ఇంజనీరింగ్ విద్యార్థులకు షాకిచ్చిన హైకోర్టు.. జీవో 38ని సస్పెండ్ చేస్తూ..

0
0ఇంజనీరింగ్ విద్యార్థులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఫీజుల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. 2018-2019లో నిర్ణయించిన ఫీజులనే ఈ విద్యా సంవత్సరం కూడా కొనసాగించాలని గత నెల 23న ప్రభుత్వం జీవో 38 అమలు చేసింది. బీటెక్‌, బీఈ, ఎంటెక్‌, ఎంబీఏ వంటి కోర్సులకు సంబంధించి ప్రభుత్వం ఈ జీవో ఇచ్చింది. అయితే, ఆ జీవో సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ జీవోను సవాల్ చేస్తూ మదనపల్లి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, సహా ఇతర కాలేజీలు పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై కోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వ జీవో 38 అమలు నిలిపివేయాలని కాలేజీల తరఫు న్యాయవాదులు వాదించారు. ఫీజుల నియంత్రణ కమిటీ(FRC) ద్వారానే ఫీజుల్ని నిర్ణయించాలని, నేరుగా ప్రభుత్వం ఫీజులు నిర్ణయించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అయితే, జీవో వల్ల విద్యార్థులకు నష్టం లేదని ప్రభుత్వ ఏజీ శ్రీరామ్‌ వాదించారు. ఉన్నత విద్యను శాస్త్రీయ పద్ధతిలోకి తేవాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం జీవో 38 ఇచ్చిందని వివరించారు. ఫీజుల నియంత్రణ కమిటీ స్థానంలో మరో కమిటీ ఏర్పాటు అవుతుందని చెప్పారు.

ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.గంగారావు పాత ఫీజులు కుదరవని తేల్చి చెప్పారు. జీవో 38ని సస్పెండ్ చేశారు. కాగా, జీవో 38ని సస్పెండ్‌ చేస్తూ బుధవారం హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై రిట్‌ అప్పీల్‌ వేసే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే.. ఈ ఫీజుల వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here