నకిలీ రుణం

0
2


నకిలీ రుణం

దళారులు, బ్యాంకు అధికారులు కుమ్మక్కు 
ఎడపల్లి సిండికేట్‌ బ్యాంకులో బాగోతం 
ఖాతాదారుల ఆందోళనతో వెలుగులోకి 
న్యూస్‌టుడే, ఎడపల్లి

దళారులు.. బ్యాంకర్లను మచ్చిక చేసుకొన్నారు. నకిలీ పట్టా పాసుపుస్తకాలు సృష్టించారు. వాటిని బ్యాంకులో తనఖా పెట్టి రూ.లక్షల్లో పంట రుణం పొందారు. సర్కారు రుణమాఫీ చేస్తే తమకు మాఫీ అవుతుందని.. తద్వారా లబ్ధి పొందాలని ప్రణాళికలు రచించారు. ఇలా ఎడపల్లి మండల కేంద్రంలోని సిండికేట్‌ బ్యాంకులో సుమారు 25-30 మంది రైతుల పేర రూ.కోటి వరకు కాజేశారు.

డపల్లి మండలానికి చెందిన కొందరు వ్యక్తులు సిండికేట్‌ బ్యాంకు అధికారులతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొన్నారు. మండలంలోని అంబం, ఎమ్మెస్సీ ఫారం, వడ్డేపల్లి, ఏఆర్సీ క్యాంపు, ఎడపల్లిలోని  ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నరైతులను ఎంచుకొన్నారు. వారికి కాసుల ఆశ చూపి బ్యాంకుకు తీసుకెళ్లారు. రుణం మొత్తం వారి ఖాతాలో జమ కాగానే నగదును డ్రా చేయించారు. వచ్చిన మొత్తంలోంచి కొంత వ్యక్తికి ఇచ్చి మిగతాది బ్యాంకు అధికారులు, దళారులు వాటాలు వేసుకొన్నారు.

నిబంధనలకు పాతర.. 
పంట రుణం పొందాలంటే నిజ పట్టాపాసు పుస్తకం, ఆధార్‌ కార్డు, ఖాతా పుస్తకాన్ని బ్యాంకు అధికారులకు చూపించి నకలు పత్రాలను అందించాలి. వాటిని పరిశీలించి రుణాన్ని మంజూరు చేస్తారు. బ్యాంకరు సహకారం ఉండటంతో ఇక్కడ మాత్రం ఎలాంటి నిజ ధ్రువపత్రాలు లేకుండానే తతంగం కానిచ్చారు.

బదిలీ వేటు..! 
ఇక్కడ గతంలో పని చేసిన బ్యాంకు మేనేజర్‌ హయాంలోనే అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. సదరు అధికారి అవినీతి బాగోతం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఆయణ్ను ఇక్కడి నుంచి బదిలీ చేశారన్న వాదన ఉంది. మేనేజర్‌కు సహకరించిన మరో అధికారిపైనా బదిలీ వేటు వేసినట్లు సమాచారం.

వీరి రుణం ఎవరు చెల్లిస్తారు? 
బాధితుల పేరిట తీసుకొన్న రుణ మొత్తాన్ని గతంలోని బ్యాంకు అధికారులు, దళారులు పంచుకొని జారుకొన్నారు. ఇది సుమారు రూ.కోటి వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ప్రస్తుత అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. బాధితులేమో తాము తీసుకొని రుణాన్ని ఎలా చెల్లించాలని వాపోతున్నారు. మరి వీరి పేరిట దళారులు పొందిన మొత్తాన్ని ఎవరు చెల్లిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.

లోతుగా విచారిస్తే.. 
దళారులు, బ్యాంకర్ల ఉచ్చులో ఇరుక్కుపోయిన బాధితులు మండలంలో భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపడితే మరిన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉంది. అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించి వారి నుంచి నగదు రికవరీ చేయాల్సి ఉంది. మరోసారి ఇలాంటి తప్పిదాలకు పాల్పడకుండా క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రుణాన్ని ఆపేశారు 
– లత, సంఘం సభ్యురాలు, ఏఆర్పీక్యాంపు 
మా సంఘంలో పది మంది సభ్యులం ఉన్నాం. మాలో ఒకరు పంట రుణం తీసుకున్నారని అంటున్నారు. నిజానికి ఆమెకు ఎలాంటి భూమి లేదు. ఆందోళనకు దిగితే రుణం ఇస్తామని చెబుతున్నారు.

తెలియకుండానే.. 
– లింగమ్మ, సంఘం అధ్యక్షురాలు, ఏఆర్పీక్యాంపు 
నేను ఏఆర్పీక్యాంపు మహిళా సంఘం గ్రామాధ్యక్షురాలిగా పని చేస్తున్నాను. గ్రామంలో ఏ సంఘానికైనా రుణం అందించాలంటే మాకు కనీస సమాచారం ఇవ్వాలి. బ్యాంకు అధికారులు మాత్రం చెప్పకుండానే మంజూరు చేస్తున్నారు. వారి తప్పిదంతో నిజమైన లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం 
– చంద్రశేఖర్‌, సిండికేట్‌ బ్యాంకు మేనేజర్‌, ఎడపల్లి 
రుణాల మంజూరులో అవకతవకలు జరిగినట్టు వస్తున్న ఆరోపణలను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వారి ఆదేశాలకు లోబడి పని చేస్తాం. ఖాతాదారులకు ఇబ్బందులు లేకుండా సేవలందించడానికి కృషి చేస్తాం.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here