ఎర్ర తాజ్‌మహల్‌ను చూస్తారా..

0
1


ఎర్ర తాజ్‌మహల్‌ను చూస్తారా..

తాజ్ మహల్.. ప్రపంచ వింతల్లో ఒకటి.. పాలరాతి ప్రేమ సౌధం..  ఓ అందమైన కట్టడం.. ఇది లక్షలాది మంది ప్రేమికులు, పర్యాటకుల గమ్యస్థానం అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ తన భార్య ముంతాజ్‌పై ఉన్న ప్రేమకు చిహ్నంగా ఆగ్రాలో దీనిని నిర్మించాడు. అయితే అచ్చం అలాంటి కట్టడాన్నే పోలి ఉన్న మరో తాజ్‌మహల్‌ కూడా ఉంది.  కాకపోతే ఇది ఎరుపు రంగులో ఉంటుంది. ఇది మీకు ఆశ్చర్యమనిపించినా అక్షరాలా నిజం.  ఆగ్రాలోని నెహ్రూనగర్‌లో రోమన్‌ కేథలిక్‌ శ్మశాన వాటికలో ఈ కట్టడం ఉంది.

17వ శతాబ్ధంలో యూరప్‌ నలుమూల నుంచి అనేక మంది వలస వచ్చి భారత్‌లో స్థిరపడ్డారు.  వీరంతా భారత్‌లోని సంస్కృతి, సంప్రదాయాలకు ఆకర్షితులయ్యారు.  స్థానిక మహిళలను వివాహం చేసుకొని సాధారణ జీవనం గడిపారు. ఇక్కడే వారు తనువు చాలించారు. అయితే వీరు ఎక్కువమంది క్రైస్తవ మతం అనుసరించటంతో వారి తదనాంతరం వీరి అంత్యక్రియలను క్రైస్తవ సంప్రదాయంలో నిర్వహించారు. 

ఉత్తర భారతదేశంలోని ఆగ్రాకు సమీపంలో ఉన్న క్రైస్తవ శ్మశానవాటికల్లో వీళ్ల సమాధులున్నాయి. ఇందులో కల్నల్‌ జాన్‌ విలియం హెస్సింగ్‌ సమాధి ఒకటి.  దీనికి ఒక ప్రత్యక గుర్తింపు ఉంది. జాన్‌ మరణించిన తర్వాత అతని భార్య ఆనె హెస్సింగ్‌ దీనిని నిర్మించారు.  రెడ్‌ సాండ్‌స్టోన్‌ (ఎర్ర ఇసుకరాయి)తో నిర్మించిన ఈ సమాధి తాజ్‌ మహల్‌లాగే ఉంటుంది. కాకపోతే ఎరుపు రంగులో ఉంటుంది. దీనికి నలువైపులా ఆకర్షణీయమైన డిజైన్లు, పైన అందమైన గుమ్మటం వంటివి ఉన్నాయి. జాన్‌ క్రైస్తవుడు అయిన్నప్పటికీ ఆయన సమాధిని మాత్రం మొఘల్‌  చక్రవర్తుల సమాధుల  శైలిలో దీనిని నిర్మించడం విశేషం.

అసలు ఎవరీ హెస్సింగ్‌..
జాన్‌ హెస్సింగ్‌ 1739లో నెదర్లాండ్స్‌లోని అట్రేచ్‌ నగరంలో జన్మించాడు. 13 ఏళ్ల వయస్సులో యునైటెడ్‌ డచ్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీలో సైనికుడిగా చేరారు. 1752లో సిలోన్‌ (శ్రీలంక) చేరుకుని ఐదేళ్ల తరువాత తిరిగి స్వదేశానికి వెళ్లాడు. మళ్లీ 1763లో భారతదేశానికి తిరిగి వచ్చి హైదరాబాద్‌ నిజాంల కింద పనిచేశాడు.

ఆ సమయంలో, యూరోపియన్ల కిరాయి సైనికులు భారత పాలకుల సైన్యంలో సేవ చేయడం సర్వసాధారణం. 1803లో ఆగ్రా కోటను చేరుకునే సమయంలో హెస్సింగ్‌ మరణించాడు.  ఆయన మరణానంతరం అతని భార్య, కుమారులు తాజ్ మహల్ ఆకారంలో ఒక గొప్ప సమాధిని నిర్మించి నివాళి అర్పించారు. కానీ వారికున్న పరిమిత వనరుల వల్ల పాలరాళ్లను కొనలేకపోయారు. దానికి బదులుగా రెడ్‌ సాండ్‌స్టోన్‌తో ఈ సమాధిని నిర్మించారు. దీనికే “రెడ్ తాజ్” అనే పేరు వచ్చింది. అప్పటి నుంచి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోందీ రెడ్‌ తాజ్‌ మహల్‌.

– ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

  • Red Taj Mahal
  •   Hessing’s Tomb
  •   Agra
  • Ann HessingSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here