కల్లాలు లేక కల్లోలం

0
2


కల్లాలు లేక కల్లోలం

ధాన్యం ఆరబెట్టేందుకు రహదారులే ఆధారం
ఏటా వందల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు
న్యూస్‌టుడే, ఆర్మూర్‌

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఉత్పత్తులను ఆరబెట్టి, అమ్మడానికి అష్టకష్టాలు పడుతున్నారు. గింజలు ఆరబెట్టడానికి సిమెంటు కల్లాలు లేక ఉమ్మడి జిల్లాకు చెందిన వేల మంది రైతులు రోడ్డపైకి రావాల్సిన దుస్థితి దాపురించింది. 44, 63 జాతీయ రహదారులు సహా అనేక అంతర్గత రోడ్లపై ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆరబోసిన ధాన్యం, మక్కలు, సోయాలే కనిపిస్తున్నాయి. వర్షమొస్తే పంటలను కుప్పగా పోసి, టార్పాలిన్లు కప్పడం, వర్షం తగ్గితే పంటను నేర్పడం వారికి పనిగా మారింది.

భారీ వర్షమొస్తే  నీటిపాలే..
జిల్లాలో ఈ ఏడాది విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. అడపాదడపా ఉరుములు, మెరుపులతో వానలు పడుతున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌ సహకరించి పంటలు బాగా పండాయని సంతోషపడిన రైతులను ఆవే వర్షాలు ముంచుతున్నాయి. తరచూ వర్షాలు కురుస్తుండడంతో పంటను కోయడానికి, తడిసిన పంటను ఆరబెట్టడానికి అవస్థలు పడుతున్నారు. రోడ్లపై ఆరబెడితే రక్షణ ఉండదు. భారీ వర్షమొస్తే నీటిపాలే గతి.
ఆర్మూర్‌ మండలం సుర్భిర్యాల్‌కు చెందిన గంగాధర్‌ పది రోజుల కిందట ద్విచక్రవాహనంపై ఆర్మూర్‌ నుంచి స్వగ్రామానికి వస్తున్నారు. పిప్రి విద్యుత్తు ఉపకేంద్రం వద్ద రైతులు రోడ్డుపై ఆరబెట్టిన మక్కలను ఆయన గమనించలేదు. మక్కలపై నుంచి వెళ్లి అదుపుతప్పి కిందపడగా తీవ్రంగా గాయపడ్డారు.

నందిపేట్‌ మండలం వన్నెల్‌ నుంచి మారంపల్లికి వస్తున్న ఖుదావంద్‌పూర్‌ సహకార సంఘం కార్యదర్శి ఒడ్డెన్న రోడ్డుపై ఆరబోసిన మక్కలను చూసుకోకుండా.. అదుపుతప్పి ద్విచక్రవాహనంపై నుంచి పడి ప్రాణాలు కోల్పోయారు.

జిల్లాకు మంజూరు మాటే మరిచారు
పదేళ్ల కిందట జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా సిమెంట్‌ కల్లాలను మంజూరు చేశారు. తక్కువ సంఖ్యలో ఇవి మంజూరయ్యాయి. కొంత మంది రైతులే వీటిని నిర్మించుకున్నారు. ఐదేళ్ల కిందట సుగంధ ద్రవ్యాల బోర్డు ద్వారా రాయితీపై సిమెంటు కల్లాలను మంజూరు చేశారు. కేవలం పలుకుబడి ఉన్న రైతులకే ఇవి దక్కాయి. పది మీటర్ల పొడవు, పది మీటర్ల వెడల్పుతో నిర్మించే సిమెంట్‌ కల్లాలను పసుపు ఎక్కువగా పండించే ఆర్మూర్‌, నిజామాబాద్‌ డివిజన్లలో మంజూరు చేయగా దాదాపు 150 మంది రైతులు సద్వినియోగం చేసుకున్నారు. ఆ తర్వాత జిల్లాకు మంజూరు  మరిచారు.

అవసరాలు తీర్చని  యార్డులు
మార్కెట్‌ యార్డుల్లో నిర్మించిన షెడ్లు, కల్లాలు రైతుల అవసరాలను తీర్చడం లేదు. మార్కెట్‌ కమిటీ నిధులతో అడపాదడపా యార్డుల్లో షెడ్లు, కల్లాలు నిర్మిస్తున్నారు. అవి ఏ మాత్రం సరిపోక రైతులు ఖాళీ స్థలాలు ఎక్కడుంటే అక్కడ పంట ఎండబెడుతున్నారు.

బడ్జెట్‌  కొరత

ఉద్యానశాఖ ద్వారా కొంతమంది రైతులకు సిమెంటు కల్లాలను మంజూరు చేశారు. ఒక్కోటి నిర్మించడానికి రూ.50 వేలు వ్యయమైతే, అందులో రూ.12,500 రాయితీ ఇచ్చేవారు. కొన్నాళ్లుగా మంజూరు కావడం లేదు. తాజాగా ఉద్యానశాఖ ద్వారా జిల్లావ్యాప్తంగా వెయ్యి చోట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు. ఈ  ఏడాది నిధుల కొరతతో మంజూరయ్యే పరిస్థితి లేదని ఆ శాఖ అధికారి ఒకరు ‘న్యూస్‌టుడే’తో పేర్కొన్నారు.

మట్టి కల్లాలపై అనాసక్తి
ఉపాధి హామీ పథకంలో గతంలో సిమెంటువి మంజూరు చేశారు. ఎనిమిది మీటర్ల పొడవు, ఎనిమిది మీటర్ల వెడల్పుతో రూ. 40 వేల వ్యయంతో వీటిని నిర్మించుకోవాలి. ఇవి పంట ఆరబెట్టడానికి సరిపోవని, కేటాయిస్తున్న నిధులు చాలవని రైతులు ఆసక్తి చూపడం లేదు. జిల్లాలో ఇదివరకు 94 సిమెంటు కల్లాలు మంజూరు చేయగా అందులో పదమూడింటినే నిర్మించుకున్నారు. ఉపాధిహామీ ద్వారా రూ. 40 వేల వ్యయంతో గట్టి మట్టిని తెచ్చి, రైతుల వ్యవసాయ క్షేత్రాల్లో వీటిని నిర్మించుకోవాలి. అయితే మట్టివి నిర్మించుకునేందుకు అన్నదాతలు ముందుకురావడం లేదు

నాబార్డుపైనే రైతుల  ఆశలు
ఇటీవల నాబార్డు సీజీఎం ఆదర్శ గ్రామం అంకాపూర్‌ సందర్శనకు వచ్చారు. సహకార సంఘం అధ్యక్షుడు మార గంగారెడ్డి సిమెంటు కల్లాలు మంజూరు చేయాలని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు. ఎంత విస్తీర్ణంలో నిర్మిస్తే బాగుంటుంది? నిర్మాణానికి అయ్యే వ్యయం, ఇతర వివరాలు తెలుసుకున్నారు.
ద్విచక్ర వాహనదారులకు  ప్రాణగండం‘
గ్రామాల్లో సిమెంటు కల్లాలు లేక గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు పంటను రోడ్లపై ఆరబెడుతున్నారు. ఆయా మార్గాల్లో వెళ్తున్న ద్విచక్ర వాహనదారులు వాటిని గమనించక ప్రమాదాలకు గురవుతున్నారు. రైతులు పంటను ఆరబెట్టి వాటిపై తాటిపత్రులు కప్పి, అవి గాలికి ఎగిరిపోకుండా చుట్టూ రాళ్లు పెడుతున్నారు. పంటపై నుంచి వెళ్లినా, ఆ రాళ్లు వాహనాల టైర్లకు తగిలినా ప్రమాదాలు జరుగుతున్నాయి.
మెండోరా మండలం పోచంపాడ్‌కు చెందిన జులేఖబేగం, ముంతాజ్‌ అక్టోబరు 30 రాత్రి 7 గంటల సమయంలో గంగరమంద వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ద్విచక్రవాహనం నందిపేట్‌ మండలం బాద్గున వైపు వెళ్తుండగా రోడ్డుపై ధాన్యం కుప్పలపై పడడంతో జులేఖబేగం చేయి విరిగింది.

రైతుపై కేసు
నందిపేట్‌ : రోడ్డుపై ధాన్యం ఆరబెట్టి ప్రమాదానికి కారణమైన నందిపేట్‌కు చెందిన రైతు ఎర్రం మురళిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాఘవేందర్‌ బుధవారం తెలిపారు. సదరు రైతు పల్గుట్ట సమీపంలో రోడ్డుపై ధాన్యం ఆరబెట్టాడు. మంగళవారం రాత్రి ధాన్యం కుప్పను ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సదరు రైతుపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఇలా చేస్తే ప్రయోజనం

చిన్న సిమెంటు కల్లాలతో ఎక్కువ ప్రయోజనం ఉండదు. పది మీటర్ల వెడల్పు, 30 మీటర్ల పొడవు కలిగిన పెద్దవి నిర్మిస్తే ఉపయుక్తంగా ఉంటుంది.
నాబార్డు, సుగంధ ద్రవ్యాల బోర్డు, ఉద్యానశాఖ, గ్రామీణాభివృద్ధి సంస్థల ద్వారా 50 శాతం రాయితీ ఇచ్చి ఉపాధి హామీకి అనుసంధానిస్తే రైతులపై భారం తగ్గుతుంది.
ప్రభుత్వం గోదాములు నిర్మించినట్లు గ్రామాల్లో సామాజిక స్థలాల్లో భారీవి ఊరికొకటి నిర్మించినా ఎంతో మేలు.
ఊరికొకటి నిర్మించాలి
నర్సింహాచారి, విశ్రాంత వ్యవసాయాధికారి
గతంలో స్పైసెస్‌ బోర్డు, ఉద్యానశాఖ ద్వారా రాయితీపై కల్లాలు మంజూరు చేశారు. ఐదేళ్లుగా కల్లాలు మంజూరు కావడం లేదు. చిన్నవి నిర్మిస్తే ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. పంచాయతీకి చెందిన ఖాళీ స్థలంలో ప్రభుత్వమే పెద్దది నిర్మించాలి. అలాంటిది ఊరికొకటి నిర్మిస్తే చాలు.

కల్లాలు నిర్మిస్తే కష్టాలుండవు
– బండారి యాదగిరి, దేగాం
వారంరోజుల క్రితం ద్విచక్ర వాహనంపై వెళ్తూ రోడ్డుపై ఆరబెట్టిన మక్కల పక్కన రాళ్లు తగిలి కిందపడ్డాను. కాలుకు బలమైన గాయం తగిలింది. ప్రభుత్వం కల్లాలు నిర్మించుకోకపోవడంతో రైతులు రోడ్లెక్కాల్సిన పరిస్థితి. ఊర్లల్లో వీటిని నిర్మిస్తే రైతులు రోడ్లమీదికి రారు. ప్రమాదాలకు ఆస్కారం ఉండదు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here