కాశ్మీర్ లొల్లి : రాజ్యంగ ప్రతులను చింపబోయి.. బట్టలను చింపుకొని!

0
3


కాశ్మీర్ లొల్లి : రాజ్యంగ ప్రతులను చింపబోయి.. బట్టలను చింపుకొని!

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక స్వయంప్రత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి ఉద్దేశించిన తీర్మానాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టిన సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జమ్మూ కాశ్మీర్ కు చెందిన పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ), నేషనల్ కాన్ఫరెన్స్ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు..

అధికార పార్టీకి, అమిత్ షా లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన తీర్మానాన్ని చింపివేయడానికి ప్రయత్నించారు. మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆదేశాల మేరకు వారిని బయటికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పీడీపీ సభ్యులు తమ బట్టలను చింపుకొన్నారు.

ఈ ఉదయం 11 గంటల సమయంలో అమిత్ షా రాజ్యసభకు చేరుకున్నారు. ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన తీర్మాన ప్రతులను సభ్యులకు అందజేశారు. తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టిన వెంటనే పీడీపీ సభ్యులు నజీర్ అహ్మద్, ఎంఎం ఫయాజ్ సభలో గట్టిగా నినాదాలు చేశారు. అమిత్ షా ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమ చేతికి ఇచ్చిన తీర్మానం ప్రతులను చింపివేయడానికి ప్రయత్నించారు. కాంగ్రెస్ సహా బీజేపీయేతర పార్టీలకు చెందిన సభ్యులు వారికి మద్దతుగా నిలిచారు.

PDPs RS MPs Nazir Ahmad Laway MM Fayaz protest in Parliament premises

ప్రతిపక్ష సభ్యులందరూ ఒక్కసారిగా లేచి నిల్చొని, అధికార పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల మధ్యే అమిత్ షా తన ప్రసంగాన్ని కొనసాగించారు. అయినప్పటికీ- పీడీపీ సభ్యుల ఆందోళన సద్దు మణగక పోవడంతో ఛైర్మన్ వెంకయ్య నాయుడు జోక్యం చేసుకున్నారు. సభ నుంచి బయటికి వెళ్లాలని ఆదేశించారు. అప్పటికీ వారు కదలకపోవడంతో మార్షల్స్ రంగ ప్రవేశం చేశారు. నజీర్ అహ్మద్, ఎంఎం ఫయాజ్ లను సభ నుంచి బయటికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా తీవ్ర ఆగ్రహానికి గురైన ఫయాజ్.. తన ఒంటిమీద దుస్తులను చింపుకొన్నారు. తాను ధరించిన కుర్తా చింపుకొని, బయటికి వెళ్లారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here