కొత్త పుస్తకాలు రావు.. పెట్టుబడి అందదు

0
0


కొత్త పుస్తకాలు రావు.. పెట్టుబడి అందదు

జిల్లాలో తీరని అన్నదాత కష్టాలు

న్యూస్‌టుడే, బోధన్‌

నవీపేట మండలం కమలాపూర్‌కు చెందిన రైతు బిజ్జం మూరారెడ్డికి 4.26 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. రెవెన్యూ అధికారులు 27 గుంటల భూమిని తగ్గించి కొత్త పట్టాపాసు పుస్తకం అందించారు. ఇది జరిగి ఏడాదిన్నర అవుతోంది. విస్తీర్ణాన్ని సరిచేసి కొత్త పుస్తకం ఇవ్వాలని కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. పెట్టుబడి సహాయాన్ని కూడా వాపసు చేశారు. ఇప్పటికీ ఆయన సమస్య పరిష్కారం కావడంలేదు.

ఈ సమస్య ఒకరిద్దరిది కాదు. జిల్లా వ్యాప్తంగా వేలాది మంది రైతులు కొత్త పాసుపుస్తకాల జారీతో స్థిరాస్తులను పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోతున్నారు. భూరికార్డుల ప్రక్షాళన వారి పాలిట శాపంగా పరిణమించింది. ఆన్‌లైన్‌ సాంకేతిక లోపంతో తలెత్తిన లోపాన్ని సరిచేసే ప్రయత్నాలు జరగడంలేదు. ఆయా కోణాలలో 17,670 పుస్తకాలు ముద్రణపరమైన సమస్యకు గురైనట్టు తేల్చిన అధికార యంత్రాంగం ఆ మొత్తాన్ని సవరించేందుకు పూనుకోవడంలేదు. ఫలితంగా పెట్టుబడి సహాయం పక్కనబెడితే. స్థిరాస్తులు పోగొట్టుకునే పరిస్థితి ఎదురవడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది.

రికార్డుల ప్రక్షాళన ముగిసి…

రైతుల వద్ద ఉన్న పట్టాదారు పాసుపుస్తకంలో నమోదైన సర్వే నంబర్లు, భూమి విస్తీర్ణాన్ని రెవెన్యూ రికార్డులతో సరిచూసుకొని కొత్త పుస్తకాలు ఇవ్వడానికి ప్రభుత్వం 2017 సెప్టెంబరు 15వ తేదీన భూరికార్డుల ప్రక్షాళన (ఎల్‌ఆర్‌యూపీ) ప్రారంభించింది. ఇందుకోసం 90 రోజులు గ్రామసభలు నిర్వహించి అదేఏడు డిసెంబరులో ముగించారు. రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి రికార్డులు సరిచేశారు. తరువాత ‘ధరణి’ పేరుతో ఆన్‌లైన్‌ ప్రక్రియ మొదలుపెట్టారు. అనేక సాంకేతిక అంశాలు చర్చించాక 2018 మే 10వ తేదీ నుంచి ఈ-పాసు పుస్తకాలు జారీ చేశారు. మండల తహసీల్దార్‌ కార్యాలయంలో నమోదైన భూమి వివరాలు, డివిజన్‌, జిల్లా, రాష్ట్ర కార్యాలయంలో ఒకే రీతిలో నిర్వహించడం ధరణి ఉద్దేశం. బోగస్‌ పాస్‌ పుస్తకాలను సమూలంగా అరికట్టడం ఈ-పుస్తకాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం. అయితే కొత్త పుస్తకాలు పొందిన రైతులకు సర్కారు పంట పెట్టుబడి సహాయం అందించడం ప్రారంభించింది. న్యాయపరమైన చిక్కులున్న భూముల జోలికి వెళ్లక మిగితా కర్షకులందరికీ వంద శాతం పుస్తకాలు అందించాలని పాలకులు పలు సమావేశాల ద్వారా స్పష్టం చేశారు. ‘దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదు’ అన్నట్లు అధికారులు అన్నదాతపై నిర్లక్ష్యం చూపుతున్నారు. రికార్డుల ప్రక్షాళన అనంతరం భూముల రిజిస్ట్రేషన్‌ను తహసీల్దార్‌ ద్వారా చేయిస్తామని, దీంతో చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సర్కారు ప్రకటించింది. అయితే ఈ రికార్డుల ప్రక్షాళన ఇంకా కొలిక్కిరావడంలేదు. జిల్లాలో 17,670 మంది రైతుల పాస్‌ పుస్తకాల లోపాలను సరిచేయాల్సి ఉందని గుర్తించిన అధికారులు వాటిని పూర్తిగా ఎప్పటికి ముగిస్తారనే విషయం తేలడంలేదు. పేర్లలో దొర్లిన ముద్రణపరమైన లోపాలు, ఆధార్‌ అనుసంధానం తప్పులను సరిచేశారు. కానీ భూముల విస్తీర్ణం తగ్గిన వాటిని పక్కన పడేశారు. నిజానికి ప్రభుత్వం ప్రకటించిన రికార్డుల ప్రక్షాళన ఎప్పుడో ముగిసింది. ప్రస్తుతం సమగ్ర భూరికార్డుల నిర్వహణ (ఐఎల్‌ఆర్‌ఎంఎస్‌) అమలులో ఉంది. అయితే జిల్లా యంత్రాంగం ఇంకా ప్రక్షాళన దశలోనే ఉండడం గమనార్హం.

ప్రభుత్వ భూముల సంగతి అంతే..

రైతుల పట్టాదారు పాసు పుస్తకాల సంగతి ఇలా ఉంటే ప్రభుత్వ భూముల విషయం మరోలా ఉంది. గతంలో సర్కారు పేద కుటుంబాలను గుర్తించి వారికి భూపంపిణీ చేసింది. వాటిని చాలా మంది అమ్ముకున్నారు. అయితే కొనుగోలు చేసిన వారు కూడా పేదవారై ఉండి సాగు చేస్తున్నట్లైతే వారికి కొత్త పట్టా పుస్తకాలు ఇవ్వాలని ఆదేశాలు ఉన్నాయి. అలాంటి లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను కలెక్టర్‌కు అప్పగించారు. అర్హుల జాబితాను గత శాసనసభ ఎన్నికలకు ముందు కలెక్టర్‌ ఆమోదించి మండలాలకు పంపారు. ఈ రకంగా బోధన్‌ మండలంలో 146 మంది అర్హులకు సంబంధించి 141.24 ఎకరాల భూమి ఉంది. సాక్షాత్తు కల్టెకర్‌ ఆమోదించిన లబ్ధిదారులకు ఈ-పుస్తకాలు ఇవ్వడంలేదు. కొత్త పుస్తకాలు జారీ చేయడానికి లంచాలకు పెద్దపీట వేశారు. అనుకూలురైన కింది స్థాయి సిబ్బందిని లబ్ధిదారుల వద్దకు పంపి బేరాలు చేస్తున్నారు. ఒప్పందం కుదిరిన వాటికి పుస్తకాలు జారీ చేసి.. మిగతా వాటిని పక్కన పడేస్తున్నారు. భూముల విలువను బట్టి వసూళ్లు నడుస్తున్నాయి. రెంజల్‌ మండలం కందకుర్తిలో 309 ఎకరాలకు సంబంధించి వివాదం అపరిష్కృతంగా ఉంది. కొత్త పుస్తకాల కోసం నిరీక్షిస్తూ విసిగిపోతున్న కర్షకుల కోసం ఉన్నత స్థాయిలో టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేయాలనే డిమాండు ఉంది.

శ్రీముఖాలు జారీ చేసినా అంతే…

కొత్త పాసుపుస్తకాలు జారీలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని మే నెలలో జేసీ వెంకటేశ్వర్లు ఆరుగురు తహసీల్దార్లకు శ్రీముఖాలు జారీ చేశారు. వారిలో నందిపేట, ఆర్మూర్‌, ధర్పల్లి, బోధన్‌, నవీపేట, వేల్పూరు తహసీల్దార్లు ఉన్నారు. వీరి వద్ద 6,389 ఖాతాలు (రైతులకు అందించాల్సిన పుస్తకాలు) పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఎన్నిసార్లు చెప్పినా పరిస్థితి మారడంలేదని క్రమశిక్షణా చర్యలు ఎందుకు తీసుకోరాదో చెప్పాలని లేఖ నంబర్‌ డి2/1566 ద్వారా కోరారు. చర్యల నుంచి తప్పించుకోవడానికి ఎవరి పద్దతిలో వారు వెళ్లారు. కానీ, పుస్తకాల జారీలో మాత్రం పురోగతి చూపడంలేదు. ఫలితంగా అర్హులైన రైతులు బాధితులుగా మారుతున్నారు.

బోధన్‌ మండలంలోని కల్దుర్కి గ్రామ మహిళా రైతుకు 4.17 ఎకరాల భూమి ఉండగా కేవలం 3 ఎకరాలకు కొత్త పుస్తకం సిద్ధం చేయగా ఆమె వాపసు ఇచ్చేశారు. మిగితా 1.17 ఎకరాల విస్తీర్ణాన్ని జత చేసి పాస్‌ పుస్తకం ఇవ్వాలని చక్కర్లు కొడుతున్నారు. ఎక్కడా స్పందన లేదు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here