అపాయం తెలియని పసిప్రాణం

0
4


అపాయం తెలియని పసిప్రాణం

గత నెల 29న సూరత్‌లో ఓ పాఠశాల విద్యార్థిని వర్షంలో తడుస్తూ ఇంటికి వెళ్తుండగా పొరపాటున విద్యుత్తు స్తంభాన్ని పట్టుకొంది. విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతిచెందింది. సీసీ కెమెరాలో రికార్డయిన ఈ దృశ్యం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ గేటెడ్‌ కమ్యూనిటీలో ఓ బాలుడు సైతం ఇలానే మృతిచెందాడు.

 

ప్రస్తుతం అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. పిల్లలు బడి నుంచి ఇంటికి వెళ్లే సాయంత్రం సమయంలోనే ఎక్కువగా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్తు స్తంభాల కారణంగా జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉభయ జిల్లాల్లో అనేక పాఠశాలలకు సమీపంలో విద్యుత్తు స్తంభాలు, నియంత్రికలు ఉన్నాయి. ముఖ్యంగా ఏళ్లనాటి ఇనుప స్తంభాల నిర్వహణ సరిగా లేదు. రోడ్లపై వరద నీరు ప్రవహిస్తున్న సమయంలో పాదచారులు అదును కోసం వాటిని పట్టుకుంటున్నారు. ముఖ్యంగా పిల్లలు వాటి సమీపంగా వెళ్తున్నారు. విద్యుత్తు అధికారులు ఎటువంటి ప్రమాదం జరగక ముందే చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రధానంగా ఇనుప స్తంభాల స్థానంలో సిమెంటువి ఏర్పాటు చేయడం, నియంత్రికల చుట్టూ కంచెలు నిర్మించడం వంటివి చేయాల్సి ఉంది.

హైదరాబాద్‌ సీతాఫల్‌మండిలోని ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం తమ సమీపంలోని విద్యుత్తు స్తంభానికి చెక్కలతో ఇలా ఫ్రేమ్‌ కట్టారు. పిల్లలు పొరపాటున తగిలినా ప్రమాదం జరగకుండా ఇలా చేశారు. జిల్లాలోని పాఠశాలల యాజమాన్యాలు సైతం ఈ విధంగా ఆలోచిస్తే మంచింది.

ప్రాణాలతో చెలగాటం ‘ఆడుతున్నారు’

సిరికొండలోని సూభాశ్‌ చౌరస్తాలో ఇనుప స్తంభం తుప్పుపట్టి, కింద అడుగు భాగంలో రంధ్రం పడి శిథిల దశకు చేరింది. చిన్నారులు పాఠశాలకు ఈ మార్గం గుండానే వెళ్తుంటారు. సాయంకాలం దీని సమీపంలోనే ఆడుకుంటుంటారు. అసలే వర్షాకాలం.. విద్యుత్తు తీగల్లో ఏ ఒక్కటి స్తంభానికి తాకినా ప్రమాదమే. పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

– సిరికొండ

 

ఒకేచోట మూడు

మోపాల్‌ మండలం కులాస్‌పూర్‌లో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటికి మరోపక్క మూడు విద్యుత్తు నియంత్రికలు ఏర్పాటు చేశారు. చుట్టూ కంచె లేదు. విద్యార్థులు రాకపోకలు సాగించేందుకు, మూత్ర విసర్జనకు వీటి సమీపంగానే వెళ్తుండడం ఆందోళన కలిగించే అంశం.

– మోపాల్‌

 

ఇరుకైన దారిలో..

బోధన్‌ పట్టణం ఆజాంగంజ్‌ ప్రాథమిక పాఠశాల ఎదుటే విద్యుత్తు నియంత్రిక ఉంది. బడిలోకి అడుగు పెట్టాలంటే దీన్ని దాటి వెళ్లాల్సిందే. పక్కనే మూత్రశాలలు ఉన్నాయి. పిల్లలు ఆడుకోవాలన్నా అక్కడే. ఇరుకైన మార్గంలో విద్యార్థులు రాకపోకలు సాగించాల్సి వస్తోంది. ఏమరుపాటుగా వ్యవహరిస్తే అపాయమే.

– బోధన్‌ పట్టణం

 

ప్రమాదమని తెలిసినా పట్టదా

మాక్లూర్‌తండా ప్రాథమిక పాఠశాలతో పాటు అంగన్‌వాడీ భవనం ఉండే ప్రాంతంలో తక్కువ ఎత్తులో విద్యుత్తు నియంత్రిక ఉంది. చిన్నారులు ఆడుకుంటూ అటువైపు వెళితే పెనుప్రమాదం సంభవించే అవకాశముంది. చిన్నారుల రక్షణ కోసం పాఠశాల గేటు ఎప్పుడూ మూసి ఉంచుతున్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఆవరణలో ఉన్న విద్యుత్తు మోటారు డబ్బాతో ప్రమాదం పొంచి ఉందని, దాన్ని బయటకు మార్చాలని కోరుతున్నారు.

– మాక్లూర్‌తండా(ఇందల్‌వాయి)

 

ఆవరణలోనే ఇలా..

నవీపేటలోని బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో కొన్నేళ్లుగా ఇనుప విద్యుత్తు స్తంభం ప్రమాదకరంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రమాదకరమైన 11 కేవీ విద్యుత్తు తీగలు సైతం బడి ప్రాంగణం మీదుగా ఏర్పాటు చేశారు. ప్రధాన గేటు వద్ద మరో ఇనుప స్తంభంతో సైతం ప్రమాదం పొంచి ఉంది. నవీపేటలోని బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలకు సమీపంలో రోడ్డు(బాలుర పాఠశాల వద్ద) పక్కన నియంత్రిక ఏర్పాటు చేశారు. ఇనుప స్తంభాలపై ఉన్న దీని చుట్టూ కంచె లేకపోవడంతో ప్రమాదకరంగా మారింది.

– నవీపేట

 

బడి పక్కనే నియంత్రిక

మాక్లూర్‌ ప్రభుత్వ పాఠశాల పక్కనే నియంత్రిక ఉంది. విద్యార్థులు దాని పక్క నుంచే మూత్రవిసర్జనకు వెళ్తుంటారు. దుకాణాలకు వెళ్లే మార్గంలో ఇనుప స్తంభాలు ఉన్నాయి. వాటిని ఆనుకొనే విద్యార్థులు నడక సాగిస్తారు. వర్షాకాలం నేపథ్యంలో ట్రాన్స్‌కో అధికారులు కంచెలు ఏర్పాటు చేసి, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది.

– మాక్లూర్‌ గ్రామీణం

 

చేతికందే ఎత్తులో..

బీర్కూర్‌ మండలం అన్నారం ప్రాథమిక పాఠశాల వెనుక విద్యుత్తు నియంత్రిక కంచె లేకుండా ఉంది. విద్యార్థులు దీని పరిసర ప్రాంతాల్లో తిరుగుతుంటారు. ఎప్పుడేం ప్రమాదం జరుగుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దామరంచ ఉన్నత పాఠశాల ఎదుట విద్యుత్తు స్తంభానికి ఉన్న తీగలు విద్యార్థులకు చేతికి అందే ఎత్తులో కిందకు వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. వీటిని సరి చేయాలని ఉపాధ్యాయులు, గ్రామస్థులు పలుమార్లు ట్రాన్స్‌కో అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదు.

– బీర్కూర్‌

 

పొంచిన ముప్పు

కామారెడ్డి పట్టణం బ్రాహ్మణగల్లీ ప్రధాన మార్గంలో ఉన్న ఇనుప విద్యుత్తు స్తంభంతో ప్రమాదం పొంచి ఉంది. ఈ రోడ్డు మీదుగా మూడు పాఠశాలల విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. వర్షాకాలంలో ఇక్కడే ఆడుతుంటారు. పొరపాటున పట్టుకుంటే విద్యుదాఘాతానికి గురయ్యే అవకాశాలున్నాయి.

– కామారెడ్డి పట్టణంSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here