డీజిల్‌ ఖర్చులు కూడా రాలేదు

0
1


డీజిల్‌ ఖర్చులు కూడా రాలేదు

మిగిలిన డబ్బులు వేతనాలకే సరి

తల పట్టుకుంటున్న ఆర్టీసీ అధికారులు

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ అర్బన్‌ : సమ్మె విఫలం చేసేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులు నడిపించారు. డీజిల్‌ ఖర్చులు రాకపోవడంతో ఆర్టీసీ అధికారులు తలలు బాదుకుంటున్నారు. మొదటి రోజు వచ్చిన డబ్బులు డీజిల్‌కు, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన డ్రైవర్లు, కండక్టర్లకు చెల్లించడానికే సరిపోయింది.

ఇది డిపో-1 పరిస్థితి

ఉభయ జిల్లాల్లో ఉన్న 6 డిపోల్లో కేవలం నిజామాబాద్‌ డిపో-1 మాత్రమే లాభాల బాటలో ఉంది. మిగిలిన ఐదు డిపోలు నష్టాల్లో ఉన్నాయి. మొదటి రోజు సమ్మె కాలంలో డిపో-1 ఆదాయ పరిస్థితి పరిశీలిస్తే దారుణంగా ఉంది. తొలిసారిగా రూ.47,300 నష్టం వచ్చింది. ఈ లెక్కన నష్టాల బాటలో ఉన్న మిగిలిన ఐదు డిపోల ఆదాయం మరింత దిగజారిపోయింది.

డిపో-1 నుంచి శనివారం 21 బస్సులు నడిపించారు.

మొదటి రోజు 1300 లీటర్ల డీజిల్‌తో 6,530 కి.మీ బస్సులను తిప్పారు. ● వచ్చిన మొత్తం ఆదాయం రూ. 1.04 లక్షలు ● డీజిల్‌ ఖర్చు రూ. 98,800 ● తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు చెల్లించిన డబ్బులు రూ.52,500 ● ఒక్క రోజు నష్టం రూ. 47,300. ఇది కేవలం లాభాల బాటలో నడిచే డిపో-1 పరిస్థితి.

● మొదటి రోజు ఎక్కువ డబ్బులు రావాల్సిన బస్సులకు సైతం రూ.400, రూ.800 మాత్రమే వచ్చినట్లు శనివారం రాత్రి లెక్కలు చెప్పినట్లు తెలిసింది. ఈ లెక్కన ఆర్టీసీకి రావాల్సిన డబ్బులకు టికెట్లు లేకపోవడంతో తాత్కాలిక కండక్టర్లు నిజాయితీగా వచ్చిన డబ్బులు ఇవ్వడం లేదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

నిజామాబాద్‌ జిల్లాలో

రెండో రోజు 4 డిపోల పరిధిలో 151 ఆర్టీసీ బస్సులు నడిపారు. అద్దె బస్సులు 126 నడిచాయి. ఇక స్కూల్‌ బస్సులు 20, మ్యాక్స్‌ క్యాబ్‌లు 90, ట్రావెల్స్‌ బస్సులు 35 నడిచాయి.

కామారెడ్డి జిల్లాలో

రెండు డిపోల పరిధిలో ఆర్టీసీ బస్సులు 90, అద్దె బస్సులు 53, స్కూల్‌ బస్సులు 31, మ్యాక్స్‌క్యాబ్‌లు 80, ట్రావెల్స్‌ బస్సులు 8 నడిచాయి.

ఎక్కువగా ఆర్టీసీ బస్సులను నడపడంతో ఎక్కువ నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గింది. ప్రధాన కారణం మొదటి రోజు ఇష్టారాజ్యంగా దోచుకోవడంతో రెండో రోజు ప్రయాణికులు తగ్గిపోయారు.

ప్రైవేటు, ఆర్టీసీ బస్సు డ్రైవర్లు ప్రయాణికులను ఎక్కించుకునేందుకు పోటీ పడ్డారు.

హైదరాబాద్‌ డిపో నుంచి వచ్చిన కొన్ని ఆర్టీసీ బస్సులు ముగ్గురు, నలుగురు ప్రయాణికులతో వెళ్లాయి.

ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో మధ్యాహ్నం తరువాత ఆర్టీసీ బస్సుల సంఖ్యను తగ్గించారు. బస్సులు లేకపోవడంతో తాత్కాలికంగా తీసుకున్న డ్రైవర్లు, కండక్టర్లు బస్సులు ఇస్తారేమోనని డిపోల్లో ఎదురుచూశారు.

మొదటి రోజు నిజాయితీగా బస్సు ఛార్జీలు తెచ్చి ఇవ్వని కండక్టర్లను రెండో రోజు పక్కన పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. మొదటి రోజు ఇచ్చిన లక్ష్యం ప్రకారం డబ్బులు తెచ్చినవారికి మాత్రం బస్సులు ఇచ్చి పంపినట్లు తెలిసింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here