టోలుకు టోపీ

0
5


టోలుకు టోపీ

నకిలీ గుర్తింపు కార్డులతో ప్రయాణం..

జిల్లా అధికారుల పేరిట చెలామణి అవుతున్న వైనం

టోల్‌ప్లాజా వద్ద నెలకు 800 వరకు పట్టుబడుతున్న తీరు

న్యూస్‌టుడే, భిక్కనూరు

*ఒకప్పుడు కామారెడ్డి ఆర్డీవోగా పనిచేసిన నగేశ్‌ ప్రస్తుతం మరో జిల్లాలో జేసీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఐతే ఆయన పాత గుర్తింపుకార్డును ముగ్గురు వినియోగించుకొంటూ దర్జాగా టోల్‌గేట్లు దాటుతున్నారు. ఇటీవల భిక్కనూరు టోల్‌ ప్లాజా నిర్వాహకులు వీటిలో ఒకదాన్ని స్వాధీనం చేసుకున్నారు.

* జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న సీఐలు, ఎస్సైల గుర్తింపు కార్డులను కొందరు నాయకులు వాడుకుంటూ టోల్‌ ఎగ్గొట్టి ప్రయాణం చేస్తున్నారు. అనుమానం వచ్చిన సిబ్బంది సోదాలు చేస్తుండటంతో వందలాది కార్డులు బయటపడుతున్నాయి.

టోల్‌ ఛార్జీలకు ఎగనామం పెట్టడానికి కొందరు వక్రమార్గాలను ఎంచుకొంటున్నారు. అధికారుల గుర్తింపుకార్డులను వినియోగించుకొంటున్నారు. జిల్లాలో ఐదారేళ్ల క్రితం పనిచేసి మరోచోటికి బదిలీ అయిన, పదవీ విరమణ పొందిన అధికారుల గుర్తింపు కార్డులను దర్జాగా వాడేసుకొంటూ మోసాలకు పాల్పడుతున్నారు. వీరంతా డబ్బులు లేని పేదలనుకుంటున్నారా.. రూ.10-20 లక్షల విలువ చేసే కార్ల యజమానులు.

మోసం ఎలా..

అధికారుల గుర్తింపు కార్డులను కలర్‌ జిరాక్స్‌ తీస్తారు. వాటిల్లో అధికారుల ఫొటో స్థానంలో వారి చిత్రం అతికిస్తారు. ఇలా కొందరి పోలీసు అధికారుల గుర్తింపు కార్డులనూ యథేచ్ఛగా నకిలీ చేసి వాడుతున్నారు. ఏదో  ఒకటి, రెండు మార్లు ఇలాంటి కేసులు ఉన్నాయనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఒక్కో టోల్‌ ప్లాజా వద్ద నెలకు 600-800 వరకు నకిలీ కార్డులు పట్టుబడుతుండటం గమనార్హం.

వాస్తవంగా..

ప్రభుత్వం జారీ చేసే గుర్తింపు కార్డులను ఇతరులకు ఇవ్వొద్దని తెలిసినా.. కొందరు అధికారులే తమ మిత్రులు, బంధువులకు ఇస్తూ తప్పు చేస్తున్నారు. వాస్తవంగా ప్రజాప్రతినిధులతోపాటు జిల్లా, మండల స్థాయి అధికారులకు సైతం మినహాయింపు లేకున్నా వారితోపాటు, వారి కుటుంబ సభ్యులూ టోల్‌ గేట్ల వద్ద ఉచిత సేవలు పొందుతున్నారు.

నకిలీ బుగ్గకార్లతోనూ..

ప్రభుత్వ హోదాలో అతి ముఖ్యులకు మాత్రమే బుగ్గుకార్లు ఉంటాయి. ఇటీవల మంత్రుల వాహనాలకూ బుగ్గలు తొలగించారు. భిక్కనూరు టోల్‌ప్లాజా వద్ద మాత్రం కొందరు బుగ్గకార్లు, సైరన్‌ వేసుకొని వస్తూ ఇక్కడి సిబ్బంది పట్టుబడటం గమనార్హం. మరికొందరు సీఎంకు సన్నిహితులుగా పేర్కొంటూ టోల్‌ దాటడానికి యత్నిస్తున్నారు.

ఆధార్‌ కార్డులతోనూ..

టోల్‌ప్లాజాలకు సమీపంలో గ్రామాల వారికి టోల్‌ నుంచి మినహాయింపు ఉంటుంది. ఇందుకు వీరు ఆధార్‌కార్డు చూపించి ఉచితంగా ప్రయాణిస్తుంటారు. ఇదే అదునుగా కొందరు సమీప గ్రామాల పేర్లతో నకిలీ ఆధార్‌ కార్డులు సృష్టించి దర్జా వెలగబోస్తున్నారు.

ఎవరికి మినహాయింపు అంటే..

రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, గవర్నర్‌, ముఖ్యమంత్రులతో పాటు అంబులెన్సులకు మాత్రమే ఉచితంగా టోల్‌దాటే అవకాశం ఉంది.

అనుమానం వస్తే పట్టుకొంటున్నాం – సంతోష్‌, టోల్‌ప్లాజా మేనేజర్‌, భిక్కనూరు

నకిలీ గుర్తింపు కార్డులు నెలకు 6-8 వందల వరకు వస్తున్నాయి. ఇందులో చాలా కార్డులు జిల్లా అధికారుల పేరిటే రావడం విచిత్రం. అనుమానం వచ్చి గట్టిగా ప్రశ్నిస్తే నకిలీవని ఒప్పుకొంటున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here