ధర్మపురి దారెటు

0
3


ధర్మపురి దారెటు

● అమిత్‌ షాను కలిసిన డీఎస్‌

● జిల్లాలో చర్చనీయాంశం

ఈనాడు, నిజామాబాద్‌:

రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ గురువారం దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. చాలాకాలంగా తెరాసకు దూరంగా ఉంటున్న ఆయన బుధవారం దిల్లీలో జరిగిన ఆ పార్టీ పార్లమెంటరీ సమావేశానికి హాజరైన విషయం తెలిసిందే. ఆహ్వానం అందటం వల్లే హాజరైనట్లు డీఎస్‌ చెప్పుకొచ్చారు. ఈ అంశంపై చర్చ జరుగుతున్న సమయంలోనే.. గురువారం అమిత్‌ షాను కలవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

తెరాస ప్రజాప్రతినిధులతో అభిప్రాయ భేదాల నేపథ్యంలో డీఎస్‌ ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సోనియా, రాహుల్‌ను కలిసినట్లు వార్తలొచ్చాయి. ఆయన పార్టీ మారుతారని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. తనుమాత్రం రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

లోక్‌సభ ఎన్నికల సమయంలో

కుమారుడు అర్వింద్‌ భాజపా ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న సందర్భంలోనూ డీఎస్‌ పార్టీ మారుతారనే ప్రచారం తెరపైకి వచ్చింది. అలాంటిదేమీ జరగలేదు. ఆ ఎన్నికల్లో అర్వింద్‌ గెలుపునకు డీఎస్‌ రాజకీయ బలమూ తోడైందనేది నిర్వివాదాంశం. ధర్మపురి శ్రీనివాస్‌ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నా..ఆయన అనుచరులు అర్వింద్‌ గెలుపు కోసం పనిచేశారు.

తాజాగా..

ఇటీవల మున్నూరు కాపు కులస్థులు నిర్వహించిన అర్వింద్‌ సన్మాన సభకు డీఎస్‌ హాజరయ్యారు. ఈ పరిణామాలతో ఆయనకు.. తెరాసకు మధ్య దూరం పెరగటమే కాదు.. దాదాపుగా సంబంధాలు తెగిపోయినట్లుగా భావిస్తున్న తరుణంలో బుధవారం పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరయ్యారు. విలేకరులతో మాట్లాడుతూ తాను తెరాసకు ఏనాడూ దూరం కాలేదంటూ సమాధానమిచ్చారు. దీనిపై ఇందూరులో పెద్దఎత్తున చర్చ సాగింది. ఇంతలోనే గురువారం అమిత్‌ షాను కలిసినట్లు ప్రసార సాధనాలు, సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం రావటంతో మరో విధమైన చర్చ మొదలైంది.

ఏ చిన్న కదలిక అయినా..

నిజామాబాద్‌ రాజకీయాల్లో సీనియర్‌ నాయకుడిగా పేరున్న డీఎస్‌కు సంబంధించి.. ఏ కదలిక అయినా ఇదే తరహాలో చర్చ సాగుతూ వస్తోంది. ఆయన ఇతర పార్టీల పెద్దలను కలిసిన సందర్భంలో పలు విధాల ప్రచారం జరుగుతోంది.

 Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here