కార్ల అమ్మకాలు తగ్గుతున్నాయ్.. మరి భవిష్యత్ లో ఏం జరగబోతోంది?

0
4


కార్ల అమ్మకాలు తగ్గుతున్నాయ్.. మరి భవిష్యత్ లో ఏం జరగబోతోంది?

దేశీయ మార్కెట్లో కార్ల కంపెనీల అమ్మకాలు క్రమంగా తగ్గుతున్నాయి. దీంతో కంపెనీల్లో ఆందోళన పెరుగుతోంది. అమ్మకాలు ఒకనెల కాకపోతే మరో నెలలో పుంజుకోక పోతాయా అని కంపెనీలు ఎదురు చూస్తూవచ్చాయి. కానీ వాటికి తీవ్ర నిరాశే ఎదురవుతోంది. వరుసగా గత ఎనిమిది నెలల్లో ఈ కంపెనీల అమ్మకాలు తగ్గిపోయాయి.

అమ్మకాల క్షీణతకు ఏ కంపెనీ మినహాయింపు కాదు. మారుతి సుజుకి, హ్యుండై, టాటా మోటార్స్, హోండా, మహీంద్రా అండ్ మహీంద్రా తో పాటు ఇతర కంపెనీలు కూడా అమ్మకాలు తగ్గడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న కాలంలో ప్రతికూల పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని పరిశ్రమ పరిశీలకులు చెబుతున్నారు.

కారణాలేమిటంటే…

* కార్ల అమ్మకాలు తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంధనాల ధరలు. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనివల్ల వాహనదారులు అదనంగా భారాన్ని మోయాల్సి వస్తోంది.

* వాహనాల అమ్మకాల్లో అత్యధికంగా ఫైనాన్స్ ద్వారానే జరుగుతుంటాయి. వడ్డీ రేట్లు అధికంగా ఉండటం వల్ల రుణం తీసుకోవడానికి కొనుగోలుదారులు వెనకడుగు వేస్తున్నారు. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు కొనుగోలు చేద్దాంలే అని కొనుగోళ్లను వాయిదాలు వేసుకుంటున్నారు.

* ధరల్లో పెరుగుదల. ముడిసరుకుల ధరలు పెరిగాయంటూ కంపెనీలు కార్ల ధరలను పెంచుతున్నాయి. ఈ ధరలు కొనుగోలుదారుల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి.

* వర్షాలు సక్రమంగా లేకపోవడం వల్ల దేశంలోని చాలా ప్రాంతాల్లో రైతులు ఆశించిన స్థాయిలో దిగుబడులు రావడం లేదు. మంచిగా పంటలు పండి చేతినిండా డబ్బులు ఉంటే రైతులు కూడా కార్లను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కానీ పంటలు సరిగ్గా లేకపోవడం వల్ల రైతులు కూడా నిరాశతో ఉన్నారు.

* ఎన్నికలు కూడా ఈసారి కార్ల కంపెనీల అమ్మకాలను దెబ్బతీశాయి. చాలా నెలల పాటు ఎన్నికలు సాగడం వల్ల కొనుగోళ్ల విషయంలో ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉన్నారు.

* వచ్చే ఏప్రిల్ నుంచి భారత్ స్టేజ్-6 నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అంటే ఈ నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాహనాల రిజిస్ట్రేషన్లను మాత్రమే అనుమతిస్తారు. నూతన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారు కూడా తమ కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు.

* నగరాల్లో ఓలా, ఉబర్ తదితర క్యాబ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. వీటిని వినియోగించు కుంటున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇవి కూడా కార్ల అమ్మకాలను ప్రభావితం చేస్తున్నాయి.

* వాహనాలపై వస్తుసేవల పన్ను అధికంగా ఉంది. దీన్ని తగ్గించమని ఆటోమొబైల్ వర్గాలు చెబుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడంలేదు.

* వాహన బీమా వ్యయాలు కూడా భారీగా పెరిగిపోయాయి. ఇది కూడా కొనుగోలు దారులను ఇబ్బందులకు గురిచేస్తోంది.

ఏం జరుగుతోంది..

ఏం జరుగుతోంది..

* కార్ల అమ్మకాలు తక్కువగా ఉండటంవల్ల డీలర్ల వద్ద అమ్ముడు పోకుండా ఉంటున్న కార్ల సంఖ్య పెరుగుతోంది. దీనివల్ల వారిపై ఒత్తిడి పెరుగుతోంది. ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేకపోవడం వల్ల కొంతమంది డీలర్లు తమ వ్యాపారానికి స్వస్తి చెబుతున్నారు.

* కార్ల కంపెనీలు అమ్మకాలను దృష్టిలో ఉంచుకొని ఉత్పత్తిని తగ్గిస్తున్నాయి.

ప్రతికూల ప్రభావాలు

ప్రతికూల ప్రభావాలు

* ఆటో మొబైల్ పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు.

* అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల వాహన ఉత్పత్తి నుంచి రవాణా, విక్రయాలు, సర్వీసింగ్ వరకు ప్రభావితమవుతాయి.

* ఉత్పత్తిని తగ్గించడం వల్ల ఆమేరకు కొంతమంది ఉపాధిపై దెబ్బ పడినట్టే.

* ఈ రంగానికి రుణాలు ఇచ్చే ఆర్ధిక సంస్థలు కూడా వ్యాపారాన్ని కోల్పోతాయి.

* మరిన్ని కొత్త కంపెనీలు కూడా భారత కార్ల మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి. ఫలితంగా కంపెనీల మధ్య పోటీ మరింత తీవ్రం కాబోతోంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here