నాయకా… ఇటు చూడవా

0
10


నాయకా… ఇటు చూడవా

ప్రజారోగ్యం పట్టని ప్రజాప్రతినిధులు

●త్తాలేని ఆసుపత్రి అభివృద్ధి సంఘం

మూడేళ్లుగా సమావేశానికి నోచుకోని వైనం

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వైద్యవిభాగం

జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో 2016లో ఏర్పాటు చేసిన చివరి ఆసుపత్రి అభివృద్ధి సంఘం సమావేశం

‘‘నిత్యం 1,400కు తగ్గకుండా ఓపీ ఉండే జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి అభివృద్ధి సంఘం సమావేశం ఏర్పాటు చేసేందుకే వీరికి మూడేళ్లుగా తీరిక దొరకడంలేదు. ఇక పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.’’

జిల్లా ఆసుపత్రిలో ప్రగతి పనులు.. వైద్య పరికరాలు కొనుగోలు.. పరిపాలన విభాగంలో మార్పులు.. ఒప్పంద సిబ్బంది నియామకం.. ఇలా ప్రతి విషయాన్ని అభివృద్ధి సంఘం సమావేశంలో చర్చించి తీర్మానించాల్సి ఉంటుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి లేదా కనీసం ఆరు నెలల్లోపు ఒక్కసారైనా సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉండగా.. మూడేళ్లుగా ఒక్కసారైనా సమావేశమైన దాఖలాలు లేవు. దస్త్రాలు మాత్రం జడ్పీ కార్యాలయానికి పంపి ఛైర్మన్‌ సంతకాలు తీసుకొని మమ అనిపిస్తున్నారు.

సభ్యులు వీరే…

వైద్య కళాశాల ఏర్పడ్డాక జీవో నం.14, 874 ప్రకారం సంఘంలో స్వల్ప మార్పులు చేశారు. జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ సంఘం అధ్యక్షులుగా, కలెక్టర్‌ కో-ఛైర్మన్‌గా, అదనపు డీఎంఈ వైస్‌ఛైర్మన్‌గా, ఎంపీ, స్థానిక ఎమ్మెల్యేలు ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు సభ్యులుగా నగర మేయర్‌, ఒక సీనియర్‌ వైద్యులు, ఒక ఆర్‌ఎంవో, ముగ్గురు సీనియర్‌ ఆచార్యులు, నగర పాలక సంస్థ కమిషనర్‌, టీఎస్‌ఎంఐడీసీ ఇంజినీర్‌, ఐఎంఏ అధ్యక్షుడు, రెడ్‌క్రాస్‌ జిల్లా కార్యదర్శి, రోటరీ, లయన్స్‌క్లబ్‌ల సభ్యులు, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, స్వచ్ఛంద సంస్థ సభ్యుడు, సంఘసేవకుడు, స్వయం సేవక సంఘం సభ్యురాలు, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి, ఆసుపత్రి సమన్వయకర్త, వైద్య కళాశాల ప్రిన్సిపల్‌, కన్వీనర్‌.. సభ్యునిగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌, ప్రత్యేక ఆహ్వానితులుగా ఒక హౌజ్‌సర్జన్‌, ఒక పీజీ చేస్తున్న వైద్యుడు ఉండాలి.

పేరుకుపోయిన సమస్యలు

ఆసుపత్రి అభివృద్ధి సంఘం నిధులు సుమారు రూ.40-50 లక్షల వరకు మూడేళ్లుగా మూలుగుతున్నాయి. రక్తనిధిలో సరైన పరికరాలు లేవు. 20 మంది ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఒక్కరే పనిచేస్తున్నారు. ఒప్పంద పద్ధతిలో ఎల్‌టీలను తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆపరేషన్‌ థియేటర్లలో కొత్త పరికరాల ఆవశ్యకత ఉంది. ఇలా సంఘం సమావేశం లేక అనేక సమస్యలు పేరుకుపోయాయి.

కొత్తవారు స్పందించేనా?

గతంలోని జడ్పీ ఛైర్మన్‌ మూడేళ్లలో ఆసుపత్రి వైపు కన్నెత్తి చూడలేదు. కొత్తగా ఎన్నికైన జడ్పీ ఛైర్మన్‌, ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రి అయినా ఈసారి సలహా సంఘం ఏర్పాటు చేసి సమావేశం అవుతారా? లేదా? అనేది వేచి చూడాల్సిందే.

ఎవరు అధికారంలో ఉన్నా మొదటి ప్రాధాన్యం విద్య, వైద్యానికే ఇస్తారు. ఆ తర్వాతే మిగతా వాటిపై దృష్టి సారిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య సేవలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొంటున్నా.. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సమయం కేటాయించే పరిస్థితి లేకుండా పోయింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here