జగదాంబకు జేజేలు!

0
5


జగదాంబకు జేజేలు!

శరన్నవరాత్రుల్లో ఉత్సవశోభ

ముస్తాబైన దేవీమాత ఆలయాలు

న్యూస్‌టుడే, నిజామాబాద్‌  సాంస్కృతికం

ఇందూరుకే తలమానికం..దేవీమాత ఆలయం

జిల్లాలోనే అతి పురాతన ఆలయంగా పేరుపొందిన నల్లపోచమ్మ దేవీ మాత మందిరం..నిజామాబాద్‌ నగరంలోని దేవీరోడ్‌లో గ్రామదేవతగా నిత్య పూజలందుకొంటోంది. సుమారు వెయ్యేళ్ల క్రితం స్వయంభూ తల్లిగా వెలిసిందని భక్తుల విశ్వాసం. 70 ఏళ్ల క్రితం మందిరాన్ని నిర్మించారు. తర్వాతి కాలంలో అభివృద్ధి పర్చారు. రోడ్డు ఎత్తు పెరగడంతో అమ్మవారి ప్రతిమలో ముఖభాగం మాత్రమే కనిపిస్తుంటుంది. శరన్నరాత్రుల్లో ఇక్కడ విశేషంగా రోజూ మాతాజీ జాగరణ, భజనలు నిర్వహిస్తుంటారు. 6న దుర్గాష్టమి రోజున నవదుర్గా చండీహోమం, 7న రథంపై దేవీమాత ఊరేగింపు ఉంటుందని ట్రస్టు ప్రతినిధులు తెలిపారు. సుమారు 2 వేలకు పైగా భక్తులు తరలివస్తారు.

నాందేడ్‌ నుంచి బోధన్‌కు రేణుకాఎల్లమ్మ

బోధన్‌ పట్టణంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయానికి నాందేడ్‌తో అనుబంధం ఉంది. 9వ శతాబ్దంలో విశ్వపాలుడనే రాజు నాందేడ్‌లోని రేణుకా ఎల్లమ్మను పూజించేవారని, ఆయన కోరిక మేరకే అమ్మవారు బోధన్‌కు తరలొచ్చారని చెబుతారు. చెట్టు కాండాన్ని చెక్కి అమ్మవారిని ప్రతిష్ఠించారని భక్తులు అంటున్నారు. అప్పటి నుంచి అదే ప్రతిమను పూజిస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఈ నవరాత్రుల్లో వంశపారంపర్య వడియార్‌ కుటుంబ సభ్యులు మొదటగా పూజిస్తారు. రోజూ యజ్ఞం, కుంకుమార్చన, అభిషేకాలతో కొలుస్తారు. చీర, సారెలను సమర్పిస్తారు. జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన సుమారు 2 వేలకు పైగా భక్తులు తరలివస్తారు. మొక్కులు తీర్చుకొంటారు. ఈ ప్రాంగమంతా జాతరను తలపిస్తుంటుంది.

దసరా సందడి వచ్చింది. ఉభయ జిల్లాల్లో ఆదివారం దేవీశరన్నవరాత్రి ఉత్సవాలను పెద్దఎత్తున ప్రారంభించనున్నారు. తొమ్మిది రోజుల పాటు బాలాత్రిపుర సుందరీ, గాయత్రీమాత, లలితాదేవి, సరస్వతి, అన్నపూర్ణ, మహాలక్ష్మి, దుర్గ, మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరీగా అమ్మవారు దర్శనమివ్వనున్నారు. ఇందుకోసం దేవీ ఆలయాల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

లలితాదేవి ఆలయాశ్రమం

జిల్లాకేంద్రంలోని న్యాల్‌కల్‌రోడ్‌ లలితా దేవి ఆలయాశ్రమం ఒకే ఒక లలితా మందిరం. నగరానికి నైరుతి దిక్కున ఉన్న ఈ కోవెల భక్తుల పాలిట కొంగుబంగారంగా నిలుస్తోంది. నవరాత్రుల్లో తొమ్మిది రూపాలుగా అలంకరిస్తారు. నాలుగో రోజున పసుపు కొమ్ములతో అర్చనలు, అయిదో రోజున లలితాపంచమి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా తులాభారం, పల్లకీసేవ నిర్వహించనున్నారు. 64 రకాల మిఠాయిలను సమర్పించనున్నట్లు ధర్మాధికారి రాజేందర్‌శర్మ తెలిపారు.

కామారెడ్డి చండీమాత

కామారెడ్డి పట్టణం అశోక్‌నగర్‌లో ఉన్న చండీమాతను గత 40 ఏళ్లుగా భక్తులు పూజిస్తున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో నిత్యం చండీయాగంతో పాటు కుంకుమార్చన, మహా హారతులు సమర్పించనున్నారు. ఆలయప్రాంగణంలో అమ్మవారి రూపాలను అలంకరించనున్నారు. మహాజన భోజనాలు ఏర్పాటు చేస్తారు. శమీపూజలో 5 వేేలకు పైగా భక్తులు పాల్గొననున్నారు.

పదిరూపాలుగా పెద్దమ్మతల్లి

గర శివారు ఆర్మూర్‌రోడ్‌లోని పెద్దమ్మతల్లి ఆలయం ఆధ్మాత్మికతతో పాటు ఆహ్లాదాన్ని అందిస్తోంది. చుట్టూ వ్యవసాయక్షేత్రాలతో అలరారుతోంది. శరన్నవరాత్రుల్లో అమ్మవారు పదిరూపాలుగా అలంకరించడం విశేషం. చండీహోమం, కుంకుమార్చన, లలితాపారాయణాలతో పూజించనున్నారు. శమీ పూజను పెద్దఎత్తున జరుపుతారు. రోజూ అన్నదానం ఉంటుంది. సుమారు రెండు వేలకు పైగా భక్తులు పాల్గొంటారని వ్యవస్థాపకుడు కిషన్‌ తెలిపారు.

దోమకొండ చాముండేశ్వరీ మాత

కామారెడ్డి జిల్లాకు చెందిన పురాతన సంస్థానం దోమకొండలో కొలువుదీరింది చాముండేశ్వరీ మాత. సుమారు 80 ఏళ్లుగా భక్తులచే పూజలందుకొంటోంది. నవరాత్రి వేడుకల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో రంగురంగుల విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. తొమ్మిది రోజుల పాటు ఉపవాసదీక్షలు చేపడతున్నారు. అమ్మవారి చుట్టూ జపమాల పఠిస్తూ 101 ప్రదక్షిణలు చేయనున్నారు. బుర్రకథ, హరికథ, ధార్మిక, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఆలయానికి సమీపంలోని బురుజుకోట గ్రామదేవత మందిరంలో జాతీయ పతకాన్ని ఎగురవేసి తమ దేశభక్తి చాటుకొంటారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here