ఆ హీరోలకు సెల్యూట్.. ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్!

0
2


దేశంలో సామాజిక స్పృహతో ఆలోచించే వాణిజ్యవేత్తల్లో ఆనంద్ మహీంద్ర ఒకరు. ఆయన ఏ విషయాన్నైనా ట్వీట్ చేశారంటే తప్పకుండా వైరల్ అవి తీరుతుంది. ఆయన చేసే ట్వీట్లలో కొన్ని కితకితలు పెడితే.. మరికొన్ని ఆలోచన రేకెత్తిస్తాయి. ముంబయి వర్షాల నేపథ్యంలో తాజాగా ఆయన చేసిన ట్వీట్ హృదయాన్ని తాకుతుంది.

భారీ వర్షాల వల్ల ముంబయి మొత్తం మునిగిపోయిన సంగతి తెలిసిందే. రహదారులు జలమయం కావడంతో రవాణా కూడా స్తంభించింది. దీంతో రాకపోకలు కూడా కష్టంగా మారాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో సైతం తన ఇంట్లో ఉదయాన్నే దిన పత్రికలు ప్రత్యక్షం కావడాన్ని చూసిన ఆనంద్ మహీంద్ర ఆశ్చర్యపోయారు. అంత వర్షంలో పేపరును తడవకుండా ఇంటికి డెలవరీ చేసిన శ్రామికులను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఈ సందర్భంగా ఆయన ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పేపరు ఫొటోను ట్వీట్ చేసి.. పేపర్ బాయ్‌లకు హ్యాట్సాప్ చెప్పారు.

‘‘ముంబయి విమానాశ్రయం రన్‌వేను మూసేశారు. స్కూళ్లూ మూతపడ్డాయి. రైల్వే స్టేషన్లను వరదలు ముంచెత్తాయి. కానీ, దినపత్రికలు మాత్రం తడవకుండా, సమయానికి ఇంటికి చేరుకున్నాయి. ఎడతెరిపిలేని వర్షాన్ని సైతం ఎదిరించి.. ఇవి సాధారణ రోజులే అనే అనుభూతి కలిగిస్తున్న నిశబ్ద సేవకులు, ఎవరూ గుర్తించని ఆ హీరోలకు నా సెల్యూట్’’ అని ట్వీట్ చేశారు. దీంతో ఆనంద్ మహీంద్ర మరోసారి నెటిజనుల మనసు గెలుచుకున్నారు. ఆ ట్వీట్ చూసిన ప్రతి ఒక్కరూ ఆయన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

న్యూస్ పేపర్ వేసేవారు, పాలవాళ్లు, కూరగాయలు అమ్మేవారు.. ఇలా అందరూ గుర్తింపు పొందని హీరోలేనంటూ దినేష్ జోషీ అనే ఫాలోవర్ ఆయనకు సమాధానం ఇచ్చారు. ‘‘దినపత్రికల సామర్థ్యానికి, ఈ మాధ్యమం వెనుకున్న వ్యక్తుల అంకిత భావానికి ఇది నిదర్శనం’’ అని మరికొందరు ట్వీట్ చేశారు. ఎండ, వాన, చలిని లెక్క చేయకుండా ఇంటింటికీ దిన పత్రికలను అందించే న్యూస్ పేపర్ వెండర్‌ల శ్రమను గుర్తించినందుకు ధన్యవాదాలంటూ ఇంకొందరు ట్వీట్ చేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here