ఆర్టికల్ 370 రద్దుపై స్పందించిన పాక్.. ఆసక్తికర వ్యాఖ్యలు!

0
1


జమ్మూ కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను రద్దుచేస్తూ మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై పాక్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది అసంబద్ధమైన చర్యని, కశ్మీర్ ఓ అంతర్జాతీయ వివాదమని, ఇందులో తాము కూడా భాగస్వాములుగా ఉన్నామని పాక్ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వ్యాఖ్యానించింది. భారత్ తీసుకున్న అక్రమమైన చర్యలను వ్యతిరేకిస్తున్నామని, దీనిని ఎదుర్కొడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. భారత్ ఆక్రమించుకున్న జమ్మూ కశ్మీర్ విషయంలో ఆ ప్రభుత్వం తీసుకున్న చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది. భారత్ ఆధీనంలో ఉన్న జమ్మూ కశ్మీర్ అంతర్జాతీయ వివాదమని, దీనిపై వారు ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని దుయ్యబట్టింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాల్లో పేర్కొన్న అంశంపై భారత ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయం సమస్యను పరిష్కరించలేదని పేర్కొంది. ఈ నిర్ణయం జమ్మూ కశ్మీర్, పాకిస్థాన్ ప్రజలకు ఇది ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదని పాక్ ఉద్ఘాటించింది.

కాగా, కశ్మీర్‌లో పరిణామాలపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదివారం స్పందించిన విషయం తెలిసిందే. భారతదళాలు ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా ధీటుగా బదులివ్వడానికి సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్‌ స్పష్టం చేసింది. జాతీయ భద్రతా కమిటీతో ఆదివారం ఇమ్రాన్‌ఖాన్‌ భేటీఅయ్యారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో పౌరులపై భారత సైన్యం క్లస్టర్‌ బాంబులను ప్రయోగించిందనే పాక్ సైన్యం ఆరోపించిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. పాక్ ఆరోపణలను భారత్‌ ఖండించింది. రక్షణమంత్రి పర్వేజ్‌ ఖటక్‌, విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషి, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఖమర్‌ జావేద్‌ బాజ్వా తదితర అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు.

జాతీయ భద్రతా కమిటీ సమావేశం అనంతరం పాక్‌ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. భారత దుస్సాహసం నుంచి తమను తాము కాపాడుకోడానికి సిద్ధంగా ఉన్నామని, కశ్మీర్‌ ప్రజలకు దౌత్య, నైతిక, రాజకీయ మద్దతు కొనసాగిస్తామని పేర్కొంది. భారత చర్యల వల్ల ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతికి భంగం కలుగుతోందని దుయ్యబట్టింది. కశ్మీరీల ఆకాంక్షలకు అనుగుణంగా ఆ సమస్యను పరిష్కరించడానికి భారత్‌ ముందుకు రావాలని కోరారు. బలగాల తరలింపు వల్ల అగ్నికి ఆజ్యం పోసినట్లు అవుతోందని ఆరోపించింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here