‘నడిచే దేవుడు’ డా.శివకుమారస్వామి

0
4


‘నడిచే దేవుడు’ డా.శివకుమారస్వామి

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం : ‘నడిచే దేవుడి’గా లక్షలాదిమంది అభిమానాన్ని పొందిన సిద్ధగంగ పీఠం అధిపతి డా. శివకుమారస్వామి శివైక్యం చెందడంతో కన్నడ సీమ శోకసానగరంలో మునిగిపోయింది. కేవలం కర్ణాటకలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వున్న లక్షలాదిమంది భక్తులు దిగ్భ్రాంతి చెందారు. 111 ఏళ్ల పాటు జీవించిన స్వామి ఎనభై సంవత్సరాల పాటు పీఠం బాధ్యతలతో పాటు సాంఘిక సంస్కరణవాదిగా, విద్యావేత్తగా అనితర సేవలను అందించి భగవంతుని సన్నిధికి చేరుకున్నారు.

పేదవిద్యార్థులకు అండగా..

పీఠం బాధ్యతలు స్వీకరించిన స్వామి తొలినాళ్లలోనే విద్య ప్రాముఖ్యతను గుర్తించారు. అందుకనుగుణంగా అనేక విద్యాసంస్థలను పీఠం ఆధ్వర్యంలో ఏర్పాటుచేశారు. కేవలం లింగాయతులకే కాకుండా ఆర్థికంగా వెనుకబడిన అన్ని వర్గాల విద్యార్థులకు ఈ విద్యాసంస్థల్లో ప్రవేశం కల్పించారు.

అన్ని రాజకీయపక్షాలకు మార్గదర్శిగా..

కర్ణాటకలో కులాల వారీగా మఠాలున్నాయి. అయితే సిద్ధగంగ పీఠంలో అందరిని సమానంగా చూసేవారు. స్వామిని దర్శించుకునేందుకు అన్ని రాజకీయపక్షాలకు చెందిన వివిధ వర్గాల నేతలు వచ్చేవారు. ఆయన ఎప్పుడూ ఏ రాజకీయపక్షం వైపు మొగ్గుచూపకుండా తటస్థంగా వ్యవహరించేవారు. 1930లో పీఠాధిపతిగా సారథ్యం స్వీకరించిన అనంతరం మఠానికి ఆర్థికవనరులు తక్కువగా ఉండేవి. అయినా వెనుకంజ వేయకుండా విద్యాసంస్థలను ఏర్పాటుచేసి లక్షలాదిమంది విద్యార్థులకు అండగా నిలిచారు. ఇంజినీరింగ్‌, వైద్య, నర్సింగ్‌, ఫార్మసీ, ఉపాధ్యాయశిక్షణ కళాశాలతో పాటు అనేక ప్రాధమిక పాఠశాలలను ఏర్పాటుచేశారు. విద్యాసంస్థలకుచెందిన విద్యార్థులకు ఉచిత భోజనం కూడా అందించడం విశేషం.

 సమాజ సేవకు ప్రాధాన్యం

శివకుమారస్వామి నిరాడంబరత, సమాజసేవకు ప్రాధాన్యమిచ్చారు. నిత్యం భక్తులకు దర్శనమిచ్చేవారు. మఠం చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు పళ్లు, కూరగాయలు మఠానికి భక్తితో ఇచ్చేవారు. ఆయన మఠాధిపతిగా పగ్గాలు అందుకున్న సమయంలో 200 మంది విద్యార్థులుండగా నేడు ఆ సంఖ్య దాదాపు 10000కు చేరింది. కుల రహిత సమాజం నెలకొల్పాలన్నదే లింగాయత మత వ్యవస్థాపకుడు బసవన్న ఆశయం. ఆ ఆశయాన్ని నెరవెర్చేందుకు శివకుమార స్వామి నిరంతరం కృషి చేశారు.

Tags :

  • nullSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here