దక్షిణ ప్రాంగణం అభివృద్ధిపై దృష్టి

0
0


దక్షిణ ప్రాంగణం అభివృద్ధిపై దృష్టి

కొత్త భవనాల ప్రారంభోత్సవానికి ఇన్‌ఛార్జి వీసీ మొగ్గు

పాతవాటిల్లోకి బీఈడీ, ఎంఈడీ కోర్సులు వస్తే మేలు

విద్యార్థులకు అందుబాటులో వసతిగృహాలు

ప్రస్తుత పరిపాలన భవనం

తెవివి దక్షిణ ప్రాంగణాన్ని బీటీఎస్‌గా (బేసిక్‌ ట్రైనింగ్‌ సెంటర్‌) పిలుస్తుంటారు. ఇక్కడ ఉపాధ్యాయ శిక్షణ ఇచ్చేవారు. ఈ ప్రక్రియ 1950 నుంచి 1975 వరకే కొనసాగింది. ప్రస్తుతం బీటీఎస్‌ లేకున్నా అదే పేరుతో పిలుస్తున్నారు.

న్యూస్‌టుడే, భిక్కనూరు

తెవివి దక్షిణ ప్రాంగణం అభివృద్ధిపై ఇన్‌ఛార్జి ఉపకులపతి అనిల్‌కుమార్‌ దృష్టి సారించారు. బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా క్యాంపస్‌కు వచ్చిన ఆయన కొత్త భవనాలను వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించారు. స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడి ప్రారంభోత్సవానికి సమయం తీసుకోవాలని ప్రిన్సిపల్‌ను ఆదేశించారు. ఇవి అందుబాటులోకి వస్తే పాత భవనాల్లో కొనసాగే తరగతులు కొత్తవాటిల్లోకి వెళ్తాయి. అప్పుడు పాతవి ఖాళీ అవుతాయి. కొత్త కోర్సులు ఈసారి వచ్చే అవకాశం ఎలాగూ లేదు. ఈ నేపథ్యంలో వీటిల్లోకి బీఈడీ, ఎంఈడీ కోర్సులను తరలిస్తే విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. ప్రస్తుతం ఇవి నిజామాబాద్‌ జిల్లా సారంగాపూర్‌లో కొనసాగుతున్నాయి. అక్కడ వసతి సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దక్షిణప్రాంగణంలో మరో 150 మందికి సరిపడే హాస్టల్‌ వసతులు ఉన్నాయి. ఉపాధ్యాయ శిక్షణ తిరిగి ప్రారంభమైతే బీటీఎస్‌ పేరుకు సార్థకత లభించనుంది.

సకల సౌకర్యాలు

సారంగాపూర్‌లో వసతిగృహ డిమాండు ఏళ్లుగా ఉంది. అది సాధ్యం కాకుంటే కళాశాలనే మార్చాలని విద్యార్థులు కోరుతున్నారు. దక్షిణప్రాంగణంలో ప్రస్తుతం ఎమ్మెస్సీ రసాయన శాస్త్రం, భౌతికశాస్త్రం, జియోఇన్ఫర్మేటిక్స్‌, ఎంఎస్‌డబ్ల్యూ కోర్సులు ఉన్నాయి. వీటికి అనుగుణంగా కొత్తగా నాలుగు విభాగాలను నిర్మించారు. పరిపాలన భవనమూ సిద్ధమైంది. కొత్త కోర్సులు ఇక్కడకు రావడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇక్కడ ప్రస్తుతం 240 మంది విద్యార్థులు ఉన్నారు. రెండేళ్ల కిందట బాలబాలికలకు రెండు వేర్వేరు వసతిగృహాలను నిర్మించారు.


ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న భవనం

150 కంటే ఎక్కువగా ఉండరు

ప్రస్తుతం క్యాంపస్‌లో 240 మంది ఉంటే 170 మంది మాత్రమే హాస్టళ్లలో ఉంటున్నారు. బీఈడీ కోర్సులో ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి 200, ఎంఈడీలో ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి 100 మంది విద్యార్థులు మంది ఉంటారు. వీరందరూ దక్షిణప్రాంగణానికి వచ్చినా ఇందులో 150 మంది కంటే ఎక్కువ వసతి కోరుకోరు. పది, ఇరవై అటుఇటైనా పెద్దగా ఇబ్బందులు ఉండవు. మరో 150-170 మందికి ఇక్కడ అధునాతన వసతిగృహాలు అందుబాటులో ఉన్నాయి.

సౌకర్యంగా ఉంటుంది

– బాలు, పరిశోధన విద్యార్థి

ఎంఈడీ, బీఈడీ కోర్సులు దక్షిణప్రాంగణానికి వస్తే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. సారంగాపూర్‌లో వసతులు సక్రమంగా లేవు. అన్ని వసతులు ఉన్న దక్షిణప్రాంగణానికి కోర్సులను తరలించడం ఉత్తమం.

వసతి ఉంది

– సుధాకర్‌గౌడ్‌, ప్రిన్సిపల్‌, తెవివి దక్షిణపాంగణం

దక్షిణప్రాంగణంలో మరో 150 మంది విద్యార్థులకు వసతి ఇవ్వడానికి అవకాశం ఉంది. బీఈడీ, ఎంఈడీ కోర్సుల తరలింపు వ్యవహారం అంతా వీసీ చేతిలో ఉంటుంది. ఒకవేళ తరలిస్తే అందుకు తగ్గ తరగతి గదులు, వసతి సౌకర్యాలు ఉన్నాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here