‘కశ్మీర్’పై చేతులెత్తేసిన పాక్ ప్రధాని!

0
5


కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై చర్చకు వచ్చేలా చేసి లబ్ది పొందాలని భావించిన పాకిస్థాన్‌కు భంగపాటు తప్పలేదు. వారి వాదనకు మద్దతు కరవవడంతో దాయాది ఏకాకిగా మిగిలిపోయింది. చైనా కూడా పాకిస్థాన్‌కు అండగా నిలబడేందుకు తటపటాయిస్తోంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన ఓటమిని పరోక్షంగా అంగీకరించారు. కశ్మీర్ విషయంలో తమ వాదనలను ఎవరూ పట్టించుకోవడంలేదని స్వయంగా ఆయనే వెల్లడించడం విశేషం. యూఎన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఈ విషయంలో తమకు ప్రపంచ దేశాల మద్దతు కొరవడిందని వ్యాఖ్యానించారు.

Read Also:
పాక్‌తో చర్చలకు ఎలాంటి సమస్యా లేదు, కానీ…

పైగా 100కోట్లకుపైగా జనాభా ఉన్న భారత మార్కెట్‌ని దృష్టిలో ఉంచుకునే దేశాలు తమ వాదనకు మద్దతు ఇవ్వడానికి ముందుకు రావడంలేదని ఆయన ఆరోపించారు. కశ్మీర్‌ విషయంలో అంతర్జాతీయ మద్దతు కోసం ఇక చేయడానికి ఏమీ లేదని నిరాశ వ్యక్తం చేశారు. భారత్‌తో యుద్ధానికి దిగడం మినహా అన్ని ప్రయత్నాలు చేశామని ఇమ్రాన్, యుద్ధం మా ప్రాధాన్యత కాదని నిట్టూర్చారు.

‘అంతర్జాతీయ సమాజం స్పందన తనను నిరాశకు గురిచేసింది.. ఒకవేళ ఎనిమిది మిలియన్ల యూరోపియన్లు లేదా జ్యూయిస్, అమెరికన్లు ఒత్తిడి తీసుకొస్తే పరిస్థితి వేరేలా ఉండేది.. ఈ విషయంలో భారత ప్రధాని మోదీపై ఎవరు ఒత్తిడి తీసుకురాలేకపోయారు.. కానీ అంశంలో తాము ఒత్తిడి తీసుకొస్తూనే ఉంటాం.. కశ్మీర్‌లో 9 లక్షల సైన్యం ఏం చేస్తోంది.. ఒకసారి ఆంక్షలు తొలిగించిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో దేవుడికే తెలియాలి.. భారత్ చర్యలను కశ్మీరీలు ఆమోదిస్తారని మీరు భావిస్తున్నారా’ అంటూ ఇమ్రాన్ నిర్వేదం వ్యక్తం చేశాడు.

Read Also: భారీ విధ్వంసానికి జైషే మహ్మద్ కుట్ర.. టార్గెట్ మోదీ, ధోవల్: ఐబీ

ఆర్టికల్ 370 రద్దును ఆది నుంచి వ్యతిరేకిస్తోన్న పాక్.. ఇందులో కలుగుజేసుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరుతోంది. అయితే, ఇది తమ అంతర్గత విషయమని, ఇతరుల జోక్యాన్ని సహించబోమని భారత్ స్పష్టం చేసింది. ఐరాస భద్రతా మండలిలో పాక్ తీర్మానం వీగిపోగా, మానవహక్కుల కౌన్సిల్‌లో తీర్మానం ప్రవేశపెట్టడానికి అవసరమైన సభ్యుల మద్దతు కూడా ఆ దేశానికి కొరవడింది. ఎవరూ అండగా నిలవకపోగా కశ్మీర్ ద్వైపాక్షిక అంశం అని.. శాంతియుతంగా చర్చించుకోవాలని హితవు పలికారు.

Read Also: డ్రోన్ల ద్వారా ఆయుధాలను పంపుతోన్న పాక్.. 26/11 తరహా దాడులకు కుట్ర!

అయితే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మాత్రం తాను మధ్యవర్తిత్వం వహిస్తానని ప్రకటించారు. దీన్ని భారత్ తిరస్కరించడంతో ట్రంప్ కూడా చేతులెత్తేశారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ట్రంప్ మాట్లాడుతూ.. మధ్యవర్తిత్వం వహించాలని పాకిస్థాన్‌ కోరుకుంటోందని తాను సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. కానీ, కశ్మీర్‌ విషయంలో రెండు దేశాల అభిప్రాయాలు పరస్పరం భిన్నంగా ఉన్నాయని, కలిసి చర్చించుకోవాలని సూచించారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here