అమెజాన్ ‘ఎకో ఫ్రేమ్స్’: ఇది సాధారణ కళ్లజోడు కాదు.. అందుకే వివాదం!

0
3


అమెజాన్ ‘ఎకో ఫ్రేమ్స్’: ఇది సాధారణ కళ్లజోడు కాదు.. అందుకే వివాదం!

అమెజాన్‌ ఎకో స్పీకర్ ‘అలెక్సా’ గుర్తుంది కదా? ఇంట్లోనో, ఆఫీసలోనో ఇంటర్నెట్‌కు అనుసంధానమై.. ఇది మనం అడిగే పలు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమేకాదు, లేటెస్ట్ న్యూస్ వినిపిస్తుంది. మీకు నచ్చిన సంగీతాన్ని ప్లే చేస్తుంది. మీకే సమాచారం కావాలన్నా అలెక్సాని అడిగితే క్షణాల్లో చెప్పేస్తుంది. ఇంటరాక్టివ్ వాయిస్ టెక్నాలజీ ఆధారంగా పని చేసే ఈ అలెక్సా ఎకో స్పీకర్ ప్రస్తుతం ఎంతో మంది ఇళ్లలో దర్శనమిస్తోంది.

ఇక తాజాగా అమెజాన్ విడుదల చేసిన మరో డివైజ్ ‘ఎకో ఫ్రేమ్స్‌’. రెండ్రోజుల క్రితం కంపెనీ వీటిని మార్కెట్లోకి విడుదల చేసిందో లేదో.. అప్పుడే ఇవి పెద్ద దుమారాన్ని సృష్టించాయి. వీటిని అలెక్సా స్మార్ట్‌ గ్లాసెస్‌ అని కూడా పిలుస్తున్నారు. అయితే అమెజాన్ విడుదల చేసిన ఈ సరికొత్త డివైజ్ కారణంగా వినియోగదారుల ప్రైవసీ దెబ్బతింటుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏమిటీ అమెజాన్ ‘ఎకో ఫ్రేమ్స్’?

అమెజాన్ కొత్తగా విడుదల చేసిన ‘ఎకో ఫ్రేమ్స్’ కళ్లజోడు మాదిరిగా ఉంటుంది. ఈ ఫ్రేముల్లో మన కళ్లకు సరిపడే సైట్ లేదా కూలింగ్ గ్లాసెస్ బిగించుకోవచ్చు. కళ్లజోడుకు ఇరువైపుల రెండు మైక్రోఫోన్లు ఉంటాయి. ఇక స్మార్ట్‌ఫోన్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తే చాలు.. మనం కోరుకున్న పాటలను, వార్తలను, జోకులను వినవచ్చు. జేబులో నుంచి ఫోన్‌ తీయాల్సిన అవసరం లేకుండానే నోటి ద్వారా మిత్రులకు, బంధువులకు ఫోన్ కాల్ కలపమని అడిగి.. కాల్ కనెక్ట్ అవగానే నేరుగా మాట్లాడవచ్చు.

బాగానే ఉందికానీ…

అమెజాన్ విడుదల చేసిన ఈ ‘ఎకో ఫ్రేమ్స్’ డివైజ్ బాగానే ఉందిగానీ.. సమస్య ఎక్కడొచ్చిందంటే.. ఈ గ్లాసెస్‌ ధరించిన వారు ఇతరులతో మాట్లాడే ప్రతిమాటను కళ్లజోడుకున్న రెండు మైక్రో ఫోన్లు రిసీఫ్‌ చేసుకొని అమెజాన్‌ కంపెనీ కార్యాలయంలోని టేపుల్లో రికార్డు చేసే అవకాశం ఉంది. దీంతో ఎవరేం మాట్లాడుకున్నా.. ఆ మాటలు రికార్డ్ అయిపోతాయి. దీని గురించే వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అలెక్సా ‘ఎకో స్పీకర్’ విషయంలోనూ…

గతంలో అమెజాన్‌ కంపెనీ మార్కెట్‌లోకి విడుదల చేసి ‘అలెక్సా ఎకో స్పీకర్‌’ విషయంలోనూ ఈ తరహా ఆందోళనే వ్యక్తమైంది. దీనికి కారణం.. మాటలను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం వీటికి ఉండడమే. మన నోటి మాటలను ఈ స్పీకర్ గ్రహించి, వాటిని అర్థం చేసుకుని, వాటికి తగిన ఫలితాన్ని అందిస్తుంది. ఈ స్పీకర్ ఆఫ్ మోడ్‌లో ఉన్నంత వరకు పర్వాలేదుకానీ.. ఆన్ మోడ్‌లో ఉన్నప్పుడు ఆ సమీపంలో ఏం మాట్లాడుకున్నా.. మన మాటలను గ్రహించి రియాక్ట్ అవుతుంది.

మాటలన్నీ బయటికే, ఇంకెక్కడి ప్రైవసీ…

సరిగ్గా ఈ అంశంపైనే అలెక్సా వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొరపాటున ఎవరైనా దీన్ని పడగ్గదిలో పెట్టుకుంటే.. ఎప్పుడైనా ఆఫ్ చేయడం మర్చిపోతే ఏంటి పరిస్థితి? పడగ్గదిలో భార్యభర్తల ముచ్చట్లన్నీ ఈ స్పీకర్ వినేస్తుంది, పైగా వాటిని రికార్డు చేస్తుంది. మరి అలా రికార్డు అయిన మాటలన్నీ ఎవరైనా వినేస్తే? సరిగ్గా ఈ అంశంపైనే గతంలో అమెరికాలో ఓ జంట తమ పడక గది ముచ్చట్లను కూడా అలెక్సా స్పీకర్‌ రికార్డు చేసిందని ఆరోపిస్తూ కోర్టుకు కూడా ఎక్కారు.

ఇప్పుడు ‘ఎకోఫ్రేమ్స్’ కూడా అంతే…

మాటలను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అలెక్సా ఎకో స్పీకర్‌ను తయారు చేశారు. ఈ స్పీకర్‌కు ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇస్తే మన మాటల ద్వారా అది స్పందిస్తుంది. అంటే, మనకు కావాల్సిన పాటలు, వార్తలు లేదా జోకులు వినిపించమని నోటి ద్వారా కోరితే అలెక్సా యాప్‌ స్పందించి ఇంటర్నెట్‌ నుంచి వాటిని సేకరించి దానికి అనుసంధానించిన స్పీకర్‌ ద్వారా వినిపిస్తుంది. మన కమాండ్‌ను రిసీవ్‌ చేసుకుంటోంది కనుక అది మాటలను, ముచ్చట్లను కూడా వినే అవకాశం ఉంటుంది. మనం కమాండ్‌ ఇచ్చినప్పుడు మాత్రమే స్పందించి మిగతా సమయాల్లో అదంతట అదే ఆఫ్‌ అయ్యే పద్ధతి ఉండాలి. అది లేదు. అలాంటప్పుడు మన మాటలను, ముచ్చట్లను కంపెనీ టేపుల్లో రికార్డు చేసే అవకాశం ఉండకూడదు.

అసలు మాటల రికార్డింగ్ ఎందుకంటే…

అలెక్సా అనే ఈ ఇంటరాక్టివ్ వాయిస్ టెక్నాలజీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదు. ఇదొక నిరంతర ప్రక్రియ. అందుకే ఈ సాంకేతికతను మరింత అభివృద్ధి చేసేందుకే అమెజాన్ వినియోగదారులు తమ నోటి ద్వారా ఇచ్చే కమాండ్స్‌ను స్పీకర్ రికార్డు చేస్తూ ఉంటుంది. అందరి మాట ఒకేలా ఉండదు కదా? ఒక్కొక్కరి మాట ఒక తీరుగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల భాష, యాస తేడాగా ఉంటుంది. మరి ఇలాంటి అన్ని రకాల తేడాలను గుర్తించి స్పందించే విధంగా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివద్ధి చేయాలన్న సంకల్పంతోనే ఇలా రికార్డ్ చేస్తున్నారు.

ఫుల్ ప్రైవసీ.. మాది గ్యారెంటీ…

అయితే అమెజాన్ కంపెనీ వర్గాలు మాత్రం అలెక్సా వినియోగదారుల మాటల రికార్డింగ్ విషయంలో ఫుల్ గ్యారెంటీ ఇస్తోంది. తాము దీనిని ఉద్దేశపూర్వకంగా అనుమతిస్తున్నామని, ఎవరు ఏం మాట్లాడారో బయట పెట్టం కనుక, వినియోగదారుల ప్రైవసీకి వచ్చిన నష్టమేమీ ఉండదని వాదిస్తోంది. అయితే ఈ ఇంటరాక్టివ్ వాయిస్ టెక్నాలజీ అభివృద్ధిలో ప్రైవేటు ఏజెన్సీలకు కూడా భాగస్వామ్యం ఉండడంతో.. ఈ ఏజెన్సీలు వినియోగదారుల ఆడియో ఫైల్స్‌ను అమ్ముకునే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ కార్డులే రూ.500కి దొరుకుతున్నప్పుడు ఈ ఆడియో ఫైల్స్ ఇతరుల చేతుల్లో పడవనే గ్యారెంటీ ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here