నిలిచిన పదోన్నతుల పరిశీలన

0
1


నిలిచిన పదోన్నతుల పరిశీలన

రిజిస్ట్రార్‌ బలరాములుపై అధ్యాపకుల ఆగ్రహం

రిజిస్ట్రార్‌ బలరాములును చుట్టుముట్టిన అధ్యాపకులు, పొరుగు సేవల సిబ్బంది

తెవివి క్యాంపస్‌(డిచ్‌పల్లి), న్యూస్‌టుడే: తెలంగాణ విశ్వవిద్యాలయంలో గురువారం కెరీర్‌ అడ్వాన్స్‌ స్కీం ద్వారా ఆచార్యుల పదోన్నతుల (వేతనాల పెంపు) పరిశీలన ప్రక్రియకు అడ్డుకట్ట పడింది. టూటా ఆధ్వర్యంలో అధ్యాపకులు అడ్డుకోవడంతో అర్హుల దరఖాస్తుల పరిశీలన అర్ధాంతరంగా నిలిచిపోయింది. నోటిఫికేషన్‌లో కెరీర్‌ అడ్వాన్స్‌ స్కీం కింద అందరూ అధ్యాపకులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి, ఇప్పుడు కేవలం 2006-07, 2007-08 ఏడాదిలో చేరిన అధ్యాపకులకే పరిశీలన చేపట్టడం ఏమిటని రిజిస్ట్రార్‌ ఆచార్య బలరాములును టూటా అధ్యక్ష, కార్యదర్శులు రాజారాం, పున్నయ్య, అధ్యాపకులు ప్రశ్నించారు. కొందరికే న్యాయం చేయడం తగదని మండిపడ్డారు. 2014లో చేరిన అధ్యాపకుల నియామకానికి పాలక మండలి(ఈసీ)లో అభ్యంతరం వ్యక్తం చేసినందున అంతకు ముందు చేరిన 2007, 2008 ఏడాది అధ్యాపకుల ఏజీపీ పరిశీలన చేపట్టినట్లు రిజిస్ట్రార్‌ బదులిచ్చారు. 2014లో చేరిన అధ్యాపకులకు గతంలో పార్థసారథి ఇన్‌ఛార్జి వీసీగా ఉన్నప్పుడు క్రమబద్ధీకరణ చేశారని టూటా ప్రతినిధులు గుర్తు చేశారు. అధ్యాపకులందరి దరఖాస్తులను పరిశీలించాలని.. లేనిపక్షంలో ప్రక్రియ నిలిపేయాలని రిజిస్ట్రార్‌తో అధ్యాపకులు వాగ్వాదానికి దిగి ఆయన్ను వెంట తీసుకొని దరఖాస్తుల పరిశీలన(స్క్రూట్నీ) కొనసాగుతున్న కంప్యూటర్‌ సైన్స్‌ కళాశాల సెమినార్‌ హాలుకు చేరుకున్నారు. వీసీ ఆదేశాలతో 2007, 2008 ఏడాదిలో చేరిన 8 విభాగాల్లోని 12 మంది అధ్యాపకుల దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు ఐక్యూఏసీ డైరెక్టర్‌ అత్తర్‌ సుల్తానా చెప్పడంతో మిగతా అధ్యాపకులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీసీ, రిజిస్ట్రార్‌ ఆదేశాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆమెపై టూటా ప్రధాన కార్యదర్శి పున్నయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తీవ్ర గందరగోళం నడుమ పరిశీలన ప్రక్రియను నిలిపేస్తున్నట్లు రిజిస్ట్రార్‌ ప్రకటించారు. దీంతో పరిశీలనకు వివిధ ప్రాంతాల యూనివర్సిటీల నుంచి వచ్చిన విషయ నిపుణులు వెనుదిరిగారు. మూడేళ్ల తర్వాత పరిశీలన దాకా వచ్చిన కెరీర్‌ అడ్వాన్స్‌ స్కీం ప్రక్రియ అర్ధాంతరంగా నిలిచిపోవడంతో 2007, 2008 ఏడాదిలో చేరిన 12 మంది ఆచార్యులు అసహనం వ్యక్తం చేశారు. కొందరు అభ్యంతరం చెబితే తమ పదోన్నతుల ప్రక్రియ నిలిపేయడం ఏంటని రిజిస్ట్రార్‌తో వాదించారు.

వేతనాల రికవరీకి ఆదేశం

తెవివి క్యాంపస్‌(డిచ్‌పల్లి): తెవివిలో వీసీ అనిల్‌కుమార్‌ ఆదేశాలను తుంగలో తొక్కి రిజిస్ట్రార్‌ బలరాములు గతంలో తొలగింపునకు గురైన నలుగురు పొరుగు సేవల సిబ్బందికి అక్టోబరు నెల వేతనాలివ్వడం వివాదస్పదమైంది. ఇందులో కొందరు విద్యార్థి నాయకుల ఒత్తిడి ఉందనే విమర్శలు వెలువెత్తాయి. అంతేకాదు ‘ఈనాడు’ మినీలో సోమవారం ప్రచురితమైన ‘వద్దన్నా…ఇచ్చేశారు’ కథనం దుమారం రేపింది. రిజిస్ట్రార్‌ అత్యుత్సాహాన్ని పొరుగు సేవల సిబ్బంది, విద్యార్థి నాయకుల తప్పుబట్టారు. వేతనాలిచ్చిన విషయం వీసీ దృష్టికి వెళ్లడంతో రిజిస్ట్రార్‌ను పిలిపించుకొని తొలగించిన సిబ్బందిని ఎందుకు కొనసాగించి వేతనాలిచ్చారని మందలించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అక్రమంగా కొనసాగుతున్న సంపత్‌, శ్రావణ్‌(సారంగాపూర్‌ బీఈడీ క్యాంపస్‌), మల్లేషం, రాజాగౌడ్‌(భిక్కనూరు దక్షిణ ప్రాంగణం)లను తక్షణమే తొలగించి, వారికి జమ చేసిన వేతనాల నగదును రికవరీ చేయాలని రిజిస్ట్రార్‌కు వీసీ మౌఖిక ఆదేశాలిచ్చినట్లు వర్సిటీలో చర్చ నడుస్తుండటం గమనార్హం. తొలగింపునకు గురైన ఆ నలుగురు సిబ్బంది వెనుక ఉన్న విద్యార్థి నాయకులకు ఈ విషయం మింగుడు పడక హైరానా పడుతున్నారు.

వేతనాలివ్వాలని ధర్నా

తెవివి క్యాంపస్‌(డిచ్‌పల్లి): తెవివిలో రిజిస్ట్రార్‌ ఛాంబర్లో గురువారం కొందరు పొరుగు సేవల ఉద్యోగులు ధర్నా చేపట్టారు. తమకు జూనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులిచ్చి అకారణంగా తొలగించారని నినాదాలు చేశారు. తమకు జూనియర్‌ అసిస్టెంటు స్కేల్‌ వేతనాలివ్వాలని రిజిస్ట్రార్‌ను నిలదీశారు. తొలగింపునకు గురైన నలుగురిని సాగించి జీతాలు ఎలా వేశారంటూ ప్రశ్నించారు. తమకు వేతనాలు చెల్లించి, పదోన్నతులు కల్పించాలని పొరుగు సేవల సిబ్బంది పట్టుబట్టడంతో ఆయన తన ఛాంబర్‌ నుంచి వెళ్లిపోయారు.

‘ఫేక్‌ న్యూస్‌’పై నేడు సదస్సు

తెవివి క్యాంపస్‌(డిచ్‌పల్లి): తెవివిలో శుక్రవారం మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగం ఆధ్వర్యంలో ‘ఫేక్‌ న్యూస్‌ అరికట్టడం’పై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు విభాగాధిపతి ప్రభంజన్‌యాదవ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గూగుల్‌ న్యూస్‌ ఇనిషియేటివ్‌ శిక్షకులు గోపగాని సప్తగిరి ఉపన్యసిస్తారన్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న ఫేక్‌ న్యూస్‌ను గుర్తించడంతో పాటు పలు అంశాలపై అవగాహన కల్పిస్తారన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here