పంద్రాగస్టు పండుగ

0
5


పంద్రాగస్టు పండుగ

 బోధన్‌లో స్వాతంత్య్ర దినోత్సవ సంబురానికి స్వస్తి
 దశాబ్దాల సంప్రదాయానికి ఇక తెర
న్యూస్‌టుడే, ప్రగతిభవన్‌

పరేడ్‌ మైదానంలో ముస్తాబైన వొేదిక

స్వాతంత్య్ర వేడుకలకు ఉభయ జిల్లాల కేంద్రాలు ముస్తాబయ్యాయి. గురువారం కామారెడ్డిలోని ఇందిరాగాంధీ మైదానంలో జడ్పీ ఛైర్‌పర్సన్‌ దఫేదార్‌ శోభ, నిజామాబాద్‌లోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డిలు జాతీయ పతాకావిష్కరణలు చేయనున్నారు. ఇందుకు  కావల్సిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.

ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో ఎప్పుడూ నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ ప్రధాన వేడుకలను అధికారులు అనూహ్యరీతిలో రద్దు చేశారు. యేటా కన్నుల పండువగా జరిగే వేడుకను ఈసారి విద్యార్థులు, ప్రజలు చూడలేకపోతున్నారు. డబ్బు ఖర్చు పేరుతో అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశమైంది.

ఉమ్మడి జిల్లాలో ఒక్క బోధన్‌ డివిజన్‌లోనే ప్రతియేటా గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంలో ప్రధాన వేడుక నిర్వహించే ఆనవాయితీ ఉండేది. దానికి కారణం ఇది ఐఏఎస్‌ నోటిఫైడ్‌ డివిజన్‌ కావడం. 1990లో అప్పటి ఉప కలెక్టర్‌ సోమేష్‌కుమార్‌ దీనికి అంకురార్పణ చేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఎగురవేసిన తర్వాత ఉదయం 10 గంటల్లోపు ఇక్కడి విశాలమైన జూనియర్‌ కళాశాల మైదానంలో ప్రధాన వేడుక జరిగేది. ఆయా శాఖల అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు, పట్టణ పెద్దలు పాల్గొనేవారు. విద్యార్థుల పరేడ్‌ అద్భుతంగా ఉండేది. స్వాతంత్య్ర దినోత్సవ ప్రధాన వేడుకలో ఇక్కడి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొనేవారు. గణతంత్ర వేడుకను అధికార యంత్రాంగం నిర్వహించేది. ఉప కలెక్టర్‌/ఆర్డీవో డివిజన్‌ ప్రగతి నివేదికను వివరించాక సర్కారు, ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్థులు దేశభక్తి గేయాలతో సాంస్కృతిక ప్రదర్శలు ఇచ్చేవారు. పోటాపోటీగా జరిగే ప్రదర్శనలు విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేవి. ఇందుకోసం రోజుల తరబడి వారు శిక్షణ తీసుకొనేవారు. ప్రదర్శనలు ఇచ్చిన విద్యార్థుల్లో ఉత్తమంగా ఎంపిక చేసిన వాటికి  మాత్రమే బహుమతులు ఇచ్చే సంప్రదాయం చాలా ఏళ్లు కొనసాగింది.

విద్యార్థులకు తీపిగుర్తు
బహుమతులు ప్రైవేటు విద్యార్థులే దక్కించుకుంటున్నారనే భావనతో ఆరేళ్ల నుంచి మార్చారు. సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చే ప్రతి విద్యార్థి జట్టుకు జ్ఞాపికలు అందించేవారు. అధికారుల నుంచి జ్ఞాపికలు అందుకుంటున్న సమయంలో ఫొటోలు తీసుకొని విద్యార్థులు తీపిగుర్తుగా దాచుకునే వారు. ఉత్తమ ఉద్యోగులను గుర్తించి ప్రశంసాపత్రాలు అందించేవారు. పట్టణ ప్రజలు ఎంతో ఆసక్తితో ప్రధాన వేడుకను చూడడానికి వచ్చేవారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మైదానం సందడిగా కనిపించేది. ఇప్పుడదంతా గతమే అన్నట్లుగా మారింది.

వింత నిర్ణయం
జూనియర్‌ కళాశాల మైదానంలో దశాబ్దాల కాలంగా నిర్వహించిన జాతీయ పండగల ఖర్చు గరిష్ఠంగా రూ.50 వేలు ఉంటుంది. పురసంఘం మైదానాన్ని చదును చేసే బాధ్యతలు చూసేది. ఆహ్వాన పత్రికల ముద్రణ, ఉద్యోగుల కమెండేషన్‌ ఖర్చును డివిజన్‌ కార్యాలయం భరించేది. ప్రధాన వేడుకల వ్యయాన్ని తహసీల్దార్‌ కార్యాలయం చూసుకునేది. ప్రతియేడు పాటించిన సంప్రదాయాల ప్రకారం ఉన్నతాధికారుల నుంచి నిధులు మంజూరయ్యేవి. గతంలో ఉప కలెక్టర్లుగా పనిచేసిన ఐఏఎస్‌ అధికారులు, ఆర్డీవోలకు ఎక్కడా సమస్య ఉత్పన్నం కాలేదు. ఈసారి మాత్రం నిధులు పొందడం కష్టమవుతుందని చెప్పి వేడుకలను రద్దు చేశారు. అధికారులు తీసుకొన్న ఈ నిర్ణయం ప్రజలను తీవ్ర విచారానికి గురిచేస్తోంది.

నేడు ఎంపీపీ కార్యాలయంలో జెండా వందనం
గతంలోని సంప్రదాయాలకు భిన్నంగా ఈసారి ఎమ్మెల్యే మహ్మద్‌ షకీల్‌ ఆమెర్‌ జెండా వందనం మండల పరిషత్తు కార్యాలయంలో చేయనున్నారు. ప్రధాన వేడుక నిర్వహించడం లేదనే సమాచారం మేరకు ఎంపీపీ కార్యాలయానికి వెళ్తున్నారు. జెండా ఎగురవేశాక మిషన్‌ భగీరథ కార్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here