ఈ-పాలనకు అంతర్జాల అవరోధం

0
2


ఈ-పాలనకు అంతర్జాల అవరోధం

మూడేళ్లయినా.. అందుబాటులోకి రాని సేవలు

మూలకు చేరుతున్న కంప్యూటర్లు

న్యూస్‌టుడే, మోపాల్‌

నర్సింగ్‌పల్లిలో అలంకారప్రాయంగా మిగిలిన కంప్యూటర్‌, అంతర్జాల యంత్రాలు

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని మేజర్‌ పంచాయతీలతోపాటు భౌగోళికంగా, జనాభా పరంగా కీలకంగా ఉన్న వాటిలో ‘ఈ పంచాయతీ’ పాలనను అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. 2015కు సంబంధించిన లెక్కల ప్రకారం నిజామాబాద్‌లో 259, కామారెడ్డిలో 78 పంచాయతీల్లో ‘ఈ-పాలనను’ ప్రారంభించారు. 124 మంది కంప్యూటర్‌ ఆపరేటర్లను నియమించారు. ఇందులో భాగంగా ఎంపిక చేసిన ప్రతి పంచాయతీకి కంప్యూటర్లతోపాటు వీటి నిర్వహణకు అవసరమైన అన్ని రకాల సామగ్రి అందజేశారు. మూడేళ్లయినా ప్రభుత్వం అంతర్జాల సౌకర్యం కల్పించకపోవడంతో.. మండల పరిషత్‌ కార్యాలయాల నుంచి ఆ సేవలను అందిస్తున్నారు.

ప్రారంభిస్తే పాలనా సౌలభ్యం

గ్రామ పంచాయతీల్లో అందించే సేవలను పారదర్శకంగా మార్చడంతోపాటు సులభతరం చేయడంలో ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుంది. గ్రామాలకు సంబంధించిన జనాభా, ఓటర్లు, విస్తీర్ణం, భౌగోళిక స్వరూపం, ఆదాయం, సాగుభూములు, ప్రభుత్వ స్థలాలు, మంచి నీటి కుళాయిలు, నీటి ట్యాంకుల వివరాలను అంతర్జాలంలో పొందుపరచాల్సి ఉంది. తమ పంచాయతీకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తున్న నిధులు, వాటిని ఖర్చు చేసే విధానం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాల వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.

అందుబాటులోకి వచ్చే సేవలు..

* పంచాయతీల ఆదాయ, వ్యయాల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయడం.

* గ్రామస్థుల జనన, మరణ వివరాలను అంతర్జాలంలో నమోదు చేయడంతో పాటు ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం.

* ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల రుణాల కోసం పంచాయతీ నుంచే దరఖాస్తు చేసుకోవడం.

* జీవనభృతి, ఆసరా పింఛన్ల దరఖాస్తులు చేసుకోవడం.. లబ్ధిదారుల వివరాలు తెలుసుకోవడం.

* ఉపాధి హామీ పనులు, హరితహారం అమలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల అంశాలను నమోదు చేయడం.

* ఇంటి పన్ను, కుళాయి పన్ను వివరాలు పన్నులతోపాటు ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల వివరాలను నమోదు చేయాలి.

అంతులేని అడ్డంకులు

ఈ-పాలనకు అవసరమైన ఏర్పాట్లు చేసినప్పటికీ అంతర్జాల సదుపాయం కల్పించకపోవడం సమస్యగా మారింది. పంచాయతీరాజ్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారుల మధ్య సమన్వయ లోపం.. ఈ కార్యక్రమంపై సర్పంచులు, కార్యదర్శులకు అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పంచాయతీల్లో గదుల కొరత, శిథిలావస్థకు చేరుకున్న భవనాలు ఈ-పాలనకు అడ్డంకిగా మారుతున్నాయి.

గ్రామ పంచాయతీల పాలనను పారదర్శకంగా మార్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఈ పంచాయతీ వ్యవస్థ నీరుగారిపోతుంది. పంచాయతీల్లో నిర్వహించే సేవలను, ఆదాయ వ్యయాల వివరాలను అంతర్జాలంలో పొందుపర్చాలని 2015లో తీసుకొచ్చిన ‘ఈ-పంచాయతీ’ వ్యవస్థ క్షేత్రస్థాయిలో పూర్తిగా విఫలమైంది. ఎంపిక చేసిన పంచాయతీల్లో అంతర్జాల సదుపాయం కల్పించకపోవడంతో కంప్యూటర్లు నిరుపయోగంగా మారాయి.

మెరుగైన సేవలు – ముత్యంరెడ్డి, సర్పంచి సిర్పూర్‌

గ్రామాల్లో ‘ఈ-పాలన’తో మెరుగైన సేవలు అందుతాయి. కంప్యూటర్లు ఏర్పాటు చేసినప్పటికీ అంతర్జాల సౌకర్యం కల్పించకపోవడం దీనికి అడ్డంకిగా మారింది. ఫలితంగా గ్రామస్థులకు అవసరమైన ధ్రువపత్రాలను మండల కార్యాలయం నుంచి జారీ చేస్తున్నారు.

త్వరలోనే సేవలు ప్రారంభం – నరహరి, జిల్లా ప్రాజెక్టు మేనేజరు, ఈ-పంచాయతీ

గ్రామాల్లో చేపట్టిన ‘ఈ-పంచాయతీ’ సేవలు సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. ప్రస్తుతం అంతర్జాల సేవలు 79 కేంద్రాల నుంచి అందుబాటులో ఉన్నాయి. క్షేత్రస్థాయిలోని సమస్యలను బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులు పరిష్కరిస్తున్నారు. త్వరలోనే అన్ని గ్రామాల్లో ఈ-పాలన ప్రారంభమవుతుంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here