ఆరోగ్యశ్రీకి అంతరాయం

0
3


ఆరోగ్యశ్రీకి అంతరాయం

పేరుకుపోయిన రూ.25 కోట్ల బకాయిలు

ఈ నెల 16 నుంచి సేవలు నిలిపివేయాలని నిర్ణయం

ఆరోగ్యశ్రీ.. ఉద్యోగులు.. పాత్రికేయుల (ఈజేహెచ్‌ఎస్‌) ఆరోగ్య పథకంలో ఉచిత సేవలు అందించడం తమవల్ల కాదంటూ వైద్యసేవలు నిలిపివేసేందుకు ప్రైవేటు వైద్యులు సిద్ధమయ్యారు. ఇందుకు ప్రధాన కారణం ప్రభుత్వం నుంచి బకాయిలు రాకపోవడమే. ఏడాది కాలంగా చెల్లించాల్సిన డబ్బుల విషయంలో తీవ్ర జాప్యం నెలకొనడంతో బకాయిలు కాస్త రూ. కోట్లకు చేరుకొన్నాయి. తక్షణం సేవలు నిలిపివేయడమే ఉత్తమమని ప్రైవేటు వైద్యులు భావిస్తున్నారు. దీన్ని ఈ నెల 16 నుంచి ఆచరణలో పెట్టాలని నిర్ణయించారు.

న్యూస్‌టుడే, కామారెడ్డి వైద్యవిభాగం

ఉభయ జిల్లాల్లో జిల్లా కేంద్ర ఆసుపత్రులతో పాటు 20 ప్రైవేటు దవాఖానాల్లో ఆరోగ్యశ్రీ కింద సేవలందిస్తున్నారు. ప్రైవేటుకు రూ.22 కోట్లు, సర్కారు దవాఖానాలకు రూ.3 కోట్లు.. మొత్తం రూ.25 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. సరైన సమయంలో బకాయిలు చెల్లించకపోవడంతో నిజామాబాద్‌ జిల్లాలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సేవలు మూసివేశారు.

ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలోని ఆరోగ్యశ్రీ విభాగం

జిల్లా ఆసుపత్రిలో అధ్వానం

నిజామాబాద్‌ జిల్లా ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవల పరిస్థితి అధ్వానంగా మారింది. ఏడాది కాలంగా 700 శస్త్రచికిత్సలకు చెందిన రూ.2.20 కోట్లు, కామారెడ్డి ఆసుపత్రికి సుమారు రూ.80 లక్షల బకాయిలు చెల్లించాల్సి ఉంది. సంవత్సర కాలంగా శస్త్రచికిత్సలకు చెందిన డబ్బులు రాకపోవడంతో ఆరోగ్యశ్రీ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది వేతనాలను సైతం చెల్లించలేని పరిస్థితి వచ్చింది.

రోగులకు తప్పని ఇబ్బందులు

కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోవడంతో ప్రైవేటు ఆసుపత్రుల యజమానులు రోగులకు వైద్యం చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఆసుపత్రికి సుమారు రూ.3 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ నిధులు చెల్లించడంలో జాప్యం చేయడంతో ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు సేవలు అందించలేని పరిస్థితికి చేరుకొంది. ఇదే పరిస్థితి కొనసాగితే శస్త్రచికిత్సల్లో నాణ్యత లోపించే ప్రమాదం లేకపోలేదు.


ప్రతి నెలా నాలుగు వందల శస్త్రచికిత్సలు

ఉభయ జిల్లాల్లో ప్రతినెల 400 శస్త్రచికిత్సలకు తగ్గడం లేదు. ప్రతి ఆసుపత్రిలో నెలకు 20 శస్త్రచికిత్సలు చేస్తుండటంతో ఒక్కోదానికి రూ.కోటి చొప్పున బకాయిలు పేరుకుపోయాయి. సంవత్సర కాలంగా ఇదే పరిస్థితి కొనసాగడం.. నిరసనకు దిగుతామని వైద్యులు ప్రకటించగానే… నాలుగు రూపాయలు ఇవ్వడం… కథ మళ్లీ మొదటికి వస్తోంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here