‘టీమిండియా సిరిస్‌తో విండీస్‌కు పునర్వైభవం తీసుకొస్తాం’

0
3


హైదరాబాద్: నికోలస్ పూరన్ ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో విండిస్ అభిమానుల మనసు గెలుచుకున్నాడు. ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ 23 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. 339 పరుగుల భారీ లక్ష్య చేధనలో వికెట్లు పడుతున్నా… నికోలస్ ఒక్కడే సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

నికోలస్ పూరన్ ఆటకు ఫిదా అయిన నెటిజన్లు అతడిని విండిస్ మాజీ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారాతో పోల్చుతున్నారు. శ్రీలంకతో మ్యాచ్ అనంతరం నికోలస్ పూరన్ మాట్లాడుతూ గెలుపుకంటే ఓటమితో ఎన్నో నేర్చుకుంటామని అన్నాడు. ప్రపంచకప్‌ అనంతరం టీమిండియాతో జరగబోయే సిరీస్‌లో సత్తా చాటుతామని అన్నాడు.

“ప్రపంచకప్‌లో మా ప్రదర్శన తీవ్రంగా నిరాశపరిచింది. ఓ ఆటగాడిగా చెప్పాలంటే.. గెలుపులో కంటే ఓటమిలోనే ఎక్కువ విషయాలను నేర్చుకోవచ్చు. ఈ టోర్నీలో మూడు మ్యాచ్‌ల్లోనూ(ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌​, శ్రీలంక) గెలుపు అంచుల వరకు వచ్చాం. ప్రస్తుతం జట్టులో చాలా మంది యువకులం ఉన్నాం. ఈ టోర్నీతో చాలా నేర్చుకున్నాం” అని పూరన్ అన్నాడు.

“నా వ్యక్తిగత ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నాను. ఇప్పుడే నన్ను ఒకరితో(బ్రయాన్‌ లారా) పోల్చడం తగదు. టీమిండియాతో త్వరలో జరగబోయే సిరీస్‌పై దృష్టి పెడతాం. ఈ టోర్నీలో చేసిన పొరపాట్లను టీమిండియా సిరీస్‌లో పునరావృతం చేయం. విండీస్‌కు పునర్వైభవం తీసుకొస్తాం. దానికి తొలి అడుగు ఈ సిరీస్‌తోనే మొదలెడతాం” అని పూరన్ తెలిపాడు.

శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో నికోలాస్‌ పూరన్‌ (118; 103 బంతుల్లో 11×4, 4×6) దాదాపు గెలిపించినంత పని చేశాడు.. కానీ కీలక సమయంలో వెనుదిరగడంతో కరీబియన్‌ జట్టుకు పరాజయం తప్పలేదు. ఈ టోర్నీలో విండీస్‌కు ఎనిమిది మ్యాచ్‌ల్లో ఇది ఆరో పరాజయం కాగా.. లంకకు ఎనిమిది మ్యాచ్‌ల్లో మూడో విజయం. ఇప్పటికే విండీస్‌, లంక సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here