దొంగ దొరికాడు..

0
3


దొంగ దొరికాడు..

బంగారు, వెండి వస్తువుల స్వాధీనం


సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ, చిత్రంలో సీఐ, ఎస్సై

 

నిజామాబాద్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: నిజామాబాద్‌లోని న్యాల్‌కల్‌ రోడ్డు వివేకానంద నగర్‌లో జరిగిన దొంగతనం కేసుని పోలీసులు ఛేదించారు. ఓ నిందితుడిని అరెస్టు చేసి అతని నుంచి బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకొన్నారు. నిజామాబాద్‌ సబ్‌ డివిజన్‌ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్‌ కుమార్‌ కేసు వివరాలను వెల్లడించారు. వివేకానందనగర్‌లో నివాసం ఉండే కొట్టూరు పార్థసారధి గత నెల 22న తన ఇంటికి తాళం వేసి గాజుల్‌పేట్‌కు వెళ్లాడు. తిరిగి అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి చూడగా తలుపు ధ్వంసం చేసి కనిపించింది. లోనికి వెళ్లి చూస్తే దొంగతనం ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నాలుగో ఠాణా ఎస్సై లక్ష్మయ్య హుటాహుటిన అక్కడికి చేరుకొని పరిసరాలను పరిశీలించారు. నగర సీఐ సత్యనారాయణ, ఎస్సై లక్ష్మయ్య నేతృత్వంలో ఓ బృందాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టారు. తొలుత ఎలాంటి ఆధారం దొరకలేదు. సీసీ టీవీ దృశ్యాలు, ఆ సమయంలో అనుమానంగా సంచరించిన వారి వివరాలను సేకరించి దర్యాప్తు సాగించారు. చంద్రనగర్‌లో అద్దెకు ఉంటున్న నంద్‌కుమార్‌ విజయ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకొన్నాడు. అతని నుంచి 12 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలు, ఒక చరవాణిని స్వాధీనం చేసుకొన్నారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకి తరలించారు.

నిందితుడిపై ఎన్నో కేసులు

నిందితుడిపై గతంలో అనేక కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి స్వస్థలం మహారాష్ట్రలోని సోలాపూర్‌. 2018, 19లో ఇతనిపై ఏడు కేసులున్నట్లు తెలిసిందన్నారు. అక్కడి జైలు నుంచి బయటకు వచ్చాక గ్రామం నుంచి వెలివేయడంతో నిజామాబాద్‌లో వచ్చి ఉంటున్నాడు. వివేకానందనగర్‌లో రెండ్రోజులుగా రెక్కీ వేసి చోరీ చేసినట్లు నిందితుడు విచారణలో తెలిపాడని ఏసీపీ వివరించారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన సీఐ సత్యనారాయణ, ఎస్సై లక్ష్మయ్య, సిబ్బంది సురేందర్‌, బాలకిషన్‌, సుభాష్‌, సాగర్‌, అప్సర్‌, సురేశ్‌ బృందాన్ని ఏసీపీ శ్రీనివాస్‌ కుమార్‌ అభినందించారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here