గుడ్ న్యూస్: భారత్‌లో సౌదీ అరేబియా భారీ పెట్టుబడులు, రూ.7,00,000 కోట్లు పెట్టుబడులు

0
0


గుడ్ న్యూస్: భారత్‌లో సౌదీ అరేబియా భారీ పెట్టుబడులు, రూ.7,00,000 కోట్లు పెట్టుబడులు

ప్రపంచ చమురు రారాజు సౌదీ అరేబియా … భారత్ లో భారీ పెట్టుబడులకు సిద్ధమవుతోంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇండియా గ్రోత్ స్టోరీ సౌదీ అరేబియా ను ఆకర్షిస్తోంది. దీంతో మన దేశంలో ఏకంగా 100 బిలియన్ డాలర్లు (సుమారు రూ 7,00,000 కోట్లు) పెట్టుబడిగా పెట్టాలని సంకల్పిస్తోంది. ఈ విషయాన్నీ సౌదీ అరేబియా రాయబారి డాక్టర్ సౌద్ బిన్ మొహమ్మద్ అల్ సతి అధికారికంగా వెల్లడించారు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో అయన ఈ విషయాలను ప్రస్తావించారు.

భారత్ లో మెరుగైన అవకాశాలున్న రంగాల్లో పెట్టుబడులను సమకూర్చనున్నట్లు ఆయన తెలిపారు. పెట్రోలియం అన్వేషణ, వెలికితీత, మార్కెటింగ్, మౌలిక సదుపాయాల కల్పన, ఇంధనం, ఇంజనీరింగ్, స్టార్టుప్ రంగాల్లో సౌదీ అరేబియా తన పెట్టుబడులను అందించనుంది. గల్ఫ్ లోని ఒక దేశం భారత్ లో ఈ స్థాయిలో పెట్టుబడులు పెడుతుండటం ఇదే తొలిసారి అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. భారత్ – సౌదీ అరేబియా దేశాల మధ్య పెరుగుతున్న మైత్రి కి ఇది నిదర్శనం అని వారు చెబుతున్నారు.

కొత్త రంగాల్లో వృద్ధి …

గల్ఫ్ లో అత్యంత సంపన్న దేశం ఐన సౌదీ అరేబియా, తన అపార చమురు నిల్వల నుంచి ప్రపంచానికి ముడి చమురు ఎగుమతి చేయడం ద్వారా బాగా ఆర్జిస్తోంది. కానీ కొన్నేళ్లుగా చమురు ధరలను డిమాండ్ – సప్లై అంశాలు ప్రభావితం చేయడం తగ్గిపోయాయి. ఇప్పుడు కేవలం అమెరికా సహా కొన్ని దేశాలు చమురు ధరలను నిర్దేశిస్తున్నాయి. అదే సమయంలో ఇరాన్, వెనెజులా వంటి దేశాలపై ఆంక్షలు విధించి ఉన్న చమురును అమ్ముకోకుండా అడ్డుకోగలుగుతోంది అగ్ర రాజ్యం అమెరికా. అదే సమయమంలో అమెరికా-చైనా ల మధ్య వాణిజ్య యుద్ధం కూడా భవిష్యత్ లో ఏ ఒక్క దేశం కేవలం ఒక రంగంపైనే ఆధారపడి ముందుకు వెళ్లడం సాధ్యం కాదని నిరూపితం అవుతోంది. ఈ విషయాన్నీ చక్కగా పసిగట్టిన సౌదీ అరేబియా… భవిష్యత్ లో తమ పెట్టుబడులకు మెరుగైన రాబడులను అందించగలిగే దేశాలవైపు కన్నేస్తోంది. ఈ విషయంలో భారత్ తనకు సరైన భాగస్వామిగా కనిపిస్తోంది. అలాగే కేవలం పెట్రోలియం రంగమే కాకుండా విభిన్న రంగాల్లోకి విస్తరించి చమురు లో నెలకొనే ఒడిదుడుకులను తట్టుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

విశ్వాస పాత్రులు…

కొన్ని దశాబ్దాలుగా భారత్ – సౌదీ అరేబియా దేశాలు ద్విపాక్షిక వాణిజ్యంలో మెరుగైన పురోగతిని సాధించాయి. ఇస్లామిక్ దేశం అయినప్పటికీ… భారత్ కు గల్ఫ్ లో విశ్వాస మిత్రుడుగా ఆ దేశం నడుచుకొంటోంది. ఈ మైత్రి ప్రధాని నరేంద్ర మోడీ దౌత్యంతో మరింత పటిష్టం అయిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇరు దేశాల ద్విపాక్షిక వాణిజ్యం 2017-18 లో దాదాపు 28 బిలియన్ డాలర్లు (రూ 1,96,000 కోట్లు) ఉండగా.. 2018-19 లో అది మరింతగా పెరిగి దాదాపు 34 బిలియన్ డాలర్లకు చేరుకొంది (దాదాపు రూ 2,38,000 కోట్లు). ఇందులో సుమారు 27 బిలియన్ డాలర్ల మేరకు సౌదీ అరేబియా … భారత్ కు ఎగుమతి చేస్తుండగా.. మన దేశం నుంచి అక్కడికి దాదాపు 7 బిలియన్ డాలర్ల మేరకు ఎగుమతులు జరుగుతున్నాయి. భారత చమురు అవసరాల్లో దాదాపు ఐదో వంతు ఒక్క సౌదీ అరేబియా నుంచే సమకూరుతుండటం విశేషం.

వ్యవసాయం లో కూడా …

మన దేశం నుంచి సౌదీ అరేబియా కు ఎగుమతి అయ్యే ఉత్పత్తుల్లో వ్యవసాయ సంబంధిత రంగాలవే అధికంగా ఉంటాయి. ఎడారి దేశం కాబట్టి సౌదీకి ఆహార ఉత్పత్తుల అవసరం అధికం. అందుకే, తాజా పెట్టుబడుల్లో వ్యవసాయ రంగం, మినరల్స్ అండ్ మైనింగ్ రంగాలకు పెద్ద మొత్తం సమకూర్చాలని భావిస్తోంది. సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థ ను వివిధీకరించాలి అని సంకల్పించటం తో ఆ దేశం ఇప్పుడు వ్యవసాయం వంటి ఫుడ్ సెక్యూరిటీ ని అందించే రంగాలపై దృష్టి సారిస్తోంది. ఆ దేశ విజన్ 2030 లో భాగంగానే కొత్త పెట్టుబడులు ఉన్నట్లు తెలుస్తోంది. భారత్- సౌదీ అరేబియా ల మధ్య సుమారు 40 రంగాల్లో పెట్టుబడులకు అవకాశం ఉన్నట్లు గుర్తించారు.

రిలయన్స్ తో అరాంకో జట్టు..

భారత్ లో పెట్టుబడుల దిశగా ఆ దేశంలోని అతిపెద్ద చమురు రంగ కంపెనీ అరాంకో ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకోంది. ఇందులో భాగంగా మన దేశ పశ్చిమ కోస్తా ప్రాంతంలో 44 బిలియన్ డాలర్ల (సుమారు రూ 3,08,000 కోట్లు) పెట్టుబడులు పెట్టాలని సంకల్పించింది. పెట్రోకెమికల్ ప్రాజెక్ట్ కు పురుడుపొస్తోంది. ఇందుకోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ తోనూ జట్టు కడుతోంది. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ విజన్ 2030 ప్రకారం భారత్-సౌదీ అరేబియా ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం భారీ స్థాయిలో పెరగాలి. అందులో భాగంగా భారత్ లో ఉన్న అన్ని రకాల అవకాశాలను పరిశీలించి సౌదీ అరేబియా పెట్టుబడులు పెట్టనుంది. ఇది నిజంగా మన దేశానికి, అలాగే యువతకు గుడ్ న్యూస్. మన ఎకానమీ పటిష్టం కావటంతో పాటు, యువతకు అపారమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here