ఇళ్లంతా దోచుకెళ్లారు

0
0


ఇళ్లంతా దోచుకెళ్లారు

లలితానగర్‌లో దొంగల హల్‌చల్‌

16 తులాల బంగారు నగల అపహరణ


దొంగలు ధ్వంసానికి యత్నించిన తలుపు గడియను చూపిస్తున్న యజమాని

నిజామాబాద్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: అసలే శివారు ప్రాంతంలో ఇల్లు. ఆపై తలుపు గడియ వేయడం మరిచారు. ఇంకేముంది..ఇంట్లో జనాలు ఉండగానే దొంగలు రెచ్చిపోయారు. ఇరవై నిమిషాల్లోనే ఇళ్లంతా ఖాళీ చేసి ఉడాయించారు. నగర శివారులోని న్యాల్‌కల్‌ రోడ్డు లలితానగర్‌లో జరిగిన ఈ చోరీ ఘటన సోమవారం ఉదయం కలకలం సృష్టించింది.

లలితానగర్‌లో నివాసం ఉండే తిమ్మయ్య కంకర, ఇసుక వ్యాపారం చేస్తుంటారు. ఆదివారం రాత్రి భార్య, నలుగురు పిల్లలతో కలిసి ఇంట్లో ఉన్నారు. సోమవారం తెల్లవారుజామున 12.45 గంటల ప్రాంతంలో చెడ్డీలు ధరించి ఉన్న ఆరుగురు దొంగలు వీరి ఇంట్లో దొంగతనానికి యత్నించారు. మొదట ప్రధాన ద్వారం వద్ద ఉన్న తలుపు గడియను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. అది తెరుచుకోకపోవడంతో వంటగది వైపున ఉన్న తలుపు లోపల గడియ తీయడానికి ప్రయత్నించారు..గడియ వేయకపోవడంతో వెంటనే తెరుచుకుంది. అక్కడి నుంచి లోనికి వెళ్లిన ముఠా సభ్యులు కత్తులు, కర్రలను చూపించి ఇంట్లో ఉన్న వారందరిని భయపెట్టారు. అనంతరం వారి ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలను లాక్కున్నారు. బీరువాలో దాచి ఉంచిన బంగారు ఆభరణాలు, నగదుని దోచుకెళ్లారు. 16 తులాల బంగారు ఆభరణాలు, రూ.50వేల నగదుని అపహరించినట్లు బాధితుడు తెలిపారు.


దొంగతనం జరిగిన ఇంటి వద్ద వివరాలు సేకరిస్తున్న సీపీ, అదనపు డీసీపీ ఇతర అధికారులు

20 నిమిషాల్లోనే..

తలుపునకు గడియ లేకపోవడంతో సులువుగా లోనికి ప్రవేశించిన దొంగలు కేవలం 20 నిమిషాల్లోనే దోపిడీ చేసి పారిపోయారు. ఇంట్లో మగవ్యక్తి ఒక్కరే ఉండడంతో దొంగలను ప్రతిఘటించలేదు. దొంగలు అడిగిన నగలు, నగదు ఇచ్చేశారు. ఇంటి పక్కన ఇళ్లు కూడా లేకపోవడంతో క్షణాల వ్యవధిలోనే దోచుకొని ఉడాయించారు.

వద్దని బతిమిలాడినా..

దొంగతనం సమయంలో ఇంట్లో ఉన్న నగలు, డబ్బు మొత్తాన్ని యజమాని వారికి ఇచ్చేచారు. తమను గదిలో బంధించవద్దని కోరినా దొంగలు పట్టించుకోలేదని బాధితుడు తెలిపారు. పడక గదిలో వీరందరిని బంధించి పారిపోయారు. వీరు కిటికీలో నుంచి అరుపులు వేశారు. అదే సమయంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి వీరి అరుపులని గమనించారు. చుట్టుపక్కల ఉన్నవారిని నిద్రలేపి గదిలో నుంచి బయటకు తీశారు.

పరిశీలన: సమాచారం తెలుసుకున్న సీపీ కార్తికేయ, అదనపు డీసీపీ శ్రీధర్‌ రెడ్డి, ఏసీపీ శ్రీనివాస్‌ కుమార్‌, సీఐ శ్రీనాథ్‌ రెడ్డి, ఎస్సై జాన్‌రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుల నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకొన్నారు. ఆధారాల కోసం సీసీ టీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు.

ఏ ముఠా పని ఇది..?

చోరీకి పాల్పడింది ఏ ముఠా అయి ఉంటుందన్నది స్పష్టత లేకుండా పోయింది. బాధితుడి వివరాల ప్రకారం దొంగలందరు చెడ్డీలు వేసుకొని ముఖానికి మాస్క్‌లు ధరించారు. చేతులకు గ్లౌజ్‌లు మాత్రం ధరించలేదు. హిందీలో మాట్లాడిన తీరుతో వీరు మహారాష్ట్రకు చెందిన వారేనని తేలింది. చెడ్డీగ్యాంగ్‌ పనేనా? లేక వారిరూపంలోనే దొంగతనాలకు పాల్పడుతున్న ఇతర ముఠానా? అన్నది తేలాల్సి ఉంది. పోలీసులు మాత్రం చెడ్డీగ్యాంగ్‌ కాదని స్పష్టం చేస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here