చిరుధాన్యాల సేద్యం.. కరవు దూరం

0
4


చిరుధాన్యాల సేద్యం.. కరవు దూరం

ఎరువులు, పురుగుమందుల అవసరం లేదు

న్యూస్‌టుడే, ఇందల్‌వాయి

* ఏటా చినుకు కరవై.. సాగు భారమవుతోంది. ఎన్నో కష్టనష్టాలకోర్చి పంటలేసినా చీడపీడలతో తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. పెరిగిన పెట్టుబడి ఖర్చులు.. దిగుబడులకు మద్దతుధర దక్కక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి దిక్కుచోచని స్థితిలో తనువు చాలిస్తున్నారు.

* రసాయన ఎరువులతో పండించిన దిగుబడులను తీసుకొంటున్న ప్రజానీకం శరీరం నిండా రోగాలు మూటగట్టుకొని ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ లక్షలు ధారపోస్తున్న దుస్థితి ఉంది.

* కరవు పరిస్థితుల్లో తక్కువ నీటితో ఎరువులు, పురుగుమందుల అవసరం లేని సంప్రదాయ పంటల సాగుతో ఆదర్శంగా నిలుస్తున్నారు ఇందల్‌వాయి మండలానికి చెందిన కుంట వెంకట్‌రెడ్ఢి

ప్రధాన పొలంలో మొలకెత్తిన కొర్రలు

గన్నారం వాసి వెంకట్‌రెడ్డికి పథ్నాలుగు ఎకరాల పొలం ఉంది. ఇందులో నాలుగు ఎకరాల్లో మామిడి తోట ఉండగా.. మిగతా స్థలంలో వరి, సోయా, మొక్కజొన్న, పసుపు పంటలు సాగు చేసేవారు. గతేడాది రబీలో మొక్కజొన్న వేయగా కత్తెర పురుగు దాడి చేయడంతో తీవ్రంగా నష్టపోయారు. వేల రూపాయలు వెచ్చించి ఎన్ని పురుగు మందులు పిచికారీ చేసినా ఫలితం లేక చివరికి పంటను దున్నేశారు. చీడపీడలు, ఎరువుల అవసరం లేని ఆరోగ్యకరమైన పంటల కోసం సామాజిక మాధ్యమాల్లో వెతికారు. అలాచిరుధాన్యాల సేద్యానికి ఆకర్షితులయ్యారు. మొక్కజొన్నను తొలగించిన ఎకరన్నర పొలంలో వీటి సేద్యానికి నడుం బిగించారు.

అమలు విధానం

తన స్నేహితుల సహాయంతో బెంగళూరు నుంచి కొర్రలు, అండుకొర్రలు, ఊదలు, సామల విత్తనాలు తెప్పించారు. ఎకరంన్నర పొలాన్ని బాగా దుక్కి చేసి విత్తనాలను వెదజల్లి గొర్రుతో చదును చేశారు. నాలుగు రకాల్లో సామలు సరిగ్గా మొలకెత్తలేదని.. మిగతా మూడు 90 రోజుల్లో పంట చేతికంది 3 క్వింటాళ్ల కొర్రలు, 2 క్వింటాళ్ల చొప్పున ఊదలు, అండుకొర్రల దిగుబడి వచ్చిందని రైతు వివరించారు.

ఆదాయం(ఎకరానికి)

* దిగుబడి 450 కిలోలు, ధర రూ.100 చొప్పున మొత్తం ఆదాయం రూ.45,000

* ఖర్చులు తీయగా నికర ఆదాయం రూ.39,520

ప్రోత్సహించాలని…

సాగును ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రూ.50కే కిలో చొప్పున విత్తనం ఇచ్చినట్లు రైతు పేర్కొన్నారు. రసాయన మందుల వాడకం లేదు. విత్తనాన్ని విత్తే ముందు పొలంలో కలుపు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఐదెకరాలకు విస్తరణ

సాగు సఫలం కావడంతో ఈసారి ఐదెకరాలకు విస్తరించారు. కొర్రలు 2 ఎకరాలు, అండుకొర్రలు 2 ఎకరాలు, ఊదలు ఎకరంలో విత్తారు. చుట్టు పక్కల గ్రామాల కర్షకులకు సాగు విధానంపై అవగాహన కల్పిస్తూ సూచనలు చేస్తున్నారు. ఆయన సలహాతో తన స్నేహితులు 20 ఎకరాల సాగుల్లో సాగుకు శ్రీకారం చుట్టారు.

ఇంకా విత్తుకోవచ్చు

– వెంకటలక్ష్మి, ఏడీఏ, నిజామాబాద్‌ గ్రామీణం

చిరుధాన్యాల్లో కొర్రలు, అండుకొర్రలు విత్తుకోవచ్ఛు తక్కువ పెట్టుబడితో సాగు చేయొచ్ఛు గడ్డిజాతికి చెందిన పంటలు కావడంతో నీటి ఎద్దడిని తట్టుకుంటాయి. భవిష్యత్తులో చిరుధాన్యాలకు మరింత ఆదరణ పెరగనుంది.

శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలి

కరవు పరిస్థితులను తట్టుకొనే మన పూర్వకాలపు పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహించాలి. స్థానికంగా శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఎంతో లాభదాయకంగా ఉంటుంది.

– కుంట వెంకట్‌రెడ్డి, గన్నారం, రైతుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here