జలగణన 

0
2


జలగణన 

గ్రామాల్లో ప్రారంభమైన సర్వే 
నీటి లభ్యతపై ఆరా 
న్యూస్‌టుడే, కామారెడ్డి గ్రామీణం

ముఖ్య ప్రణాళిక అధికారులు జలవనరుల గణనను ప్రారంభించారు. చిన్ననీటి వనరులు, కాలువలు, ఊటకుంటలు, చెక్‌డ్యాంలలో నీటి లభ్యతపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఐదేళ్లకు నిర్వహించే గణన ప్రస్తుతం చేపడుతున్నారు. కామారెడ్డి, మాచారెడ్డి, భిక్కనూరు, దోమకొండ, బీబీపేట, రాజంపేట మండలాల్లో అందుబాటులో ఉన్న నీటి వనరులు, లభ్యత, వినియోగం, నిర్మాణానికి అవుతున్న ఖర్చు, ప్రస్తుత పరిస్థితితో పాటు భవిష్యత్తులో ఎలాంటి పథకాలు చేపడితే ప్రయోజనకరంగా ఉంటుందో వివరాలు సేకరిస్తున్నారు. 
నీటి వనరులను అంచనా వేయడం వల్ల భవిష్యత్తులో మరిన్ని ప్రణాళికలు రూపొందించడానికి వీలవుతుంది. ప్రస్తుతం చిన్ననీటి వనరుల గణన చేపడుతుండడంతో ప్రత్యేక ప్రణాళిక తయారు చేసి వాటి అభివృద్ధికి కృషి చేసే అవకాశం ఏర్పడింది. నియోజకవర్గంలో ప్రధానంగా సాగు, తాగు నీటికి బోరుబావులే ఆధారం. వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే చెరువులు, ఊటకుంటలు, చెక్‌డ్యాంలలో నీటి లభ్యత ఉంటుంది. వాటి కింద ఉన్న ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తేనే పంటలు పండుతాయి. మరికొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగి బోరుబావుల్లో నీటి లభ్యత పెరుగుతుంది. గతంలో జల వనరుల గణనను పరిగణలోకి తీసుకొని మిషన్‌ కాకతీయ వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. 
రెండు వేల హెక్టార్ల కంటే తక్కువగా ఉన్నవి… 
ప్రతి గ్రామంలో 2 వేల హెక్టార్ల కంటే తక్కువ ఆయకట్టు ఉన్న నీటి వనరులను అధికారులు లెక్కిస్తున్నారు. చెరువులు, బోరు బావులు, చెక్‌డ్యాంలలో నీటి సామర్థ్యం ఎలా ఉంది? సాగు, తాగునీటి అవసరాలకు అవి అనుకూలంగా ఉన్నయో, లేదో పరిగణలోకి తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో వాటి పరిస్థితి ఎలా ఉందో ప్రత్యక్షంగా సందర్శిస్తున్నారు. గతంలో వాటి నిర్మాణానికి చేసిన వ్యయం, ఇతర వివరాలు సేకరిస్తున్నారు. అలాగే ఒకరైతు, గ్రామంలో ఉన్న బోరుబావిలోని నీటిని తోడడానికి ఎంత ఖర్చు చేస్తున్నారో కూడా లెక్కలు వేస్తున్నారు. వాటి కోసం చేసిన అప్పులు, ఆర్థిక వనరులను ఎలా సమకూర్చుకున్నాడో వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. 
నీటి వనరులకు జియోట్యాగింగ్‌ 
చిన్న నీటి వనరులకు జియో ట్యాగింగ్‌ చేస్తున్నారు. దీంతో ఏయే నీటి వనరులు ఏ ప్రాంతాల్లో ఉన్నాయో తెలుస్తాయి. 2017-18 సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకొని అధికారులు, సిబ్బంది లెక్కిస్తున్నారు. గ్రామాల వారీగా నీటి వనరులను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో పాటు ఎప్పటికప్పుడు అంతర్జాలంలో తెలుసుకునే వీలుకలుగుతుంది. నీటి పరిస్థితి, సాగు భూములు, పంటల సమాచారం అందుబాటులో ఉంటుంది. 
80 శాతం పూర్తి 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి రెండు భాగాలు ఉన్న సర్వేను రెవెన్యూ, ముఖ్యప్రణాళిక, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయశాఖ, భూగర్భ జలవనరుల శాఖల అధికారులు, సిబ్బంది నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో డిప్యూటీ ఏఎస్‌వో పర్యవేక్షణలో ఈ సర్వే కొనసాగుతోంది. చిన్న నీటి వనరుల లెక్కింపుతో పాటు సాగునీటి పథకాలు, భూగర్భ జలాల లభ్యత, వినియోగం, ఎన్ని ఎకరాలకు సాగునీరు అందుతుందో తదితర వివరాలను సేకరిస్తున్నారు.

నిర్ణీత సమయంలోగా సర్వే పూర్తిచేస్తాం 
– లక్ష్మణ్‌, డిప్యూటీ ఏఎస్‌వో, కామారెడ్డి 
నియోజకవర్గంలో 80 శాతం గణన పూర్తయింది. నీటి వనరుల లభ్యతపై ఏఎస్‌వోలు, ఏఈవోలు, క్షేత్రసహాయకులు సర్వే నిర్వహిస్తున్నారు. నిర్ణీత సమయంలోగా పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదికలు అందజేస్తాం. ప్రతి ఐదేళ్లకోసారి గణన నిర్వహిస్తాం. 
సీసీ కెమెరాలు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకోవాలి 
మాచారెడ్డి, న్యూస్‌టుడే: ప్రజలందరూ స్వచ్ఛందంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ శ్వేత పేర్కొన్నారు. మాచారెడ్డి మండలం గజ్యానాయక్‌తండాలో మంగళవారం తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు పోలీసులు నిర్వహించిన కట్టడి ముట్టడి (నిర్బంధ తనిఖీ)లో ఆమె పాల్గొన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల నిరంతరం నిఘా కొనసాగుతుందని చెప్పారు. చోరీలపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచితులు కనిపించినా, అనుమానాస్పదంగా తిరుగుతున్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. వాహన చోదకులు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని చెప్పారు. కార్డన్‌ అండ్‌ సెర్చ్‌లో భాగంగా ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, ట్రాక్టర్లు తదితర 124 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటి పత్రాలను పరిశీలించి సంబంధీకులకు అప్పగించారు. కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ, ముగ్గురు సీఐలు, 15 మంది ఎస్సైలు, 90 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here