చెట్టును చూసైనా.. మొక్క నాటాలి

0
1


  చెట్టును చూసైనా.. మొక్క నాటాలి

వందేళ్లకు పైగా జీవుల సేవలో మమేకమైన మర్రి

చీమల నుంచి మానవుల వరకు ఇదే ఆవాసం

న్యూస్‌టుడే, ఇందల్‌వాయి

ఆలయం వద్ద ఉన్న మర్రిచెట్టు

వృక్షాలు మానవాళికి చేసే మేలు వెలకట్టలేనిది. దీనికి చక్కని ఉదాహరణ ఇందల్‌వాయి మండలం తిర్మాన్‌పల్లి ఎల్లమ్మ ఆలయం వద్ద ఉన్న మర్రిచెట్టు. వందేళ్లకు పైగా కోట్ల జీవులకు ఆవాసంగా మారింది. వేల ప్రాణులకు ప్రాణ వాయువును అందిస్తోంది. వందల మందికి నీడనిస్తోంది. కదలలేని స్థితిలో ఉండి లక్షల జీవరాశులకు జీవం పోస్తున్న ఈ వృక్షాన్ని చూసైనా చూసి కదిలే అవకాశముండి..జీవజాతుల్లో తెలివిపరులమైన మనం బాధ్యతను గుర్తెరుగుదాం. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడుదాం.

ఇందల్‌వాయి మండల కేంద్రానికి సమీపంలో రైల్వేగేటు దాటిన తర్వాత వచ్చేది ప్రముఖ ఎల్లమ్మ ఆలయం. ఇక్కడికి ఉభయ జిల్లాలకు చెందిన చాలా మంది వస్తుంటారు. ఈ ఆలయ నిర్మాణం 1976లో జరిగిందని గౌడ సంఘం ప్రతినిధులు వెల్లడించారు. ఆలయం నిర్మించేనాటికే ఇక్కడ పెద్ద మర్రిచెట్టు ఉందని, తమ పూర్వికులకూ దాని పుట్టుక గురించి సరిగ్గా అవగాహన లేదని చెబుతున్నారు. ఆలయంలో ఆది, మంగళ, బుధవారాల్లో ప్రత్యేక పూజలు ఉంటాయి. మొక్కులు చెల్లించుకోవడానికి ఆయా రోజుల్లో వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇక్కడే వంటలు చేసుకొని విందు భోజనాలు ఆరగించి సాయంత్రం వెళ్తుంటారు. వంటలు చేసుకోవడానికి, సేదదీరేందుకు ప్రత్యేక వసతులు ఉన్నా చెట్టు కింద వండుకోవడానికే భక్తులు మక్కువ చూపుతారు. అయిదేళ్లకు ఓసారి నిర్వహించే ఆలయ ఉత్సవాల్లో దీని కిందే అన్ని రకాల దుకాణాలు వెలుస్తాయి.

పంచాయితీలు, సమావేశాలకు అడ్డా

మండల స్థాయిలో పెద్ద సమావేశాలు, పంచాయితీలు ఇక్కడే నిర్వహిస్తుంటారు. చల్లని గాలుల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో దాదాపు 500 మంది ఇక్కడ ఆసీనులు కావొచ్ఛు దేవుని సన్నిధిలో అన్ని వర్గాలకు శుభం కలుగుతుందని ప్రజలు విశ్వసిస్తారు.

చెట్టు మొదట వంటలు చేసుకొంటున్న భక్తులు

కనిపించని సేవలెన్నో

పశుపక్షాదులు, కీటకాలు, చీమలకు ఆవాసంతో పాటు ఆహారాన్ని అందిస్తోంది. లెక్కలేనంత ప్రాణవాయువును ఇస్తూ, వరదల సమయంలో మృత్తికలు కోతకు గురికాకుండా నిలుపుతోంది.

విలువ కట్టలేం

ఒక చెట్టును దాన్నుంచి వచ్చే కలపతోనో, పండ్లతోనో విలువ కట్టలేం. అది మనకు తెలియకుండా ఎంతో సేవ చేస్తుంది. ఒకరోజు ఆస్పత్రిలో ఆక్సిజన్‌ పెడితే ఎంత బిల్లు వేస్తున్నారో అందరికీ తెలుసు. మరి చెట్టు తన జీవితకాలంలో ఎంత ఆక్సిజన్‌ ఇస్తుందో ఎవరైనా ఆలోచించారా..? అయిదో విడత హరితహారంలో అటవీశాఖ నాటే మొక్కల్లో తప్పనిసరి 15 శాతం ఫైకస్‌ జాతి మొక్కలు ఉండాలనే నిబంధన ఉంది. అందులో రావి, మర్రి వంటివి ఉన్నాయి.

– సుభాష్‌చంద్ర, ఎఫ్‌ఆర్వో, ఇందల్‌వాయి రెంజ్‌

చిన్నతనంలో ఆడుకొనేవారం

మా చిన్నతనంలో చెట్టు కింద ఆడుకొనేవారం. చాలా ఏళ్ల నుంచి చూస్తున్నాం. ఆలయానికి వచ్చే భక్తులకు చెట్టు వసతులు కల్పిస్తోంది. దాని నుంచి ఎన్నో సేవలు పొందాం. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేను మొక్కలు నాటుతా.

– నర్సాగౌడ్‌, ఆలయ కమిటీ సభ్యుడు, తిర్మాన్‌పల్లిSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here