కార్పొరేట్ పన్ను తగ్గింపుతో జరిగేదేమిటి? ఏయే రంగాలకు లాభం?

0
2


కార్పొరేట్ పన్ను తగ్గింపుతో జరిగేదేమిటి? ఏయే రంగాలకు లాభం?

దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమనాన్ని పారదోలేందుకు, పారిశ్రామిక రంగానికి మరింత ఉత్తేజం ఇచ్చేందుకు కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించిన సంగతి తెలిసిందే. సామాన్యుడి కొనుగోలు శక్తి తగ్గిపోయిందని, కొనుగోళ్లు పడిపోతున్నాయని పలు రంగాల నుంచి వచ్చిన అభ్యర్థలను ఇటీవల పరిశీలించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అందుకు అవసరమైన చర్యల్లో భాగంగా కార్పొరేట్ ట్యాక్స్‌ రేటును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించారు.

ఆర్థిక మంత్రి తీసుకున్న ఈ చర్య వెంటనే సత్ఫలితాలను కూడా ఇవ్వడం ప్రారంభించింది. ప్రకటన వెలువడడమే ఆలస్యం దేశీయ స్టాక్ మార్కెట్‌లో జోష్ మొదలైంది. సెన్సెక్స్, నిఫ్టీలు ఎవరి అంచనాలకు అందనంత స్థాయిలో దూసుకుపోయి చరిత్ర సృష్టించాయి. స్టాక్‌ మార్కెట్‌ భారీ లాభాలతో మదుపుదారుల సంపద ఒక్కరోజులో రూ.7 లక్షల కోట్ల మేర పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్ట్ అయిన కంపెనీల మొత్తం క్యాపిటలైజేషన్‌ విలువ రూ.6.82 లక్షల కోట్లు పెరిగి రూ.1,45,37,378 కోట్లకు ఎగసింది.

పన్ను రేటు తగ్గిస్తే ఏం జరుగుతుంది?

కార్పొరేట్‌ పన్ను రేటు తగ్గింపుతో వివిధ రంగాల్లోని కంపెనీలకు వేల కోట్ల రూపాయల పన్ను ఆదా అవుతుంది. క్రిసిల్‌, ఐసీఐసీఐ డైరెక్ట్‌ల అంచనా ప్రకారం.. స్టాక్‌ మార్కెట్లో నమోదైన టాప్‌ 1,000 కంపెనీల పన్ను ఆదా మొత్తమే రూ.37,000 కోట్ల వరకు ఉండనుంది. మరోవైపు ఈ పన్ను రేటు తగ్గింపుతో భారత్ కూడా చాలా ఆసియా దేశాల సరసన చేరిపోయింది. పన్ను తగ్గింపు ద్వారా ఆదా అయిన డబ్బును ఆయా కంపెనీలు పెట్టుబడులుగా మలుచుకోవచ్చు. అలాగే తాము ఉత్పత్తి చేసే వస్తువుల ధరలను కొంత మేర తగ్గించవచ్చు. దీనివల్ల వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుంది. కొనుగోళ్లు మరింత పెరిగే అవకాశాలున్నాయి.

కొత్త పెట్టుబడులు, కొత్త కంపెనీలు రావచ్చు...

కొత్త పెట్టుబడులు, కొత్త కంపెనీలు రావచ్చు…

కార్పొరేట్ పన్ను తగ్గింపుతో తక్షణ ప్రయోజనం ఏమిటంటే.. కంపెనీల్లో నగదు ప్రవాహం పెరుగుతుంది. వృద్ధి గాడిన పడుతుంది. కార్పొరేట్ సెంటిమెంట్ బలపడుతుంది. దీనివల్ల రుణభారం తగ్గించుకోవడానికి అవకాశం కలుగుతుంది. లేదంటే ఆదా అయిన లాభాన్ని పెట్టుబడిగా పెట్టుకుని ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశం కలుగుతుంది. అలాగే కొత్తగా ఏర్పాటు అయ్యే కంపెనీలకు సంబంధించి పన్ను రేటును 15 శాతంగా నిర్దేశించడం వల్ల అంతర్జాతీయ కంపెనీలు మన దేశంలో కంపెనీలు ఏర్పాటు చేయడానికి, పెట్టుబడులు పెట్టడానికి అవకాశం కలుగుతుంది.

బ్యాంకింగ్, ఆటో, ఎఫ్ఎంసీజీలకు ప్రయోజనం...

బ్యాంకింగ్, ఆటో, ఎఫ్ఎంసీజీలకు ప్రయోజనం…

కార్పొరేట్‌ పన్ను రేటును తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ద్వారా బ్యాంకింగ్‌, ఆటోమొబైల్, ఎఫ్‌ఎంసీజీ వంటి రంగాలకు అధికంగా ప్రయోజనం లభించనున్నట్టు క్రిసిల్ రీసెర్చ్, ఐసీఐసీఐ డైరెక్ట్‌ రీసెర్చ్‌ నివేదికలు పేర్కొంటున్నాయి. బ్యాంకుల పన్ను తరువాతి లాభం (ప్యాట్) 11-13 శాతం పెరుగుతుంది. దీనివల్ల అడ్జస్టబుల్ బుక్ వాల్యూ(ఏబీవీ) 3 శాతం అధికమవుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ వంటి పెద్ద ప్రైవేట్ బ్యాంకులు భారీగా లబ్ధి పొందుతాయి. కమర్షియల్ వెహికల్ కంపెనీలు ప్రైవేట్ క్యాపెక్స్‌ను పెంచుకుని ప్రయోజనం పొందుతాయి. ఎఫ్ఎంసీజీ కంపెనీల రాబడులు 5-12 శాతం పెరిగే అవకాశం ఉంది.

ఇతర రంగాల పరిస్థితి ఏమిటి?

ఇతర రంగాల పరిస్థితి ఏమిటి?

క్యాపిటల్ గూడ్స్ రంగాన్ని పరిశీలిస్తే.. ఇవి 25-34 శాతం వరకు పన్నులు కట్టాలి. పన్ను రేటు తగ్గింపు వల్ల మిడ్ క్యాప్ కంపెనీలకు ఎక్కువ లాభం కలుగుతుంది. విద్యుదుత్పత్తి రంగానికి వాటి టారిప్‌ల వల్లే లాభనష్టాలు ఉంటాయి. మ్యాట్ తగ్గింపు వల్ల వాటి లాభనష్టాల్లో పెద్ద మార్పులేమీ ఉండవు. ఇక సిమెంట్ తయారీ కంపెనీలు ప్రస్తుతం అధిక పన్ను చెల్లిస్తున్నాయి. ఇప్పుడు ట్యాక్స్ రేటు తగ్గింపుతో వీటికి ప్రయోజనం కలుగుతుంది. నిర్మాణ రంగంలో కొన్ని కంపెనీలకు మాత్రమే లాభం కలుగుతుంది. హోటళ్లు, లాజిస్టిక్స్, ఆల్కాహాల్, మెటల్, మైనింగ్ కంపెనీలకు మాత్రం ఎంతో మేలు జరుగుతుంది.

ఐటీ, ఫార్మా రంగాల పరిస్థితేమిటి?

ఐటీ, ఫార్మా రంగాల పరిస్థితేమిటి?

కార్పొరేట్ పన్ను రేటు తగ్గింపుతో ఐటీ, ఫార్మా వంటి రంగాలకు పెద్దగా లాభం కలగకపోవచ్చని క్రిసిల్ రీసెర్చ్, ఐసీఐసీఐ డైరెక్ట్‌ రీసెర్చ్‌ నివేదికలు చెబుతున్నాయి. ఎందుకంటే.. ఈ రంగాలకు ఇప్పటికే పన్ను రేటు తక్కువగా ఉంది. పైగా ఈ రంగాలకు సెజ్‌లు, ట్యాక్స్ ఫ్రీ జోన్లు, ఆర్ అండ్ డీ బెనిఫిట్లు ఇప్పటికే ఉన్నాయి. వాటితో పోల్చుకుంటే ప్రస్తుత కార్పొరేట్ ట్యాక్స్ రేటు తగ్గింపుతో ఐటీ, ఫార్మా తదితర రంగాలకు పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు.

ఆ లోటును పూడ్చుకోవడం ఎలా?

ఆ లోటును పూడ్చుకోవడం ఎలా?

కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపుతో ప్రభుత్వ ఖజానాకు రూ.1.5 లక్షల కోట్ల వరకు ఆదాయం తగ్గిపోతుంది. అయితే పన్ను రేటు తగ్గింపుతో కార్పొరేట్, తయారీ రంగంలో పెట్టుబడులు పెరగొచ్చు. తద్వారా మరిన్ని కొత్త కంపెనీలు ఏర్పాటు కావచ్చు. ఇలా ఏర్పాటయ్యే కొత్త కంపెనీల వల్ల కొంత మేర ఆదాయం సమకూరుతుంది. మరోవైపు కార్పొరేట్ ట్యాక్స్ రేటు తగ్గింపు వల్ల ద్రవ్యలోటు మరింత పెరిగే ప్రమాదం కూడా లేకపోలేదు. దీనిని అదుపు చేయడానికి కూడా మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా సిగరెట్లపై జీఎస్టీ, సెస్‌లను ప్రభుత్వం పెంచే అవకాశాలు ఉన్నాయని ఐసీఐసీఐ డైరెక్ట్‌ రీసెర్చ్‌ నివేదిక పేర్కొంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here