నూతన శకం ఆరంభం: గ్రామ వలంటీర్ల వ్యవస్థ ఆరంభం: రేపట్నుంచి విధుల్లోకి

0
2


నూతన శకం ఆరంభం: గ్రామ వలంటీర్ల వ్యవస్థ ఆరంభం: రేపట్నుంచి విధుల్లోకి

అమరావతి: రాష్ట్రంలో ఓ నూతన శకం ఆరంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం దీనికి నాంది పలికింది. కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ వలంటీర్ల వ్యవస్థ ఆరంభమైంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్ జగన్ ఈ వ్యవస్థను లాంఛనంగా ప్రారంభించారు. గ్రామ వలంటీర్లు.. శుక్రవారం నుంచి క్షేత్రస్థాయిలో విధుల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను అసలైన, అర్హులైన లబ్దిదారుల ఇంటి గుమ్మానికి చేర్చడమే ఈ వలంటీర్లు ప్రధాన విధి.

గ్రామ వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఒకటి కాదు, రెండు కాదు.. సుమారు మూడు లక్షలమందికి పైగా నిరుద్యోగ యువతకు ఉపాధి లభించింది. ప్రతినెలా వారికి 5000 నుంచి 6000 రూపాయల వరకు గౌరవ వేతనం అందుతుంది. ఒకకేసారి ఇన్ని లక్షల మందికి ఉపాధి లభించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి అని చెబుతున్నారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. మున్సిపల్, గ్రామీణాభివృద్ది, పంచాయతీ రాజ్ శాఖల పర్యవేక్షణలో వలంటీర్లు పనిచేయాల్సి ఉంటుంది.

వలంటీర్ ఉద్యోగం ఆషామాషీ కాదు..

వలంటీర్ల బాధ్యత ఆషామాషీగా ఉండదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గ్రామాల్లో 31 రకాల విధులను ప్రభుత్వం కేటాయించింది. సకాలంలో, పారదర్శకంగా సేవలను అందించడం వారి ముందున్న ప్రధాన లక్ష్యం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యానికి అనుగుణంగా అవినీతి రహితంగా ప్రభుత్వ సంక్షేమ ఫలాలను లబ్దిదారులకు అందజేయాల్సి ఉంటుందని చెబుతున్నారు అధికారులు. ఒక్కో వలంటీర్ తన పరిధిలోని 50 కుటుంబాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి గ్రామ పంచాయతీ కార్యదర్శికి నివేదించడం మొదలుకుని పింఛన్లు, చౌక ధరల దుకాణాల ద్వారా అందే నిత్యావసర సరుకులను లబ్దిదారులకు అందజేయడం వంటి పారదర్శకంగా చేయాల్సి ఉంటుందని, ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చూడాల్సిన బాధ్యత వలంటీర్లపై ఉందని అంటున్నారు.

రేపట్నుంచి ప్రతి ఇంటికీ..

శుక్రవారం నుంచి 23వ తేదీ వరకు వలంటీర్లకు కేటాయించిన కుటుంబాల వద్దకు వారు వెళ్లాల్సి ఉంటుంది. 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఇళ్ల స్థలాల కోసం సర్వే చేపట్టాల్సి ఉంటుందని ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి 10 వరకు చౌక డిపోల ద్వారా సరఫరా అయ్యే బియ్యం సంచులను తెల్లరేషన్ కార్డు గల కుటుంబాల ఇంటి వద్దకు చేర్చాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. అదే నెల 11 నుంచి 15వ తేదీ వరకు పెన్షన్లు, రేషన్‌ కార్డులు, ఇళ్ల స్థలాలు, రైతు భరోసా లబ్ధిదారుల గుర్తింపులను వలంటీర్లే జారీ చేయాల్సి ఉంటుంది. పైలట్‌ ప్రాజెక్టుగా నాణ్యమైన, ప్యాకింగ్‌ చేసిన బియ్యం పంపిణీని శ్రీకాకుళం నుంచి ప్రారంభిస్తారు. ఈ ఏడాది చివరి నాటికి అన్ని జిల్లాలో నాణ్యమైన, ప్యాకింగ్‌ చేసిన బియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం ఇదివరకు వెల్లడించింది. సెప్టెంబరు 15వ తేదీ తరువాత వలంటీర్లు శిక్షణ శిబిరాలను నిర్వహిస్తారు. 30వ తేదీ వరకు ఇది కొనసాగుతుంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here