చెరలో.. శిఖం

0
3


చెరలో.. శిఖం

60 ఎకరాలు కబ్జా

ఆయకట్టు రైతుల ఆశలు ఆవిరి

విలువ రూ.7.5 కోట్లకు పైనే

న్యూస్‌టుడే, మాక్లూర్‌ గ్రామీణం

 రాజన్న చెరువులో శిఖాన్ని కబ్జా చేసుకొని బోరు వొసేి వరి సాగు

‘రాజన్న’ చెరువు 120 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.. 450 ఎకరాలకు సాగునీరు అందించేది. ప్రస్తుతం సుమారు 90 ఎకరాల విస్తీర్ణం మాత్రమే మిగిలింది. మిగతా 30 ఎకరాలు కబ్జా కోరల్లో చిక్కుకుంది. కేవలం 250 ఎకరాలకే నీరందించే పరిస్థితి. మిగతా 200 ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది.

గ్రామానికి మధ్యలో ఉండడంతో దీనికి నడిం చెరువుగా పేరు పెట్టారు. ఇది 60 ఎకరాల విస్తీర్ణంలో ఉండి, 220 ఎకరాల ఆయకట్టుకు నీరందించేది. ప్రస్తుతం 40 ఎకరాలకు కుచించుకుపోయింది. మిగతా 20 ఎకరాల్లో అక్రమార్కులు కబ్జా చేసి దర్జాగా పంటలేసుకుంటున్నారు.

‘చింతల్‌’ చెరువు గుత్ప గ్రామ శివారులో ఉంటుంది. దీని విస్తీర్ణం 30 ఎకరాలు. ఇక్కడ కొద్దిమంది అక్రమంగా శిఖాన్ని కబ్జా చేసుకొని పట్టాలు పొందేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ చెరువు పూర్తిగా కబ్జా కోరల్లో చిక్కుకొని ఆనవాళ్లు కోల్పోయింది.

అడిగే వారు లేరని కొందరు చెరువుల శిఖం భూములను యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. వారికి కిందిస్థాయి అధికారులు సహకారం అందిస్తున్నారు. ఫలితంగా చెరువులు నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి. కొన్ని తటాకాలు, శిఖం ఆక్రమణలతో ఆయకట్టు రైతులకు శాపంగా మారింది. భూమి కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు. ఇలాంటి వారి కన్ను చెరువు శిఖాలపై పడింది. అధికారుల అండదండలతో వాటిని ఆక్రమించేస్తున్నారు. ఇందుకు మాక్లూర్‌ మండలం గుత్ప గ్రామంలోని ‘రాజన్న’, ‘నడిం’ ‘చింతల్‌’ చెరువులే నిదర్శనం.

ఆయకట్టు బీడు

మూడు చెరువుల్లో కలిపి సుమారు 60 ఎకరాలు కబ్జాకు గురైంది. అక్రమార్కుల దుశ్చర్యతో చెరువులు పూర్తిగా కుంచించుకుపోయాయి. నీటి నిల్వ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పచ్చని పంటలతో కళకళలాడిన 500 ఎకరాల భూమి బీడుగా మారే పరిస్థితి నెలకొంది. ఆక్రమార్కులు ఏటా ఎకరం చొప్పున ఆక్రమిస్తుండడంతో వీటి రూపురేఖలే మారిపోయాయి. స్థానికంగా ఎకరం ధర రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు పలుకుతోంది. భూబకాసురులు అడ్డదారిలో సొంతం చేసుకున్న స్థలం ఖరీదు రూ. 7.5 కోట్లకు పైగానే ఉంటుంది. చెరువు నీరు శిఖంలోకి రాకుండా ఉండేందుకు మూడు అంగుళాలల ఎత్తులో మట్టిని భర్తీ చేసి పంటలు పండిస్తున్నారు. వీరంతా స్థానిక నాయకులు, భూస్వాములే కావడం గమనార్హం. గుత్పలో మూడు చెరువుల్లో అక్రమార్కులు కబ్జాలకు పాల్పడుతున్నారని ఎన్నిసార్లు సంబంధిత రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు చేపట్టిన పాపాన పోలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

అడ్డుకట్ట పడాలంటే..

*● శిఖం ఆక్రమణలు అడ్డుకోవాలంటే నీటి పారుదల ఇంజినీరింగ్‌ శాఖ, రెవెన్యూశాఖలు సంయుక్తంగా చర్యలు చేపట్టాలి.

*● ప్రతి చెరువుకు ప్రత్యేకంగా సర్వేయర్‌ను నియమించి ఉమ్మడి సర్వే చేపట్టాలి.

*● నీటిపారుదల శాఖ లెక్కల ప్రకారం చెరువు విస్తీర్ణం ఎంత ఉందో చూసుకొని సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేసి కందకాలు తీయాలి.

*● స్థానిక రైతులు సైతం ముందుకొచ్చి కబ్జాలను అడ్డుకోవాలి. సంబంధిత అధికారులకు వెంటనే ఫిర్యాదు చేయాలి.

పొలాలు బీడుగా మారాయి

– రాజేందర్‌, గుత్ప గ్రామస్థుడు

మా గ్రామంలో మూడు చెరువుల కింద ఎప్పుడు పొలాలు పచ్చగా ఉండేవి. ప్రస్తుతం బీడుగా మారాయి. అధికారులు అలసత్వాన్ని పక్కన పెట్టి త్వరగా సర్వే చేసి కబ్జాదారుల కోరల్లో చిక్కుకున్న శిఖం భూమిని స్వాధీనం చేసుకోవాలి.

మత్తడి ఎత్తు పెంచితే అక్రమార్కులకు చెక్‌

– పవన్‌, గుత్ప

మత్తడి ఎత్తు పెంచితే చెరువుల్లో నీటి నిలువ పెరిగి అక్రమార్కులకు చెక్‌ పడుతుంది. అధికారులు వెంటనే స్పందించి శిఖం భూమికి హద్దులు ఏర్పాటు చేయాలి.

ఆక్రమణలకు పాల్పడితే చర్యలు

– భూపతి, తహసీల్దార్‌ మాక్లూర్‌

ఆక్రమణలకు పాల్పడితే సహించేది లేదు. ఆక్రమణలో ఉన్న వారు స్వచ్ఛందంగా భూమిని అప్పగించాలి. లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. త్వరలో సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేస్తాం.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here