ఆందోళనబాట

0
6


ఆందోళనబాట

శరవేగంగా నిర్మాణం.. అందని పరిహారం

సాగుతున్న రహదారి విస్తరణ పనులు

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

ఎన్‌హెచ్‌-161 (సంగారెడ్డి-నాందేడ్‌-అకోలా) నాలుగు వరుసల రహదారి విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. జాతీయ రహదారి నిర్మాణ సంస్థ అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా సాగు భూములు, నివాస గృహాలు కోల్పోతున్న మూడు గ్రామాల నిర్వాసితులకు మాత్రం పరిహారం అందించడం లేదు. మరో నెల రోజుల్లో పల్లెలు ఖాళీచేయాల్సి ఉన్నా ఇప్పటి వరకు పరిహార ప్రకటన లేకపోవడంతో ఆయా గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

 

నిజాంసాగర్‌, పిట్లం, పెద్దకొడప్‌గల్‌, బిచ్కుంద, జుక్కల్‌, మద్నూర్‌ మండలాల్లోని 28 గ్రామాల్లో జాతీయ రహదారి విస్తరణతో రైతులు సాగు భూములను కోల్పోతున్నారు. బిచ్కుంద మండలం ఫత్లాపూర్‌, కందర్‌పల్లి, పిట్లం మండలం చిన్నకొడప్‌గల్‌ గ్రామాల్లో పెద్దఎత్తున నివాస గృహాలు తొలగించాల్సి వస్తోంది. ఈ పల్లెల్లో పరిహారం అందించేందుకు రెవెన్యూ వారు ఎన్‌హెచ్‌ఏఐకి ప్రతిపాదనలు పంపించినా.. నిబంధనల పేరుతో సదరు అధికారులు పెండింగ్‌లో పెట్టారు.

యాభైకి పైగా ఉంటే..

సుమారు యాభైకిపైగా నివాసాలు ఉన్న గ్రామాలకు సమీపంలో బైపాస్‌ వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎన్‌హెచ్‌-161 పనులకు సంబంధించి పిట్లం, పెద్దకొడప్‌గల్‌, మేనూర్‌, మద్నూర్‌లోనే బైపాస్‌లు నిర్మిస్తున్నారు. ఫత్లాపూర్‌లో సుమారు 1-2 వందల వరకు, కందర్‌పల్లిలో యాభైకి పైగా నివాస గృహాలు విస్తరణలో పోతున్నాయి.

రీ సర్వేకు వెనుకడుగు

ఫత్లాపూర్‌, కందర్‌పల్లి, చిన్నకొడప్‌గల్‌లో బైపాస్‌లు లేకుండానే రహదారి విస్తరణ పనులు చేపట్టేలా కార్యాచరణ రూపొందించారు. మరోసారి సర్వే చేపట్టాలని ప్రజలు ఎన్‌హెచ్‌ అధికారులకు మొరపెట్టుకున్నా సర్వేకు ససేమిరా అంటున్నారు. ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం వల్లనే అధికారులు రీ సర్వే చేపట్టడం లేదని ఆయా గ్రామస్థులు వాపోతున్నారు.

అరకొరనే…

జాతీయ రహదారి విస్తరణలో భాగంగా భూములు, నివాస గృహాలను తీసుకుంటామని రెవెన్యూ అధికారులు ఏడాది కిందట నోటీసులు ఇచ్చారు. ప్రస్తుత మార్కెట్‌లో సాగు భూముల ధరలు గణనీయంగా పెరిగిపోయాయి. ప్రధానంగా జాతీయ రహదారి సమీపంలో ఉన్నవి ఎకరాకు రూ.40-50 లక్షల వరకు పలుకుతుండగా ప్రభుత్వం మాత్రం రూ.5 లక్షల చొప్పున చెల్లిస్తామని ప్రకటించింది. ఇది ఏ మాత్రం గిట్టుబాటు కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిర్దేశిత సమయంలోగా..

సంగారెడ్డి నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు చేపట్టిన ఎన్‌హెచ్‌-161(సంగారెడ్డి-నాందేడ్‌-అకోలా) విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. నిర్దేశిత సమయంలోగా పనులను పూర్తిచేయడానికి గుత్తేదారులు, అధికారులు ప్రణాళికాయుతంగా ముందుకెళ్తున్నారు.

మూడు నిర్మాణ సంస్థలు

భూసేకరణ ఆలస్యమవుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఏప్రిల్‌ కల్లా పనులు పూర్తిచేసేలా అధికారులు కార్యాచరణను రూపొందించారు. నిజాంసాగర్‌ మండలం నర్సింగరావుపల్లి నుంచి మద్నూర్‌ సలాబత్‌పూర్‌ వరకు 58 కి.మీ. రోడ్డు విస్తరణ పనులను మూడు విభాగాలుగా విభజించి, జాతీయ స్థాయిలో పేరొందిన మూడు నిర్మాణ సంస్థలకు అప్పగించారు.

వారం రోజుల్లో పరిహారం

– రాజేశ్వర్‌, ఆర్డీవో, బాన్సువాడ

ఫత్లాపూర్‌ ప్రజలకు మరో వారం రోజుల్లో పూర్తిస్థాయిలో పరిహారం అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. చిన్నకొడప్‌గల్‌ నిర్వాసితులకు వారి బ్యాంకు ఖాతాల్లో నష్టపరిహారం జమ చేస్తున్నాం. కందర్‌పల్లికి సంబంధించిన అవార్డు మంజూరైంది. ప్రభుత్వ నిబంధనల మేరకు పరిహారం అందిస్తాం.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here