ఆచార్యులు అంకితభావంతో పని చేయాలి

0
0


ఆచార్యులు అంకితభావంతో పని చేయాలి

తెవివి క్యాంపస్‌(డిచ్‌పల్లి), న్యూస్‌టుడే: ఆచార్యులు సకాలంలో విధులకు హాజరై అంకితభావంతో పని చేయాలి. నిత్యం హైదరాబాద్‌ నుంచి విధులకు హాజరుకావడం సరైన పద్ధతి కాదని తెలంగాణ విశ్వవిద్యాలయ ఇన్‌ఛార్జి ఉపకులపతి, ఐఏఎస్‌ అధికారి అనిల్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఇన్‌ఛార్జి వీసీ శుక్రవారం వర్సిటీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాలినడకన కామర్స్‌, ఆర్ట్స్‌, సైన్స్‌ కళాశాలలతో పాటు, వసతి గృహాలు, కేంద్రీయ గ్రంథాలయాన్ని పరిశీలించారు. వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, బాలికలను సాయంత్రం 6 గంటల తర్వాత బయటికి పంపొద్దని సిబ్బందికి సూచించారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం అంతా సమష్టిగా కృషి చేయాలన్నారు. విభాగాల వారీగా అవసరాలు రాసివ్వాలని, వేతనాల పెంపు, పదోన్నతులు కల్పించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. విద్యార్థుల సంఖ్య, కోర్సులు, పరీక్ష ఫలితాల గురించి పరీక్షల నియంత్రణాధికారి సంపత్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. ఇక నుంచి ఒక గ్రాఫ్‌ పట్టికలో డిగ్రీ, పీజీ పరీక్ష ఫలితాలను చూపించాలని ఆదేశించారు. ఐక్యూఏసీ ద్వారా ప్రతి సంవత్సరం ఆచార్యుల అకడమిక్‌ సామర్థ్యాలను క్రోడీకరించి యూజీసీకి పంపించాలని డైరెక్టర్‌ శిరీషకు సూచించారు.

పుస్తకం అందజేత

తెవివి క్యాంపస్‌(డిచ్‌పల్లి): తెవివి ఇన్‌ఛార్జి వీసీ అనిల్‌కుమార్‌కు రిజిస్ట్రార్‌ బలరాములు భారతదేశంలోని విద్యావ్యవస్థ మీద అతను రచించిన పుస్తకాన్ని శుక్రవారం అందించారు.

ప్రోగ్రామర్‌కు అభినందన

తెవివి క్యాంపస్‌(డిచ్‌పల్లి): కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో ప్రోగ్రామర్‌గా పని చేస్తున్న ఎం.నవీన్‌కుమార్‌ కోయంబత్తూర్‌ భారతీయార్‌ వర్సిటీ నుంచి డాక్టరేట్‌ పట్టా పొందారు. పీహెచ్‌డీ పూర్తి చేసిన ఆయన్ను వీసీ అనిల్‌కుమార్‌, రిజిస్ట్రార్‌ బలరాములు, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాధిపతి అతీక్‌ అభినందించారు.

చర్యలు తీసుకోవాలి

తెవివి క్యాంపస్‌(డిచ్‌పల్లి): ఇష్టానుసారంగా విధులకు హాజరవుతూ రిజిస్టర్‌లో సంతకాలు పెడుతున్న కొంతమంది ఆచార్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నాయకుడు యెండల ప్రదీప్‌ శుక్రవారం వీసీకి వినతిపత్రం అందజేశారు.

వేతనాలు పెంచాలి

తెవివి క్యాంపస్‌(డిచ్‌పల్లి): వేతనాలు పెంచడంతోపాటు, ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబరు 14ను వర్తింపజేయాలని పొరుగు సేవల ఉద్యోగులు ఇన్‌ఛార్జి వీసీ అనిల్‌కుమార్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. వేతనాలు పెంచకుంటే ఈ నెల 8 నుంచి నిరవధిక సమ్మె చేస్తామన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here