ఉద్యానం.. నిస్తేజం..

0
3


ఉద్యానం.. నిస్తేజం..

కళావిహీనంగా అలీసాగర్‌ ●

నిధుల్లేక భారమైన నిర్వహణ ●

18 ఏళ్లుగా పట్టించుకోని పర్యాటక శాఖ

న్యూస్‌టుడే, ఎడపల్లి


ఓ వైపు బాసర పుణ్యక్షేత్రం.. మరో వైపు నిజామాబాద్‌ జిల్లా కేంద్రం.. ఇంకో వైపు బోధన్‌ పట్టణం.. మూడు ప్రధాన ప్రాంతాల నడుమ ఉన్న అలీసాగర్‌ ఉద్యానానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 1932 సంవత్సరంలో అప్పటి ఇంజినీరు అలీ జంగ్‌ బహదూర్‌ దీని నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నాడు జంతువులు, చెట్లు, పూల మొక్కలతో పర్యాటకులకు ఆహ్లాదం పంచింది. నేడు కళావిహీనంగా మారింది. ఆహ్లాదం కరవై కనీస సదుపాయలు లేకుండా పోయాయి. పర్యాటక శాఖ ఉద్యానవనం అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడంతో నిర్వహణే భారమైంది. 18 ఏళ్లుగా పర్యాటకుల నుంచి వసూలు చేసిన రుసుముతోనే నెట్టుకొస్తున్నారు. పూర్వ వైభవం తీసుకొస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

 

ఒక్కప్పుడు ఎటుచూసినా జింకలు, నెమళ్లు, కుందేళ్లు కనిపించేవి. ఆహ్లాదాన్ని పంచే పచ్చని చెట్లే స్వాగతం పలికేవి. రకరకాల పూల చెట్లు కనువిందు చేసేవి. నేడు సేద తీరేందుకు చెట్లు తప్ప మరేమి లేకుండా పోయాయి. నెమళ్ల కోసం, కుందేళ్ల కోసం ఏర్పాటు చేసిన పంజరాలు శిథిలావస్థకు చేరుకొన్నాయి. ఇక జింకల పార్కు ఆనవాళ్లు లేకుండా పోయింది. పర్యాటకులను ఆకట్టుకునే వాటర్‌ ఫౌంటెయిన్లు నిర్వహణ భారంతో నిరుపయోగంగా మారాయి.


పర్యాటకుల రుసుమే ఆదాయ మార్గం..

అలీసాగర్‌ ఉద్యానంలోకి ప్రవేశించడానికి నిర్వాహకులు రూ.5 ప్రవేశ రుసుము వసూలు చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలకు రూ.5, ఇతర వాహనాలకు రూ.10 చెల్లించాలి. ఇలా పర్యాటకుల ద్వారా ప్రతినెలా రూ.60 వేల వరకు ఆదాయం సమకూరుతోంది. ఇందులో 10 మంది వరకు పని చేస్తున్నారు. వీరి జీతభత్యాలు రూ.40 వేలు, విద్యుత్తు బిల్లు రూ.5 వేలు, నిర్వహణ కింద రూ.5 వేలను ఖర్చు చేస్తున్నారు. మిగిలిన నగదుతో మొక్కల పెంపకం, ఇతర మరమ్మతులకు వినియోగిస్తున్నారు. ఆదివారం 500 మంది వరకు పర్యాటకులు వస్తుండగా మిగతా రోజుల్లో 150 మంది వరకు వస్తుంటారు.


దాతల సహకారంతోనే ఆట పరికరాలు..

దాతల సహకారంతో ఉద్యానంలో ఆట పరికరాలను సమకూర్చారు. మధుయాస్కీ ఎంపీగా ఉన్న సమయంలో ఆట పరికరాలను వితరణ చేశారు. అప్పటి ఆట పరికరాలతోనే వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది.

60 ఎకరాలు నిరుపయోగంగా..

పర్యాటక కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో రెవెన్యూ శాఖ అలీసాగర్‌ ఉద్యానానికి అనుకొని ఉన్న 60 ఎకరాల గుట్ట ప్రాంతాన్ని కేటాయించింది. స్థలం ఉన్నా కూడా నిధుల కొరతతో అభివృద్ధికి నోచుకోలేకపోతోంది.

చేయాల్సినవి పనులవీ..

కింద కూర్చోవడానికి గడ్డి పెంచాలి. మరిన్ని ఆట పరికరాలను ఏర్పాటు చేయాలి. ప్రధానంగా ఉద్యానం చుట్టూ కంచెను నిర్మించాలి. శిథిలావస్థకు చేరుకున్న జంతు పంజరాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలి. శౌచాలయాలను నిర్మించాలి. పర్యాటకులు విశ్రాంతి తీసుకొనేందుకు గదులను నిర్మించాలి.

రూర్బన్‌తో ఊరట కలిగేనా..

అలీసాగర్‌ ఉద్యానం అభివృద్ధికి రూర్బన్‌ కింద వచ్చే నిధులే ఊరటనిస్తున్నాయి. పథకంలో భాగంగా రూ.2.38 కోట్లను కేటాయించారు. దీంతో పార్కు కొంత మేర అభివృద్ధి చెందనుంది. పర్యాటక శాఖ ప్రతిఏటా నిధులను కేటాయిస్తే పూర్తిస్థాయిలో అభివృద్ధి జరిగి పూర్వ వైభవం సంతరించుకునే అవకాశం ఉంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here