరామారావు ప్రస్తావన తీసుకొచ్చారు.

‘‘అనుభవానికి నేను చాలా పెద్దపీట వేస్తాను. ఇదెప్పుడు నేర్చుకున్నానంటే.. అన్నయ్య ‘ఖైదీ’ సినిమా విడుదలైన తరవాత. చిరంజీవిగారికి చాలా బలమైన స్టార్ డమ్ స్టార్ట్ అయినప్పుడు ఒక తమ్ముడిగా మా అన్నయ్య చాలా పెద్ద హీరో అని అనుకున్నాను. ఆ సమయంలో ఎన్టీ రామారావు గారి ‘విశ్వామిత్ర’ సినిమా వచ్చింది. ఆ సినిమా అన్ని రికార్డులను బద్దలుకొట్టేసింది. ఆ రోజు నాకు అర్థమైంది ఏంటంటే.. ఒక వ్యక్తి తాలూకా అనుభవాన్ని ఎప్పుడూ తీసేయలేం. అలాగే ఎంత మంది కొత్తవాళ్లు వచ్చినా, ఎంత మంది రికార్డులు బద్దలుకొట్టినా చిరంజీవి గారి అనుభవాన్ని కొట్టేయలేం’’ అని పవన్ అన్నారు.

Also Read: చిరంజీవికి, తెలంగాణ విద్యార్థుల ఆత్మహత్యలకు ముడిపెట్టిన పవన్

తానెంతగానో గౌరవించే అన్నయ్య ‘సైరా నరసింహారెడ్డి’ లాంటి భారతదేశం గర్వించదగిన సినిమా తీయడం పట్ల తనకు చాలా ఆనందంగా ఉందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తాను నటుడిగా మారకముందు ‘శుభలేఖ’ సినిమాలో ఒక డబ్బింగ్ డైలాగ్ చెప్పానని, మళ్లీ తన గళం ఇచ్చింది ‘సైరా నరసింహారెడ్డి’కి అని పవన్ ఈ సందర్భంగా చెప్పారు. సినిమా క్లైమాక్స్‌‌కు శనివారమే తాను డబ్బింగ్ చెప్పానని తెలిపారు. జనగణమన గొప్పతనాన్ని చెప్పే విధంగా ఆ డైలాగులు ఉంటాయన్నారు.

స్వాతంత్య్ర యోధుల త్యాగాలను గుర్తించేలా, వాళ్ల త్యాగాన్ని కొనియాడేలా, వారి త్యాగాన్ని స్మరించుకునేలా సాయి మాధవ్ బుర్రా అద్భుతంగా డైలాగులు రాశారని పవన్ కొనియాడారు. ఆ త్యాగమూర్తులకు ఇదొక కృతజ్ఞతా గీతం అన్నారు. ‘‘మీరు మాకోసం అసువులుబాసారు. మీరు మాకోసం రక్తం దారబోశారు. మీరు మాకోసం కుటుంబాలనే ఛిద్రం చేసుకున్నారు. దోపిడీలు చేసేవాళ్లు కాదు.. మహనీయులు వాళ్లు. ఉన్న ఆస్తులను ప్రజలకు ఇచ్చేశారు. అలాంటి మహనీయులకు కృతజ్ఞతా సూచికగా మనం జనగణమన ఆలపిస్తాం. అందుకని ఆ గీతానికి మర్యాద ఇద్దాం, లేచి నిలబడతాం అని చెప్పడానికి నా గళాన్ని ఇమ్మన్నారు’’ అని పవన్ వెల్లడించారు.

తాను చాలా గర్వంగా, మనస్ఫూర్తిగా తన గళాన్ని ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాకు ఇచ్చానని పవన్ అన్నారు. ఎందుకంటే, ఇది తన దేశం కోసం, ప్రజల కోసం తీసిన సినిమా అని అన్నారు. ఇలాంటి గొప్ప సినిమాలో తాను ఒక భాగం కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. తెలుగు సినిమా స్థాయిని ఒక్క భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి గారు ఇక్కడికి రావడం చాలా సంతోషకరం అన్నారు. ఎవరు ఎన్ని విజయాలు సాధించినా తమకు అసూయ కలగదని, ఇంకా ఆనందపడతామని, ఇదే అన్నయ్య తమకు నేర్పించిన సంస్కారమని పవన్ చెప్పారు. తాము పదిమంది బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటామన్నారు.

Also Read: పవన్ కాళ్లు పట్టుకున్న అభిమాని.. బౌన్సర్లను నెట్టి గుండెకు హత్తుకున్న జనసేనాని

‘‘రాజమౌళి గారు గెలిస్తే మాకు ఆనందంగా ఉంటుంది. రాజమౌళి గారు రికార్డులు బద్దలుకొడితే ఆనందంగా ఉంటుంది. సురేందర్ రెడ్డిగారు రికార్డులు బద్దలుకొడితే ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే, ఇది మన సినిమా, మన జాతి, మన భారతజాతి, మన తెలుగుజాతి’’ అంటూ ఆవేశంగా మాట్లాడారు. ‘సైరా నరసింహారెడ్డి’ లాంటి సినిమాను భారతదేశ ప్రజలకు అందిస్తోన్న నటీనటులు, సాంకేతిక నిపుణులకు తాను పేరుపేరున ధన్యవాదాలు తెలుపుతున్నానంటూ ప్రసంగాన్ని ముగించారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here