ఊరికి ఉపకారులు

0
1


ఊరికి ఉపకారులు

న్యూస్‌టుడే, ఆర్మూర్‌

హన్మాన్‌ ఆలయ ముఖద్వారం

బతుకుదెెరువు కోసం వారు ఉన్న ఊరిని వదిలి ఇజ్రాయెల్‌కు వెళ్లారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ, కష్టపడి పనిచేస్తూ గతంలో చేసిన అప్పులను తీర్చాలని, ఆర్థికంగా స్థిరపడాలని ప్రయత్నిస్తున్నారు. విదేశంలో ఉంటూ తమ కుటుంబ సభ్యుల బాగోగుల గురించి ఆలోచించినట్లే, తమ జన్మభూమి కోసం పరితపిస్తున్నారు. ఇజ్రాయెల్‌లో ఆర్మూర్‌ మండలం దేగాం గ్రామానికి చెందిన 16 మంది ఉంటున్నారు. వారు తమ పుట్టినూరు అభివృద్ధికి తమ వంతుగా తోడ్పాటు అందిస్తున్నారు.

ఏ దేశమేగినా.. ఎందుకాలిడిన పొగడరా నీ తల్లి భూమి భారతిని’ అన్నట్లుగా దేగాం వాసులు ఇజ్రాయెల్‌ వెళ్లినా వెళ్లినా తమ పుట్టినూరును మరచిపోలేదు. అక్కడ వారంతపు సెలవుల్లో, పండగల సందర్భంగా కలిస్తే స్వగ్రామ విశేషాలు ఆసక్తిగా చర్చించుకునేవారు. గ్రామ సమస్యలు, ప్రజల ఇబ్బందుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు పరిష్కారానికి తమవంతుగా ఏదో ఒకటి చేయాలని భావించేవారు. ఈ క్రమంలో అందరూ కలసికట్టుగా గ్రామాభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. తమ సంపాదనలో కొంత మొత్తాన్ని ఊరి బాగుకు వెచ్చించాలనుకున్నారు. మొక్కుబడిగా సాయం చేస్తే ప్రయోజనం ఉండదనే ఉద్దేశంతో గ్రామానికి, ప్రజలందరికి ఉపయుక్తంగా ఉండే పనులు చేయించాలని నిర్ణయించారు.

అంతిమయాత్ర కోసం..

గ్రామంలో ఆత్మీయులు మృతిచెందినప్పుడు సుదూర దేశంలో ఉన్న తాము వారి అంతిమయాత్రలో ప్రత్యక్షంగా పాల్గొనలేకపోతున్నామని తీవ్ర మనోవేదనకు గురయ్యేవారు. రూ. 2 లక్షలు వెచ్చించి అంతిమయాత్ర కోసం స్వర్గరథం తయారు చేయించారు. పరోక్షంగానైనా వారి అంతిమయాత్రలో పాల్గొంటున్నామనే భావనతో ఉన్నామని ఇజ్రాయెల్‌ తెలంగాణ అసోసియేషన్‌ అధ్యక్షుడు సోమ రవి తెలిపారు.

జన్మభూమి రుణం తీర్చుకుంటున్న దేగాంవాసులు

16 మంది కలిసికట్టుగా…

దేగాం గ్రామస్థులు పలువురు బతుకుదెరువు కోసం చాలా ఏళ్లుగా ఇజ్రాయెల్‌, ఇతర దేశాలకు వెళ్తున్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో దేగాంవాసులు 16 మంది ఉన్నారు. ఒక మహిళ సైతం ఉన్నారు. సోమ రవి, శ్రీకాంత్‌గౌడ్‌, సంతోష్‌, ప్రకాశ్‌, ఘనపురం సందీప్‌గౌడ్‌, ఒడ్డె నారాయణ, వుత్తూర్‌ వినోద్‌, బి.లక్ష్మీనారాయణ, గంగసరం సతీష్‌, తిరుమల మధుగౌడ్‌, ఘనపురం నర్సాగౌడ్‌, ఫత్తేపురం సాయిరెడ్డి, తిరుమల సాయికుమార్‌, ప్రశాంత్‌, మగ్గిడి భూమన్న, జంగం గంగామణి గ్రామాభివృద్ధికి చేయూతనిస్తున్నారు.

చేపట్టిన సేవా కార్యక్రమాలివే

● రూ.3.50 లక్షలతో గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌ ఇచ్చారు. ● రూ. 2 లక్షల వ్యయంతో స్వర్గరథం చేయించారు. ● రూ. 1.30 లక్షలతో హన్మాన్‌ మందిర ముఖద్వారం నిర్మించారు. ● రూ. 50 వేలతో వేంకటేశ్వర మందిరంలో ఫ్లోరింగ్‌ పనులు చేపట్టారు. ● గణేశ్‌ ఉత్సవాల సందర్భంగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మైనొద్దీన్‌ తల్లికి రూ.25 వేల ఆర్థిక సాయం చేశారు.

స్వచ్ఛ భారత్‌ స్ఫూర్తితో…

రాష్ట్ర ప్రభుత్వం 30 రోజుల గ్రామ ప్రణాళిక సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతి పంచాయతీలో పారిశుద్ధ్య నిర్వహణకు ట్రాక్టర్‌ సమకూర్చుకోవాలని సూచించారు. ప్రభుత్వానికంటే ముందే ప్రవాసీయులకు ఈ ఆలోచన వచ్చింది. నాలుగు నెలల కిందటే రూ. 3.50 లక్షలు వెచ్చించి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌ను సమకూర్చారు. గ్రామంలో మురుగు కాలువలు, రోడ్లు శుభ్రంగా లేకపోవడం వల్ల డెంగీ, ఇతర వ్యాధులు ప్రబలుతున్నాయని తెలుసుకొని స్వచ్ఛభారత్‌ స్ఫూర్తితో ఈ వాహనం అందించారు. ప్రస్తుతం ఇందులోనే చెత్త సేకరిస్తున్నారు. మురుగు కాలువలు, రోడ్లను శుభ్రంగా ఉంచుతున్నారు.

పుట్టిన ఊరి కోసం..

– సోమ రవి, ఇజ్రాయెల్‌ తెలంగాణ అసోసియేషన్‌ అధ్యక్షుడు, దేగాం

బతుకుదెరువు కోసం ఇజ్రాయెల్‌ వెళ్లాం. మేము పెరిగిన ఊరి రుణం తీర్చుకోవాలనే భావనతో ఒక సంఘంగా ఏర్పడ్డాం. సంపాదనలో కొంత ఊరి అభివృద్ధికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. గ్రామస్థులందరి ప్రయోజనం కోసం పనులు చేయిస్తున్నాం

పల్లెను మరిచిపోలేదు

– గడ్డం సరోజ, సర్పంచి, దేగాం

ఇజ్రాయెల్‌లో ఉంటున్న మా గ్రామస్థులు ఊరికి ఉపకారం చేస్తున్నారు. బతుకుదెరువు కోసం అక్కడికి వెళ్లినా పుట్టిన ఊరిని మరిచిపోలేదు. గ్రామ అవసరాలు తీర్చడానికి, గ్రామస్థులకు ప్రయోజనం చేసే పనులు చేయడం గొప్ప విషయం. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here