డాక్టర్ రెడ్డీస్ దూకుడు: లాభం రెట్టింపు, పరిశోధన పై ఫోకస్

0
1


డాక్టర్ రెడ్డీస్ దూకుడు: లాభం రెట్టింపు, పరిశోధన పై ఫోకస్

హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఔషధ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ … వ్యాపారంలో దూసుకుపోతోంది. సెప్టెంబర్ తో ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ఫలితాల్లో కంపెనీ మెరుగైన పనితీరును కనబరిచింది. ఈ క్వార్టర్ లో కంపెనీ ఏకంగా రూ 1,092 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంత క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలోని నికర లాభం రూ 504 కోట్ల తో పోల్చితే ప్రస్తుత లాభం 117% పెరిగింది. డాక్టర్ రెడ్డీస్ మొత్తం ఆదాయం కూడా 26.41% పెరిగి రూ 4801 కోట్లకు చేరుకొంది. గతేడాది రెండో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ 3,798 కోట్లుగా ఉంది. సాధారణ పరిస్థితిలో కంటే కంపెనీ కి ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం వల్ల అధికంగా కలిసి వచ్చింది. మినిమం అల్టెర్నేటివ్ టాక్స్ (మ్యాట్) రూ 326 కోట్ల మేరకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను మిగలటం వల్ల డాక్టర్ రెడ్డీస్ నికర లాభం ఊహించిన దానికంటే అధికంగా వృద్ధి చెందింది.

పరిశోధనపై రూ 727 కోట్లు…

ప్రపంచ ఫార్మస్యూటికల్స్ రంగంలో నెలకొన్న పోటీ ని తట్టుకునేందుకు డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా కొత్త ఔషధాల ఆవిష్కరణ, అభివృద్ధి కోసం పరిశోధన – అభివృద్ధి (ఆర్అండ్ డీ) పై భారీగా వెచ్చిస్తోంది. ఈ ఏడాది తోలి ఆరు నెలల కాలానికి గాను కంపెనీ రూ 727 కోట్ల మేరకు ఖర్చు చేసింది. కంపెనీ వద్ద నగదు, నగదు సమానమైన నిల్వలు కూడా దండిగా ఉండటం వల్ల ఈ విభాగంపై అధికంగా ఫోకస్ చేస్తోంది. ప్రస్తుతం కంపెనీ వద్ద రూ 3045 కోట్ల నగదు, నగదు సమాన నిల్వలు ఉన్నాయని డాక్టర్ రెడ్డీస్ వెల్లడించింది.

జనరిక్ ఆకర్షణీయం…

కంపెనీకి జనరిక్ ఔషధాల విక్రయం నుంచి అధిక ఆదాయం లభిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ ద్వారా కంపెనీ రూ 3,280 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇందులో 7% వృద్ధి నమోదు అయ్యింది. యూరోప్, ఇండియా, వర్ధమాన దేశాల నుంచి అమ్మకాల వృద్ధి ఆకర్షణీయంగా ఉంది. అయితే కంపెనీ కి ప్రధాన ఆదయ వనరు ఐన అమెరికా మార్కెట్ లో మాత్రం వృద్ధి ఆశించిన మేరకు లేదు. ద్వితీయ త్రైమాసికంలో డాక్టర్ రెడ్డీస్ అమెరికా మార్కెట్ నుంచి రూ 1,426 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. భారత్ లో కంపెనీ ఆదాయం 9% పెరిగి రూ 751 కోట్లకు చేరుకొంది. ఫార్మాస్యూటికల్ సర్వీసెస్ అండ్ ఆక్టివ్ ఫార్మా ఇంగ్రిడియెంట్స్ విభాగం నుంచి రూ 710 కోట్లు, ప్రొప్రయిటరీ ఉత్పత్తుల విభాగం నుంచి రూ 740 కోట్ల ఆదాయం సమకూరింది.

కొత్త ఉత్పత్తులు…

ఫార్మస్యూటికల్స్ కంపెనీలకు కొత్త ఉత్పత్తుల మార్కెటింగ్ కీలకం. ఈ విషయంలో డాక్టర్ రెడ్డీస్ చాలా ముందు ఉంటుంది. ఇటీవల అమెరికా మార్కెట్ నుంచి వెనక్కి పిలిచిన రానీటిడైన్ ఔషధాల స్థానంలో కొత్త ఔషధాలను కూడా మార్కెట్లోకి ప్రవేశ పెట్టె అవకాశాలు ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. మరో వైపు అమెరికా లోనే సుమారు 100 ఔషధాల అనుమతులు పెండింగ్ లో ఉన్నాయని, అందులో చాలా వాటికి త్వరలోనే అనుమతులు లభించే అవకాశం ఉందని తెలిపింది. దాంతో ఈ ఏడాది లో మరింత ఆదాయం పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.

ఉద్యోగాల కోతల్లేవ్…

ఆర్థిక మాంద్యం లో ఈ కంపెనీ మాత్రం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. కంపెనీ లో ఎట్టి పరిస్థితిలోనూ ఉద్యోగాల కొత్త విధించే ప్రసక్తే లేదని డాక్టర్ రెడ్డీస్ సిఎఫ్ఓ సౌమిన్ చక్రవర్తి స్పష్టం చేశారు. తమ కు మార్కెట్ అవకాశాలు దండిగా ఉన్నాయని, కంపెనీ వృద్ధి బాటన ప్రయాణిస్తున్నప్పుడు ఉద్యోగాల కుదింపు అవసరం ఎందుకు ఉత్పన్నం అవుతుందన్నారు. అలాంటి పరిస్థితే వస్తే ఉత్పాదకత పెంచుకుంటాం కానీ ఉద్యోగులను తొలగించమని అయన విలేకరులకు తెలిపారు. ప్రస్తుతం డాక్టర్ రెడ్డీస్ కు సుమారు 22,000 మంది ఉద్యోగులు ఉన్నారు. దేశంలోని అతి పెద్ద ఔషధ కంపెనీల్లో డాక్టర్ రెడ్డీస్ మూడో స్థానంలో ఉంటుంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here