గోవూర్‌ విద్యావనం

0
3


గోవూర్‌ విద్యావనం

పచ్చదనం పరుచుకున్న ఉన్నత పాఠశాల

అక్కడ అడుగు పెట్టగానే పిల్ల గాలులు స్వాగతిస్తాయి. పచ్చదనం ఆప్యాయంగా పలకరిస్తుంది. ఏపుగా పెరిగిన మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతాయి. ఇదేదో నందనవనం అనుకొంటే పొరపాటే.. ప్రకృతి ఒడిని మైమరిపించే ఈ ప్రాంతమే మోస్రా మండలం గోవూర్‌ ఉన్నత పాఠశాల.

న్యూస్‌టుడే, వర్ని

గోవూర్‌ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు మొక్కలు పెంచి సంరక్షిస్తున్నారు. వీరికి గ్రామస్థులు, యువజన సంఘాల సభ్యులు తోడుగా నిలుస్తూ పాఠశాల అభివృద్ధికి చేయూతనిస్తున్నారు. ఏటా హరితహారంలో మొక్కలు నాటుతున్నారు. వాటిని విద్యార్థులు దత్తత తీసుకొని రక్షిస్తున్నారు.

1,075… 

ఆరు నుంచి పదో తరగతి వరకు 104 మంది విద్యార్థులు చదువుకొంటున్నారు. నిత్యం పాఠశాల సమయం కంటే అరగంట ముందే వచ్చి మొక్కలకు నీరు పడుతున్నారు. ప్రతి శనివారం పరిశుభ్రత.. పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పాలిథిన్‌ వ్యర్థాలను పాఠశాల పరిసర ప్రాంతాల్లో కనిపించనీయరు. మొక్కలకు హాని కలిగించే వేటినీ దరిచేరనీయరు. కంపోస్ట్‌ గుంతను ఏర్పాటు చేసి చెత్తను అందులో వేస్తున్నారు. ఐదేళ్లుగా విడతల వారీగా నాటిన మొక్కలు నేడు 1,075 చెట్లుగా ఎదిగాయి.

వీరి భాగస్వామ్యం

పాఠశాలకు వెళ్లిన ప్రతి ఒక్కరు పచ్చని వాతావరణానికి ముగ్దులవుతున్నారు. వీరి ఆసక్తిని గమనించిన గ్రామస్థులు, యువకులు సాయంత్రం సమయాల్లో మొక్కల సంరక్షణ బాధ్యతను తీసుకుంటున్నారు. పలు యువజన సంఘాల ప్రతినిధులు ఏర్పాటు చేసిన వివేకానంద, సరస్వతీదేవి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. 

పాఠశాలలోనే కాకుండా…

పాఠశాలలోనే కాకుండా అందరం ఇంటి వద్ద కూడా మొక్కలను పెంచుతున్నాం. వృక్ష సంపద తగ్గిపోవడం వల్ల పర్యావరణం దెబ్బతిని ఎన్నో వైపరీత్యాలు ఏర్పడతాయనే విషయాన్ని ఉపాధ్యాయులు తెలియజేశారు. మేము మొక్కలను దత్తత తీసుకున్నాం. పాఠశాలకు వస్తే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. 

– అమూల్య, వైష్ణవి, విద్యార్థినులు

అందరి సహకారంతోనే 

పాఠశాలను ఇలా తీర్చిదిద్దడం విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్థుల సహకారంతోనే సాధ్యమైంది. విద్యార్థులు పాఠశాల వేళ కంటే ముందుగానే వచ్చి తోట పని చేయడం.. దానికి తల్లిదండ్రులు సహకరించడం ఎంతగానో దోహదపడింది. వారు బడిని నందనవనంగా మార్చడానికి ఇష్టంగా కష్టపడ్డారు.

– నర్సింగరావు, ఉపాధ్యాయుడు

ప్రహరీ నిర్మించాలి
 హన్మాండ్లు, ప్రధానోపాధ్యాయుడు

విద్యార్థులు అంకితభావంతో నాటిన ప్రతి మొక్కను రక్షించారు. వాటి కోసం నిత్యం సమయాన్ని కేటాయిస్తున్నారు. ప్రహరీ లేకపోవడంతో నాటిన మొక్కలు, పెరిగిన చెట్లకు రక్షణ లేకుండా పోయింది. గ్రామస్థులు సెలవు రోజుల్లో రక్షణ కల్పిస్తున్నారు. విద్యార్థులు ఇంటి వద్ద మొక్కలు నాటి పెంచడం అభినందనీయం.

 Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here