ఉత్తర భారతీయులపై కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు!

0
3


ఉత్తర భారతీయులపై కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు!

న్యూఢిల్లీ: ఉత్తరభారతదేశ పౌరుల శక్తిసామర్థ్యాలపై ఉపాధి, కార్మిక శాఖ కేంద్రమంత్రి, బీజేపీ నేత సంతోష్ గ్యాంగ్వర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర భారతీయులకు సరైన నైపుణ్యాలు, అర్హతలు లేని కారణంగా వారికి ఉద్యోగాలు రావడం లేదని, ఇక్కడ నిరుద్యోగితకు అదే కారణమని వ్యాఖ్యానించారు.

పలు కంపెనీల్లో ఉద్యోగావకాశాలు ఉన్నప్పటికీ సరైన అభ్యర్థులు దొరకడం లేదని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి వందరోజులు పూర్తయిన సందర్భంగా బరేలీలో ఆయన మీడియాతో మాట్లాడారు.

దేశంలో ఉద్యోగాలకు ఎలాంటి కొరత లేదని.. పలు రంగాల కంపెనీల్లో ఉద్యోగావకాశాలు ఉన్నప్పటికీ ఉత్తర భారతీయుల్లో సరైన నైపుణ్యాలు, సామర్థ్యాలు కొరవడటంతోనే నిరుద్యోగితకు దారితీస్తోందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. తనకు ఉపాధి రంగంపై పూర్తి పట్టుందని ఆయన చెప్పుకొచ్చారు.

ఆర్థిక మందగమనంపై కొంత ఆందోళన ఉన్నప్పటికీ.. ఉపాధి అవకాశాలకు ఢోకా లేదని చెప్పారు. అయితే, నిరుద్యోగ యువతకు తమ నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ఇది ఇలా ఉండగా, సంతోష్ గ్యాంగ్వర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలు ఉత్తరభారతీయులను అవమానపర్చేలా ఉన్నాయంటూ కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు.

ఇప్పటికే కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ యువత వాహనాలను కొనుగోలు చేసే కంటే ఉబెర్, ఓలాలను ఆశ్రయించడం మేలు అని అనుకోవడం వల్లే వాహన రంగం కొంత కుదేలైందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతో ఆమె వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here