కశ్మీర్‌కు మద్దతు ఇచ్చే దేశాల జాబితా చెప్పమంటే చిందులేసిన పాక్ మంత్రి!

0
1


జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దుచేసిన తర్వాత భారత్‌పై దాయాది మరింత అక్కసు వెళ్లగక్కుతోంది. ఈ అంశాన్ని పలు అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించి భారత్‌ను దోషిగా నిలబెట్టాలని పాకిస్థాన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో పాక్ మరింత అసహనంతో రగిలిపోతుంది. విదేశాల్లోనే కాదు సొంతగడ్డపై దాని వాదనలకు మద్దతు కొరవడింది. కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కౌన్సిల్‌లోని 58 సభ్యదేశాలూ తమకు మద్దతు ఇస్తున్నాయంటూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించి అబాసుపాలైన విషయం తెలిసిందే. తాజాగా, పాక్ టీవీ ఛానెల్ ఎక్స్‌ప్రెస్ న్యూస్ షోలో పాల్గొన్న ఆ దేశ విదేశాంగ మంత్రిని ఇదే అంశంపై జావేద్ చౌదురి అనే జర్నలిస్ట్ ప్రశ్నించగా ఆయన చిందులు వేశారు.

యూఎన్‌హెచ్‌ఆర్‌సీలో సభ్య దేశాలు 47 కాగా, ఇమ్రాన్ 58 చెప్పడంతో సోషల్ మీడియాలో పాక్ ప్రధానిపై జోకులు పేలాయి. అంతేకాదు, ఇమ్రాన్ ప్రకటనకు విదేశాంగ మంత్రి ఖురేషీ సైతం మద్దతు తెలిపారు. మీడియా సమావేశంలో జర్నలిస్ట్ ఇదే అంశంపై వివరణ కోరుతూ.. పాక్‌కి మద్దతిచ్చిన 58 దేశాల జాబితా చెప్పగలరా అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా సహనం కోల్పోయిన ఖురేషీ.. ఎవరి అజెండాతో పనిచేస్తున్నారంటూ అంతెత్తు ఎగిరిపడ్డారు. అంతేకాదు, ఐక్యరాజ్యసమితిలో మనకు మద్దతిచ్చిన సభ్యుల జాబితా గురించి మీరు మాకు చెబుతారా అంటూ జర్నలిస్టును ఎదురు ప్రశ్నించారు.

ట్విటర్‌లో ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖల్ని మీరు ఎలా సమర్థించారని ఖురేషీని ఆ జర్నలిస్టు గుచ్చి గుచ్చి ప్రశ్నించాడు. దీంతో ఎక్కడ మద్దతిచ్చానో ఆధారాలు చూపాలంటూ ఖురేషీ ఆయను బెదిరించే ప్రయత్నం చేశారు. కానీ, పక్కా ఆధారాలతో నిర్భయంగా ఇమ్రాన్‌ వ్యాఖ్యలకు ఖురేషీ రీట్వీట్‌ చేసిన ట్వీట్లను స్క్రీషాట్‌లు ముందుంచారు. దీంతో బిక్కమొహం వేసిన పాక్ మంత్రి.. దాంట్లో తప్పేముందంటూ సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. అంతేకాదు, నా వాదనకు కట్టుబడి ఉంటానని వితండవాదన చేయడం విశేషం.

కాగా, అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ చేస్తున్న వాదనలను భారత్ బలంగా తిప్పికొడుతోంది. కశ్మీర్ తమ అంతర్గత వ్యవహారమని, ఇందులో ఇతరుల జోక్యాన్ని సహించబోమని తేల్చిచెబుతోంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here