గురుకులాలకు ల్యాప్‌టాప్‌ సొబగులు

0
0


గురుకులాలకు ల్యాప్‌టాప్‌ సొబగులు

కొత్త ఎస్సీ గురుకులాలకు అందజేత
ఉభయ జిల్లాల్లో ఆరు చోట్ల కంప్యూటర్‌ విద్య
న్యూస్‌టుడే, బోధన్‌ పట్టణం

రెండేళ్ల కిందట ఉభయ జిల్లాల్లో ఏర్పాటైన ఆరు గురుకులాలకు ఎస్సీ గురుకుల సొసైటీ ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేసింది. నిజామాబాద్‌లో.. బోధన్‌, వేల్పూరు బాలుర, నవీపేట, ఆర్మూర్‌ బాలికలు, కామారెడ్డిలో.. లింగంపేట్‌, బిచ్కుంద(అచ్చంపేట)లో కొత్తవి ఏర్పాటయ్యాయి. ఒక్కో గురుకులానికి 18 చొప్పున ల్యాప్‌టాప్‌లు వచ్చాయి. వీటితోపాటు ప్రొజెక్టర్లను సైతం అందించారు.

ఒకేసారి ట్రాలీలో…
ఇప్పటి వరకు విద్యాలయాల్లో కంప్యూటర్‌ విద్య కోసం డెస్క్‌టాప్‌ కంప్యూటర్లను వినియోగించేవారు. వాటికి ప్రత్యేక గది, టేబుళ్లు, విద్యార్థులు కూర్చోవడానికి కుర్చీలు, విద్యుత్తు సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేయాల్సి వచ్చేది. అరకొర గదులున్న బడులకు వీటిని సరఫరా చేస్తే స్థలాభావంతో మూలనపడేసే ఆస్కారమేర్పడేది. దీని వల్ల విద్యార్థులు కంప్యూటర్‌ విద్యకు నోచుకోక.. అంశాల్లో తర్ఫీదు పొందాలన్న సర్కారు ఆశయానికి విఘాతం కలిగేది. అందుకే అన్ని సమస్యలకు పరిష్కారం చూపించేలా ల్యాప్‌టాప్‌లను ఎంపిక చేశారు. వీటి నిర్వహణలోనూ ప్రత్యేకతను చాటారు. 20 వరకు ల్యాప్‌టాప్‌లు భద్రపరచడం, ఒకేసారి ఛార్జింగ్‌ చేయడంతోపాటు ఎక్కడికైనా తరలించుకుపోయేలా ట్రాలీని కొనుగోలు సైతం చేశారు.

బోధన సమయంలోనే బయటికి….
గురుకులాల్లో ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు మాత్రమే కంప్యూటర్‌ విద్య నేర్పుతున్నారు. వీరికి నిర్దేశించిన సమయంలో కంప్యూటర్‌ శాస్త్రాన్ని బోధిస్తారు. ఆ సమయంలో ట్రాలీని తరగతి గదికి తీసుకెళ్తారు. అందులోని ల్యాప్‌టాప్‌లను బయటకు తీసి ప్రత్యేక స్టాండ్‌పై ఉంచుతారు. ఒక్కో ల్యాప్‌టాప్‌ ఎదురుగా ఇద్దరు విద్యార్థులు కూర్చుంటారు. టీచర్‌ చెప్పినవి సాధన చేస్తారు. తరగతి పూర్తయ్యాక మళ్లీ ట్రాలీలో భద్రపరిచి కార్యాలయానికి తరలిస్తారు. ట్రాలీలో ప్రతి ల్యాప్‌టాప్‌నకు నిర్దేశించిన ఛార్జింగ్‌ కేబుల్‌ ఉంటుంది. దీని ద్వారా అన్ని ల్యాప్‌టాప్‌లు ఒకేసారి ఛార్జింగ్‌ అవుతాయి.

సులువుగా ఉంది
– చక్రపాణి, ప్రిన్సిపల్‌
గురుకుల సొసైటీ విద్యార్థుల కోసం ల్యాప్‌టాప్‌లు అందజేసింది. నెలలో ఒక వారం కంప్యూటర్‌ శిక్షణ ఉంటుంది. ఆ వారంలో పిల్లల స్థాయికి అవసరమైన ప్రాథమిక కంప్యూటర్‌ వినియోగ అప్లికేషన్లను నేర్పిస్తాం. ల్యాప్‌టాప్‌లు కావడంతో విద్యార్థులు ఆసక్తిగా నేర్చుకొంటున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here