కొనబోతే కొరివి..అమ్మబోతే అడవి: కట్ట కొత్తిమీర ధర తెలిస్తే కంట కన్నీరే..!

0
10


కొనబోతే కొరివి..అమ్మబోతే అడవి: కట్ట కొత్తిమీర ధర తెలిస్తే కంట కన్నీరే..!

వరుణదేవుడు సకాలంలో కరుణ చూపకపోవడం, పంట సరైన సమయానికి చేతికి రాకపోవడంతో మార్కెట్లలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. కొనబోతే కొరివి.. అమ్మబోతే అడవి అన్నట్లుగా తయారైంది పరిస్థితి. కూరగాయలు కొనాలంటేనే మధ్యతరగతి వారు జంకుతున్నారు. కట్ట కొత్తిమీర ఒకప్పుడు రూ.10 పలకగా తాజాగా మార్కెట్లో కట్ట కొత్తిమీర కొనాలంటే రూ. 120 వరకు వెచ్చించాల్సి వస్తోంది. ఒక్క కొత్తిమీర ధరలే ఇలా లేవు… మిగతా కూరగాయల ధరల పరిస్థితి కూడా ఇంతే ఉంది. దీంతో ప్రజలు మార్కెట్లకు వెళ్లి ధరల విషయం తెలుసుకుని ఏమీ కొనకుండానే వెనక్కు మరలుతున్నారు.

తెలుగురాష్ట్రాల్లో వర్షాలు ఇంకా పూర్తిస్థాయిలో పడలేదు. పంటలు పండటం లేదు. కూరగాయల పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. ఏదైనా కొనాలంటే చుక్కలు చూపిస్తున్నాయి. కట్ట కొత్తిమీర ధర అమాంతం కొండెక్కి కూర్చుంటే… టమాటా మాట ఇక చెప్పక్కర్లేదు. కూరగాయలు కాస్తో కూస్తో అగ్గువ దొరికే రైతు బజార్లలో కూడా ధరలు మండిపోతున్నాయి. హైదరాబాదులోని రైతు బజార్లలోనే ఈ పరిస్థితి నెలకొంటే ఇక బయట కూరగాయల షాపుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించొచ్చు. హైదరాబాదులో రూ.10 పెడితే రెండు రెమ్మలు మాత్రమే కొత్తిమీర ఇస్తున్నారు. ఇక టమాటా ధరలు రైతు బజార్లో దాదాపు రూ. 50 పలుకుతుండగా బయటకొచ్చేసరికి కిలో 60 రూపాయలు పలుకుతోంది. ఇక పచ్చిమిర్చి ధరలు కూడా కళ్లకు నీళ్లు తెప్పిస్తున్నాయి. హైదరాబాదులో కిలో పచ్చిమిర్చి రూ.120గా ఉంది.

ఇక ఏపీలోని చిత్తూరు జిల్లాలో కట్ట కొత్తిమీర ధర రూ.120గా ఉంది. ఇక టమాటాలు బాగా పండే చిత్తూరు జిల్లాలో కూడా ధరలు బాగా పెరిగిపోయాయి. చేసే వంటల్లో కొత్తిమీర కచ్చితంగా పడితేనే రుచి ఉంటుందని అలాంటి కొత్తిమీరను రూ.120 పెట్టి కొనాలంటే చాలా బాధగా ఉందని మిగతా కూరగాయలు కొనేలా లేవని మార్కెట్లకు వచ్చిన వారు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ తామెదుర్కొనలేదని చెబుతున్నారు. ఇక ఫంక్షన్లకు కొత్తిమీర కొనాలంటే అంత డబ్బులు వెచ్చించలేకోపోతున్నామని వినియోగదారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ యార్డు అధికారులు చెబుతున్నారు. దీనికి కారణం సకాలంలో వర్షాలు పడకపోవడమేనని చెబుతున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here