పగిలిన కిటికీలు.. విరిగిన తలుపులు

0
5


పగిలిన కిటికీలు.. విరిగిన తలుపులు

వర్షాకాలంలో బస్సుల్లో తప్పని ఇక్కట్లు

న్యూస్‌టుడే, కామారెడ్డి పట్టణం

  
 

సీట్ల కోసం పడరాని పాట్లు పడి బస్సెక్కగానే హమ్మయ్యా.. అని ఊపిరి పీల్చుకోవాల్సిన ప్రయాణికులు సమస్యలతో అయ్యో రామ.. అని బాధపడుతున్నారు. ప్రైవేటు వాహనాలను కాదని ఆర్టీసీ బస్సులో ప్రయాణానికి అధిక ప్రాధాన్యమిస్తున్నా ఆశించిన మేర సౌకర్యాలు లేక అగచాట్లు తప్పడం లేదు. వర్షం పడినప్పుడు బస్సు కిటికీలకు పక్కన కూర్చునేవారు తడిసిపోతున్నారు. ఏటా వానాకాలంలో సమస్య ఎదురవుతోంది. రాత్రి పూట చలికి ప్రయాణికులు వణుకుతున్నారు. అనుకోని ప్రమాదమేదైనా జరిగితే బస్సులో ప్రాథమిక చికిత్స డబ్బాలో మందులుండవు. విచిత్రమేమిటంటే చాలా వాటిల్లో ఈ డబ్బాలను తొలగించారు.

ఉభయ జిల్లాల్లో మొత్తం 6 బస్సు డిపోలున్నాయి. నిజామాబాద్‌ 1, 2, కామారెడ్డి, బోధన్‌, ఆర్మూర్‌, బాన్సువాడ డిపోల పరిధిలో 600 బస్సులు నడుస్తున్నాయి. 200 ఎక్స్‌ప్రెస్‌, లగ్జరీ, ఇంద్రలను ఆయా మార్గాల్లో ప్రవేశపెట్టారు. నిత్యం ఆయా బస్టాండుల మీదుగా దాదాపు 3 లక్షల మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఆర్టీసీకి రోజుకు రూ.72 లక్షల వరకు ఆదాయం సమకూరుతున్నా ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంలో మాత్రం విఫలమవుతోంది.

చిరిగిన సీట్లకు పోస్టర్లను అతికించారిలా..

ప్రయాణికులతో కిటకిట…

* నిజామాబాద్‌, కామారెడ్డి బస్టాండులు ప్రయాణికులతో ఎక్కువగా కిటకిటలాడుతుంటాయి. ఈ రెండు జిల్లా కేంద్రాల నుంచి 1.20 లక్షల మంది రాకపోకలు సాగిస్తుంటారు. మిగతా బోధన్‌, ఆర్మూర్‌, బాన్సువాడ డిపోల పరిధిలో మొత్తం 1.80 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. వీరికి ప్రయాణ ప్రాంగణాల్లో వసతుల లేమీతో చుక్కెదురవుతోంది.

* డొక్కు బస్సులతో కాలం వెళ్లదీస్తున్నారు. ‘పల్లె వెలుగు’లు అధ్వానంగా ఉన్నాయి. కిటికీలు సక్రమంగా లేవు. అద్దాలు ధ్వంసమయ్యాయి. సీట్లు చిరిగిపోయాయి.

* ‘ఎక్స్‌ప్రెస్‌’లు మొరాయిస్తున్నాయి. అత్యవపర పరిస్థితుల్లో ఉన్న వారు మాత్రమే ఆర్టీసీని ఆశ్రయిస్తున్నారు. దీనికి తోడు ప్రైవేటు వాహనాల జోరుకు కళ్లెం వేయడంలో యంత్రాంగం ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తోంది.

* ఉభయ జిల్లాల్లో 1,056 పంచాయతీలున్నాయి. వీటిలో 450 గ్రామాలకు బస్సులు వెళ్లడం లేదు. జనాభా 25.52 లక్షలు కాగా.. 432 మార్గాల్లో బస్సులు నడుస్తున్నాయి. పల్లెలకు వేస్తున్న బస్సులు ఏళ్ల నాటివి కావడంతో ప్రయాణికులకు అగచాట్లు తప్పడం లేదు. వర్షాకాలం, చలికాలంలో బస్సుల్లో కిటికీలు లేక అవస్థలు పడుతున్నారు. ఈ విషయమై పలుమార్లు ఆర్టీసీ అధికారులను కలిసి విన్నవించినా ఫలితం లేకుండా పోతోంది.

చిరిగిన సీట్లు

ఆశల ప్రయాణం

రోజుకు సాధారణంగా 400 బస్సులు సుమారు 38 వేల కి.మీ. ప్రయాణిస్తుంటాయి. 180 వరకు అరిగిపోయిన టైర్లతోనే ప్రయాణం చేస్తున్నాయి. కొత్త టైర్లను మార్చడంపై అధికారులు శ్రద్ధ చూపడం లేదు.

సీట్లు సక్రమంగా లేవు : అనిల్‌, బాన్సువాడ

పల్లె వెలుగు బస్సుల్లో వసతులు సక్రమంగా లేవు. టికెట్‌ ఛార్జీలతో ఆర్టీసీకి ఆదాయం సమకూరుతున్నా ఆశించిన మేర సౌకర్యాలు కల్పించడం లేదు. ఇక ప్రైవేటు బస్సుల్లో ప్రయాణికుల సంక్షేమాన్ని గాలికొదిలేసి, సెస్సు పేరిట అదనపు ఛార్జీలు మోపుతున్నారు.

ప్రయాణం..నరకం : సాయిలు, కరడ్‌పల్లి

ఆర్టీసీ బస్సులో ప్రయాణమంటే నరకం కనిపిస్తోంది. మా ఊరికి వచ్చే పల్లెవెలుగు బస్సులు సక్రమంగా లేవు. సీట్లు చిరిగిపోయాయి. రద్దీకి అనుగుణంగా సీట్లు లేక ఆటోలను ఎంచుకొనే పరిస్థితి.

అద్దాలు పగిలిన బస్సు

సేవలు మెరుగుపరుస్తాం : గణపతిరాజ్‌, డీవీఎం

ఆర్టీసీ సేవలను మెరుగు పరిచేందుకు కృషి చేస్తాం. పల్లెవెలుగు బస్సులు కొన్ని మాత్రమే బాగా లేవు. కొత్త వాటి కోసం ప్రతిపాదనలు పంపాం. ప్రయాణికులకు మెరుగైన సేవలందించడానికి కృషి చేస్తాం. ఎక్కడైనా సమస్యలుంటే డిపోలో ఫిర్యాదు చేస్తే స్పందించడానికి అవకాశం ఉంటుంది.

డిపోలు: 6

మొత్తం బస్సులు: 600

మార్గాలు: 432

నిత్యం రాకపోకలు సాగించే వారి సంఖ్య: సుమారు 3 లక్షలు

సాధారణ బస్సులు: 420

వసతులు లేనివి: 180Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here