ఏకరూపం ఎప్పుడో

0
10


ఏకరూపం ఎప్పుడో

ప్రభుత్వ విద్యార్థులకు అందని దుస్తులు

పంద్రాగస్టులోగా విద్యాశాఖ స్పందించేనా

కామారెడ్డి విద్యావిభాగం, న్యూస్‌టుడే’

కామారెడ్డి జిల్లాపరిషత్‌ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

 

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్లో 90 శాతం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారే. కనీస ఆహారం, దుస్తులు సంపాదించుకోలేని దుస్థితి వీరిది. క్రమశిక్షణ, సమానత్వం పెంపొందించడానికి అందరికీ ఒకే రకమైన దుస్తులను ప్రభుత్వం అందజేస్తోంది. నిధులు విడుదల చేస్తున్నా క్షేత్రస్థాయిలో అధికారుల అలసత్వం..నిర్లక్ష్యం కారణంగా సకాలంలో విద్యార్థులకు దుస్తులు అందని పరిస్థితి నెలకొంది. విద్యాహక్కు చట్టం ప్రకారం 1-8 తరగతుల విద్యార్థులకు ప్రతి ఏడాది రెండు జతల దుస్తులను విద్యా సంవత్సరం ఆరంభంలోనే అందించాల్సి ఉన్నా ఆచరణలో విఫలమవుతున్నారు. గత ఏడాది అక్టోబరులో పిల్లలకు దుస్తులను అందజేసినా రాజీవ్‌ విద్యామిషన్‌ అధికారులు ఈ ఏడాది కూడా అదే అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 1576 ప్రాథమిక, 263 ప్రాథమికోన్నత, 523 ఉన్నత పాఠశాలలున్నాయి. ఇందులో 2,40,480 మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం 1-8 తరగతులు చదువుతున్న విద్యార్థులందరికి దుస్తులు అందాలి. పక్షం రోజుల క్రితం వస్త్రాలను ఆయా సంస్థలకు అప్పగించారు. ఈ ఏడాది మార్చిలో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుంచి ప్రతిపాదనలు తీసుకున్నా కార్యరూపం దాల్చలేదు. గత ఏడాది రాజా డ్రెస్సెస్‌, ఆప్కో సంస్థలకు పనులను అప్పగించారు. ప్రస్తుత విద్యా సంవత్సరం కామారెడ్డి, నిజామాబాద్‌, బాన్సువాడ ఇందిరాక్రాంతి పథం మహిళా, చేనేత సంఘాలకు ఇచ్చారు. పక్షం రోజుల క్రితం అప్పగించిన వస్త్రాలను కుట్టి తిరిగి పాఠశాలలకు చేర్చాలన్నా కనీసం రెండు నెలల సమయం పట్టనుంది.

అలసత్వం కారణంగానే

ప్రతి విద్యా సంవత్సరం దుస్తులు కుట్టే గుత్తేదార్లకు సంబంధించి సంస్థలు మారుతుండటం కారణంగానే సకాలంలో పాఠశాలలకు అందడం లేదు. దుస్తులు కుట్టే రుసుములు చాలా తక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. నాలుగేళ్లలో ఒక జత కుట్టడానికి రూ.200 చెల్లిస్తున్నారు. వస్త్రం కొనుగోలుకు రూ.160, కుట్టడానికి రూ.40 ఇస్తున్నారు. ఇంత తక్కువ ధర చెల్లించడం కారణంగా నాణ్యమైన వస్త్రాలు లభించడం లేదు. విద్యార్థులకు అందజేసిన దుస్తులు అనతి కాలంలోనే చిరిగి పోతున్నాయి.

పది రోజుల్లో అందితే సంతోషం

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులందరికి మౌలిక వసతుల కల్పనలో విద్యాశాఖతో పాటు విద్యాకమిటీలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. పాఠశాల అభివృద్ధి ప్రణాళిక ద్వారా తీర్మానాలు చేసి పంపిస్తున్నా దుస్తులు సకాలంలో రాని పరిస్థితి నెలకొందని కమిటీలు ఆరోపిస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరం పంద్రాగస్టులోగా దుస్తులు అందిస్తే సమస్యను అధిగమించే వీలుంటుంది.

నిధులు పెంచితేనే

ఒక విద్యార్థికి ఒకే జత దుస్తులకు ప్రభుత్వం చెల్లిస్తున్న ధర రూ.200. బహిరంగ మార్కెట్‌లో ఒక జత పాఠశాల దుస్తుల ధర రూ.500 వరకు ఉంటుంది. ప్రభుత్వం మంజూరు చేసే నిధులు అరకొరగా ఉండటంతో ప్రతి ఏటా సమస్య ఉత్పన్నమవుతోంది. ప్రభుత్వం స్పందించి దుస్తుల ధర పెంచితే విద్యార్థుల ఇక్కట్లు తీర్చే అవకాశాలున్నాయి.

ఈ చిత్రంలో కనిపిస్తున్న విద్యార్థులు కామారెడ్డి గంజ్‌ ఉన్నత పాఠశాలకు చెందిన వారు. వీరిలో ఒకరు గత ఏడాది ఇచ్చిన దుస్తులను ధరించారు. మరో విద్యార్థికి ఇచ్చిన దుస్తులు చిరిగిపోయాయి. మూడో విద్యార్థికి దుస్తులే ఇవ్వలేదని చెబుతున్నారు. గత ఏడాది అక్టోబరులో దుస్తులను అందజేశారు. ఈ విద్యా సంవత్సరం మూడు నెలలు గడిచినా ఇప్పటి వరకు సౌకర్యం లేకుండా పోయింది. నిత్యం ప్రార్థనలో నిల్చోవాలంటే విద్యార్థులు అసౌకర్యంగా భావిస్తున్నారు.

త్వరలోనే అందజేస్తాం

రాజు, జిల్లా విద్యాశాఖ అధికారి-కామారెడ్డి

ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు ఈ ఏడాది ఏకరూప దుస్తులను అందించడానికి చర్యలు తీసుకుంటాం. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే దుస్తులను అందించాల్సి ఉన్నా వివిధ సంస్థలకు వస్త్రాలను కుట్టడానికి అప్పగించడంలో జాప్యం జరుగుతున్న మాట వాస్తవమే. విద్యార్థుల ఇబ్బందులు తీర్చేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో దృష్టి పెడతాం.

ఉమ్మడి జిల్లాలో పాఠశాలలు: 2362

1-8 తరగతుల విద్యార్థులు: 1,80, 556

కావాల్సిన జతలు: 3,61,112

మంజూరైన నిధులు: రూ. 7.28 కోట్లుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here