నిఘాకు మసక… దగాకుఎర

0
6


నిఘాకు మసక… దగాకుఎర

లేఖరులతో రిజిస్ట్రేషన్‌శాఖ సిబ్బంది కుమ్మక్కు

బిచ్కుంద కార్యాలయంలో బయటి వ్యక్తుల హవా

మూలన పడిన నిఘా పరికరాలు

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

అడ్డూ అదుపులేని వ్యవహారాలు.. బయట వ్యక్తుల ప్రమేయాలు.. సాంకేతిక సాయాన్ని అందుకోవడంలో వెనుకబాటు.. శాఖలో సమస్యలకు తోడు వ్యవస్థలోని లోపాలు.. మారని రిజిస్ట్రేషన్ల తీరు.. మెరుగుపడని సేవలు.. ఏది రిజిస్ట్రేషన్‌ కార్యాలయం.. ఏది దస్తావేజు లేఖరుల కార్యాలయమో తెలియని స్థితి.. అంతా కుమ్మక్కు వ్యవహారం.. వెరసి నిత్యదోపిడీ కొనసాగుతోంది. ఈ అవినీతి దందా గురించి ఉన్నతాధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు.

రిజిస్ట్రేషన్లు- స్టాంపుల శాఖ కార్యాలయాలు అవినీతికి నిలయాలుగా మారాయి. రూ.కోట్ల విలువైన క్రయవిక్రయాలు దళారుల కనుసన్నల్లోనే కొనసాగుతున్నాయి. రిజిస్ట్రేషన్లలో కీలకమైన దస్తావేజులను రాసే బాధ్యతలు అర్హత లేని లేఖరులు(డాక్యుమెంట్‌ రైటర్స్‌) చేపడుతున్నారు. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో దళారులు అవినీతి, అక్రమాలను ప్రోత్సహిస్తున్నారని గుర్తించిన ప్రభుత్వం వారి లైసెన్స్‌లు రద్దు చేసినా యథేచ్ఛగా అక్రమ దందా కొనసాగిస్తున్నారు. జిల్లాలోని బిచ్కుంద సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ‘ఈనాడు’ పరిశీలించగా పలు అక్రమాలు వెలుగు చూశాయి.

చక్రం తిప్పుతున్నారు

విలువైన ఆస్తుల సమాచారాన్ని భద్రపరిచే కార్యాలయాల్లో ఎంచక్కా బయటి వ్యక్తుల హవా కొనసాగుతోంది. ఏళ్ల తరబడి అధికారుల్ని మచ్చిక చేసుకొని చక్రం తిప్పుతున్నారు. కార్యాలయాలకు వచ్చేవారి పనుల్ని పూర్తి చేయిస్తూ చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. సిబ్బంది తక్కువగా ఉన్నప్పుడు దర్జాగా వారి కుర్చీల్లోనూ బైఠాయిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

చెప్పిందే శాసనం

బిచ్కుంద సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం పైఅంతస్తులో ఉండగా కింది భాగంలో ముఖద్వారానికి అనుకుని దస్తావేజు లేఖరుల దుకాణాలు ఉన్నాయి. ఇక్కడి దళారులు తాము చెప్పిందే వేదం..రాసిందే శాసనం అనే విధంగా అధికారులను, సిబ్బందిని శాసించే స్థాయికి ఎదిగారు. వీరంతా కలిసి లేఖరుల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంఘ నాయకుల ప్రధాన పని అధికారులను ప్రసన్నం చేసుకోవడం.. మామూళ్లు ముట్టజెప్పడమనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల దస్తావేజు లేఖరుల ఒత్తిడితో వాణిజ్య బ్యాంకుకు మార్టిగేజ్‌ చేసిన భూమిని వారికి తెలియకుండానే ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించడం గమనార్హం. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు వెళ్లింది.

వారి ద్వారా వస్తేనే పని

దళారుల ప్రమేయం లేకుండా క్రయవిక్రయదారులు రిజిస్ట్రేషన్లు చేయించుకొనేలా తగిన సదుపాయాలను సమకూర్చామని సర్కారు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంటోంది. దళారుల(దస్తావేజు లేఖరులు) ద్వారా వెళితేనే రిజిస్ట్రేషన్‌ తంతు చేపడుతున్నారు. నేరుగా వెళ్లితే అక్కడి సిబ్బంది అడ్డగోలు ప్రశ్నలు వేస్తూ క్రయవిక్రయదారులను ఇబ్బందులుకు గురిచేస్తున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here