ఏడు జాతీయ అవార్డులు.. పవన్, ఎన్టీఆర్, రాజమౌళి, నాని స్పందన ఇది!

0
4


ప్రతిష్టాత్మక జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఈసారి తెలుగు చిత్రాలు మెరిశాయి. ఏడు విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకున్నాయి. 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ప్రకటించారు. టాలీవుడ్ నుంచి ‘మహానటి’, ‘రంగస్థలం’, ‘అ!’, ‘చి.ల.సౌ’ చిత్రాలకు అవార్డులు దక్కాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘మ‌హాన‌టి’ ఎంపికైంది. ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో జీవించిన కీర్తి సురేష్‌కు ఉత్తమ న‌టి అవార్డును గెలుచుకున్నారు. ఉత్తమ కాస్ట్యూమ్స్‌ డిజైనర్ విభాగంలోనూ ‘మ‌హాన‌టి’ అవార్డు సొంతం చేసుకుంది.

అలాగే, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, సమంత జంటగా సుకుమార్ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కిన ‘రంగ‌స్థలం’ బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగంలో అవార్డు గెలుచుకుంది. బెస్ట్ ఒరిజిన‌ల్ స్ర్కీన్‌ప్లే విభాగంలో ‘చి.ల‌.సౌ’కు.. మేకప్, స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో ‘అ!’ చిత్రానికి అవార్డులు దక్కాయి. తెలుగు సినిమాలకు ఈ స్థాయిలో అవార్డులు రావడం పట్ల టాలీవుడ్ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విజేతలకు అభినందనలు తెలుపుతున్నారు.

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విజేతలకు అభినందనలు తెలుపుతూ ఒక ప్రకటనను విడుదల చేశారు. ‘‘జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో జాతీయ ఉత్తమ నటి పురస్కారానికి ఎంపికైన కీర్తి సురేష్‌ గారికి నా తరఫున, జనసైనికుల తరఫున అభినందనలు. సావిత్రి గారి జీవితం ఆధారంగా వచ్చిన ‘మహానటి’లో ప్రధాన పాత్ర పోషించిన కీర్తి సురేష్‌ గారి నటన అవార్డుకు అర్హమైనదే. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా మహానటి నిలిచినందున చిత్ర బృందానికి.. ‘రంగస్థలం, అ!, చి.ల.సా.’ చిత్రాలకు సాంకేతిక విభాగాల్లో అవార్డులకు ఎంపికైనవారికి అభినందనలు. ఏడు పురస్కారాలు దక్కించుకున్నందున ఈ స్ఫూర్తితో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మరిన్ని మంచి చిత్రాలు రావాలి’’ అని పవన్ పేర్కొన్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా విజేతలకు అభినందనలు తెలిపారు. ‘‘తెలుగు సినిమా అంతెత్తులో ప్రయాణిస్తోంది. జాతీయ అవార్డులు గెలుచుకున్న మహానటి, రంగస్థలం, ఆ!, చి.ల.సౌ చిత్ర బృందాలకు అభినందనలు’’ అని ట్వీట్ చేశారు.

పలు విభాగాల్లో తెలుగు సినిమాలు జాతీయ అవార్డులు గెలుచుకోవడం చాలా సంతోషాన్నిచ్చిందని దర్శకధీరుడు రాజమౌళి ట్వీట్ చేశారు. విజేతలకు అభినందనలు తెలిపారు.

‘అ!’ చిత్ర నిర్మాత నేచురల్ స్టార్ నాని ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ‘‘వాల్ పోస్టర్ సినిమా టీమ్ నేడు చాలా గర్వపడుతోంది. మా ఆరంగేట్ర ప్రొడక్షన్‌కు రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. ఇంత కన్నా ఎక్కువ మేం ఏమి అడగగలం. మా కాస్ట్ అండ్ క్రూ మొత్తానికి కృతజ్ఞతలు. థాంక్యూ జూరీ. అవార్డులు గెలుచుకున్న విజేతలకు అభినందనలు’’ అని నాని ట్వీట్ చేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here