నెల రోజుల కనిష్టానికి మార్కెట్లు ! వరుణుడి ఎఫెక్ట్

0
0


నెల రోజుల కనిష్టానికి మార్కెట్లు ! వరుణుడి ఎఫెక్ట్

స్టాక్ మార్కెట్ వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లో ముగిసి నెల రోజుల కనిష్టానికి దిగొచ్చింది. వరుసగా తొమ్మిదో రోజు కూడా లాభపడిన స్టాక్స్ కంటే నష్టపోయిన స్టాక్స్ జాబితానే ఎక్కువగా ఉంది. ఆఖరి గంటలో సెల్లింగ్ ప్రెషర్ అధికమవడంతో నిఫ్టీ 11800 పాయింట్ల మార్క్ దిగువకు పడిపోయింది. ఆశ్చర్యంగా అన్ని రంగాల సూచీలూ నష్టాల బాటలోనే ముగిశాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ షేర్లలో అమ్మకాలు మరింతగా పెరిగాయి. నిఫ్టీ ఆఖరి గంటలో ఏకంగా 40 పాయింట్లు కరిగిపోయి చివరకు 11823 పాయింట్ల దగ్గర ముగిసింది, 92 పాయింట్ల నష్టంతో. ఇక సెన్సెక్స్ 290 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 362 పాయింట్లు నష్టంతో ఈ వారాంతాన్ని ముగించాయి.

వరుణుడు మొహం చాటేయడం, జీడీపీ గణాంకాలపై రచ్చ సహా ఆసియా మార్కెట్ల నుంచి నెగిటివ్ సంకేతాలు మార్కెట్లను కిందికి దించాయి. మీడియా, ప్రైవేట్ బ్యాంక్స్, రియాల్టీ, ఆటో, బ్యాంకింగ్, ఎఫ్ఎంసిజి రంగ షేర్లలో అమ్మకాలు మరింతగా పెరిగాయి.

ఇన్ఫ్రాటెల్, సన్ ఫార్మా, వేదాంతా, ఎల్ అండ్ టి, పవర్ గ్రిడ్ స్టాక్స్ టాప్ ఫైవ్ గెయినర్స్‌గా నిలిచాయి. జీ ఎంటర్‌టైన్మెంట్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇండియాబుల్స్ హౌసింగ్, భారతి ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లూజర్స్ జాబితాలో నిలిచాయి.

జెట్ ఫైట్

వరుసగా ఏడో సెషన్‌లో కూడా నష్టపోయిన జెట్ ఎయిర్ అంతకంతకూ నీరసిస్తోంది. భవిష్యత్తు ఎంత మాత్రం ఆశాజనకంగా కనిపించకపోవడంతో స్టాక్ మరో పది శాతానికి పైగా పతనమైంది. ఇంట్రాడేలో రూ.78కనిష్టానికి పడిన స్టాక్ చివరకు 12 శాతం నష్టంతో రూ.82 దగ్గర క్లోజైంది.

అరబిందోపై అపనమ్మకం

తెలంగాణలోని బాచుపల్లి ప్లాంట్‌లో అరబిందో ఫార్మాకు చెందిన ఫినిష్డ్ డోసేజెస్ విభాగంలో వాళ్లు ఇస్తున్న డేటాలో లోపాలు ఉన్నట్టు యూఎస్ ఎఫ్ డి ఏ గుర్తించింది. ఇది కంపెనీపై ఉన్న నమ్మకానికి సంబంధించిన విషయం కావడంతో స్టాక్ 5 శాతానికిపైగా పడింది. చివరకు 3 శాతానికి పైగా నష్టాలతో రూ.617 దగ్గర క్లోజైంది స్టాక్.

కల్పతరువుకు కలిసొచ్చింది

ప్రముఖ పవర్ ట్రాన్స్‌మిషన్ సంస్థ కల్పతరు పవర్‌పై గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ ఫిలిప్ క్యాపిటల్ కవరేజ్ మొదలుపెట్టింది. బయ్ రేటింగ్ ఇస్తూ రూ.670ని టార్గెట్‌గా నిర్దేశించింది. దీంతో ఈ స్టాక్ రెండు శాతం వరకూ పెరిగింది.

రైట్స్.. రైట్ రైట్

జూన్ 24న భేటీ కాబోతున్న రైట్స్ సంస్థ బోనస్‌పై పాజిటివ్ నిర్ణయం తీసుకోబోతోందనే వార్తలు స్టాక్‌కు బూస్టింగ్ ఇచ్చాయి. ట్రేడింగ్ వాల్యూమ్స్ ఏకంగా నాలుగు రెట్లు పెరిగాయి. స్టాక్ ఆరు నెలల గరిష్టానికి చేరింది. చివరకు స్టాక్ 6 శాతానికి పైగా పెరిగి రూ.294 దగ్గర క్లోజైంది.

ఇండస్ ఇండ్ కష్టాలు

రీసెర్చ్ సంస్థ యూబీఎస్ ఇచ్చిన నివేదిక తర్వాత ఇండస్ ఇండ్ కష్టాలు తీరడం లేదు. వరుసగా స్టాక్‌ పతనమవుతూనే ఉంది. స్టాక్ ఈ రోజు కూడా మరో 4 శాతం పతనమై రూ.1411కి దిగొచ్చింది. ఈ మార్చి నెలలో కూడా రూ.1800 వరకూ వెళ్లిన స్టాక్ అక్కడి నుంచి పతనమవుతూనే ఉంది. చివరకు రూ.1427 దగ్గర స్టాక్ ముగిసింది.

లూజర్స్

ఇక లూజర్స్ జాబితాలో గృహ్ ఫైనాన్స్, జీ, డీఎల్ఎఫ్, ఐబీ హౌసింగ్, అంబుజా సిమెంట్స్ నిలిచాయి. ఈ స్టాక్స్ మూడు నుంచి ఐదు శాతం వరకూ పతనమయ్యాయి. వీటితో పాటు రిలయన్స్ క్యాపిటల్ 10 శాతం, పిసి జ్యువెలర్స్ 7 శాతం, రిలయన్స్ ఇన్ఫ్రా 5 శాతం, దివాన్ హౌసింగ్ 5 శాతం, నష్టపోయాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here